ఈ రెండు నెలలు ఆగడం మంచిది!
మూలిగే నక్క మీద.. అనే సామెత బాలీవుడ్‌కి ఇప్పుడు సరిగ్గా వర్తిస్తుంది. అసలు బాలీవుడ్ సినిమాలకు ప్రేక్షకుల ఆధరణ కరువైంది.
By: Tupaki Desk | 22 March 2025 4:52 PM ISTకరోనా తర్వాత సినిమా ఇండస్ట్రీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఓటీటీల ప్రభావం ఎక్కువ కావడంతో సినిమాల థియేట్రికల్ రిలీజ్ పెద్ద భారంగా మారింది. గతంలోనే సక్సెస్ రేటు తక్కువ ఉండేది అంటే ఇప్పుడు మరింతగా తగ్గింది. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈమధ్య కాలంలో పెద్ద హీరోల సినిమాలు సైతం మినిమం వసూళ్లను రాబట్టలేక పోతున్నాయి. మినిమం గ్యారెంటీ హీరోల సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి. ఒకప్పుడు వంద కోట్ల వసూళ్లు సునాయాసంగా రాబట్టిన హిందీ సినిమా ఇప్పుడు పాతిక కోట్లకే కిందా మీదా పడే పరిస్థితి కనిపిస్తుంది. దాంతో థియేట్రికల్ రిలీజ్ కంటే డైరెక్ట్ ఓటీటీకి వెళ్దామని భావిస్తున్న వారు చాలా మంది ఉన్నారు.
మూలిగే నక్క మీద.. అనే సామెత బాలీవుడ్‌కి ఇప్పుడు సరిగ్గా వర్తిస్తుంది. అసలు బాలీవుడ్ సినిమాలకు ప్రేక్షకుల ఆధరణ కరువైంది. అడపా దడపా వస్తున్న సినిమాలను జనాలు పెద్దగా చూడటం లేదు. ఇలాంటి సమయంలో వచ్చిన ఐపీఎల్ మరింతగా ఇండస్ట్రీకి పెను భారంగా నిలిచింది. సినిమాలకు వీకెండ్‌లోనే వసూళ్లు నమోదు అవుతున్నాయి. అలాంటి వీకెండ్‌లో రెండు ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగనున్న నేపథ్యంలో సినిమాలకు ఎవరు వెళ్తారు. ఇండియాలో ఐపీఎల్ అంటే ఆ రెండు నెలలు క్రికెట్ పండుగ. ఆఫీస్‌ల సమయాలను సైతం మార్చే స్థాయిలో ఐపీఎల్ కి ఇండియాలో క్రేజ్ ఉంది. అలాంటి ఐపీఎల్ సందర్భంగా సినిమాల విడుదల అనేది కచ్చితంగా ఆత్మహత్యతో సమానం అనే అభిప్రాయంను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
ఐపీఎల్ నేటి నుంచి ప్రారంభం అయి మే చివరి వారం వరకు కొనసాగుతుంది. ఏప్రిల్, మే నెలల్లో అందుకే బాలీవుడ్ నుంచి ఒకటి రెండు మినహా పెద్దగా భారీ బడ్జెట్ సినిమాలు రావడం లేదు. ఆ ఒకటి రెండు సినిమాలు సైతం చివరి నిమిషంలో వాయిదా పడ్డా ఆశ్చర్యం లేదు. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ మాత్రమే కాకుండా అన్ని భాషల ఫిల్మ్ మేకర్స్ కూడా ఈ రెండు నెలలు సినిమాల విడుదల వాయిదా వేసుకుంటే బెటర్ అనే అభిప్రాయంతో ఉన్నారు. అందుకే కొందరు ఫిల్మ్ మేకర్స్ మెల్లగా తమ సినిమా షూటింగ్ పూర్తి కాలేదని, వీఎఫ్‌ఎక్స్ వర్క్ కారణం చెబుతూ వాయిదా వేస్తున్నారు. ప్రభాస్ రాజాసాబ్ సినిమా సైతం ఐపీఎల్ కారణంగా వాయిదా వేసి ఉంటారేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇటీవల అనుష్క ఘాటీ సినిమాను సైతం విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో ఐపీఎల్ కారణం కావచ్చు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటి అనేది మాత్రం క్లారిటీ లేదు. తమిళ్, మలయాళ సినిమాల రిలీజ్‌లు సైతం ఐపీఎల్ కారణంగా ప్రభావితం అవుతున్నాయి. వీకెండ్స్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లకు ఉండే ఆధరణ గురించి ఎంత చెప్పినా తక్కువే. సీజన్‌లు గడుస్తున్నా కొద్ది ఐపీఎల్‌కి ఆధరణ పెరుగుతూనే ఉంది. కనుక ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో సినిమాలను విడుదల చేయక పోవడం అనేది నూటికి నూరు శాతం మంచి నిర్ణయం అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలు సూపర్ హిట్ అయితే తప్ప ఈ ఐపీఎల్ సీజన్‌లో బాక్సాఫీస్ వద్ద మినిమం వసూళ్లు వచ్చే పరిస్థితి ఉండదు. కనుక కంటెంట్ పై పూర్తి నమ్మకం ఉన్న సినిమాలను మాత్రమే ఈ ఐపీఎల్ సీజన్‌లోనూ విడుదలకు సిద్ధం చేస్తున్నారు.