బన్నీ సినిమాలు బడ్జెట్ వల్లే లేటవుతున్నాయా?
మైథలాజికల్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమా కోసం త్రివిక్రమ్ నటీనటులు, టెక్నికల్ టీమ్ ను ఎంపిక చేసే పనిలో ఉన్నాడట.
By: Tupaki Desk | 24 Feb 2025 5:32 AM GMTపుష్ప2 సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. బన్నీ తన తర్వాతి సినిమా కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేతులు కలుపుతున్నాడని అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. మైథలాజికల్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమా కోసం త్రివిక్రమ్ నటీనటులు, టెక్నికల్ టీమ్ ను ఎంపిక చేసే పనిలో ఉన్నాడట.
హారికా హాసినీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ పక్కన ఏ హీరోయిన్ నటిస్తుందా అని ఇప్పుడందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా బడ్జెట్ విషయంలో నిర్మాణ సంస్థలు కొన్ని విషయాల్లో డిస్కషన్స్ జరుపుతున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే త్రివిక్రమ్ సినిమా కంటే ముందుగా బన్నీ మరో సినిమాను చేయాలని చూస్తున్నాడట. సౌత్ లో స్టార్ డైరెక్టర్ గా పేరున్న అట్లీతో సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో ఈ సినిమా రానుంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అనౌన్స్‌మెంట్ అధికారికంగా వచ్చింది లేదు.
తాజా సమాచారం ప్రకారం బన్నీ- అట్లీ ప్రాజెక్టు ఫైనాన్షియల్ విషయాల వల్లే లేటవుతుందని తెలుస్తోంది. పుష్ప2 సినిమాకు రూ.250 కోట్ల పారితోషికాన్ని అందుకున్న బన్నీ ఈ సినిమాకు కూడా అంతే ఛార్జ్ చేస్తాడు. పాన్ ఇండియా డైరెక్టర్ కాబట్టి అట్లీ కూడా ఎంతలేదన్నా రూ.100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటాడు. అంటే కేవలం హీరో, డైరెక్టర్ రెమ్యూనరేషన్‌కే రూ.350 కోట్లు కేటాయించాల్సి వస్తుంది.
ఇవి కాకుండా మిగిలిన ఆర్టిస్టులకు, సినిమా నిర్మాణానికి కూడా భారీగా ఖర్చవుతుంది. ఈ విషయంలోనే సన్ పిక్చర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పుష్ప2 తో భారీ హిట్ అందుకున్న బన్నీ తర్వాతి మూవీకి బడ్జెట్ విషయంలో ఇలాంటి చిన్న చిన్న సమస్యలు రావడం విచిత్రంగా ఉన్నా, నిర్మాతలు తమ జాగ్రత్తలో తాముంటున్నారు. పరిస్థితులు చూస్తుంటే త్రివిక్రమ్, అట్లీ సినిమాలకు సంబంధించిన అనౌన్స్‌మెంట్స్ ఒకేసారి వచ్చేలా కనిపిస్తున్నాయి.