IPL 2025 లాంచ్: 'సాహో' శ్రద్ధా స్టన్నింగ్ షో
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 18వ ఎడిషన్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ ఉత్సవాన్ని ఎంజాయ్ చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రియులు ఎంతో ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తున్నారు.
By: Tupaki Desk | 18 March 2025 8:56 AM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 18వ ఎడిషన్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ ఉత్సవాన్ని ఎంజాయ్ చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రియులు ఎంతో ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తున్నారు. కోల్‌కతా- ఈడెన్ గార్డెన్స్‌లో మాజీ ఛాంపియన్లు కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే ఉత్కంఠభరితమైన మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుండగా మొదటి ఆట ప్రారంభానికి ముందు అద్భుతమైన ఉత్సవానికి ఏర్పాట్లు సాగుతున్నాయి.
ఈ ఘనమైన క్రీడా ఉత్సవంలో బాలీవుడ్ తారలు శ్రద్ధా కపూర్, వరుణ్ ధావన్ సహా పలువురు అందాల నటీమణులు ప్రదర్శన ఇస్తారు. హర్రర్ కామెడీ స్ట్రీ 2 విజయంతో ఇటీవల శ్రద్ధా కపూర్ చర్చల్లో నిలిచింది. ఇప్పుడు ఐపీఎల్ ప్రదర్శన కోసం సిద్ధమవుతుంటే ఫ్యాన్స్ లో అది ఉత్సాహం నింపుతోంది. స్ట్రీ 2లో అతిధి పాత్రలో కనిపించిన వరుణ్ ధావన్ కూడా శ్రద్ధాతో జాయినవుతున్నాడు. శ్రద్ధా- ధావన్ జంట ఇంతకుముందు దళపతి విజయ్ నటించిన తమిళ హిట్ థెరి రీమేక్ అయిన బేబీ జాన్‌లో చివరిగా కనిపించారు. బేబీ జాన్ బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయినా.. క్రీడారంభ ఉత్సవంలో వరుణ్ ధావన్ ప్రదర్శన కోసం అతని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
22 మార్చి 2025న సాయంత్రం 6:00 గంటలకు ప్రారంభమయ్యే ఐపీఎల్ వేడుక తారల ప్రదర్శనతో ప్రత్యేకంగా మారనుంది. సంగీతం, నృత్యం, వినోద కార్యక్రమాల ప్రత్యేక సమ్మేళనంతో ప్రారంభోత్సవ వేడుక ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఈ వేడుక జరుగుతుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం జరగనుంది. ఇది జియో హాట్‌స్టార్‌లోను ప్రసారమవుతుంది.
ఇక ఈ ఆరంభ ఉత్సవంలో కరణ్ ఔజ్లా- దిశా పటానీ ఎగ్జయిట్ చేసే ప్రదర్శనలతో ఐపిఎల్ 2025 ప్రారంభోత్సవాన్ని అబ్బురపరచబోతున్నట్లు సమాచారం. శ్రేయ ఘోషల్ గానాలాపన ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. అయితే ఐపిఎల్ నిర్వాహకుల నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.