'డాకు మహారాజ్' టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
అంతేకాదు రెండు వారాల పాటు అదనంగా ఇంకో షో వేసుకోడానికి పర్మిషన్ ఇస్తూ, ఈ మేరకు తాజాగా జీవో జారీ చేసింది.
By: Tupaki Desk | 5 Jan 2025 3:15 AM GMTనందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ 'డాకు మహారాజ్'. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం, సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాకి ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. టికెట్ ధరల పెంపుతో పాటు, బెనిఫిట్ షోలకూ అనుమతి ఇచ్చింది. అంతేకాదు రెండు వారాల పాటు అదనంగా ఇంకో షో వేసుకోడానికి పర్మిషన్ ఇస్తూ, ఈ మేరకు తాజాగా జీవో జారీ చేసింది.
'డాకు మహారాజ్' సినిమా రిలీజయ్యే రోజు తెల్లవారుజామున ఉదయం 4 గంటల బెనిఫిట్ షోకి టికెట్ రేటును రూ. 500 ( జీఎస్టీతో కలిపి) గా నిర్ణయించారు. ఇది రకాల స్క్రీన్స్ లో కామన్ గా ఇదే రేటు ఉంటుంది. జనవరి 12వ తేదీ నుంచి జనవరి 25 వరకు రోజుకు 5 షోలను ప్రదర్శించుకోడానికి ఏపీ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. వాటికి మల్టీ ప్లెక్స్‌లో అదనంగా రూ.135 (జీఎస్టీతో కలిపి), సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.110 (జీఎస్టీతో కలిపి) వరకూ టికెట్ ధరను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు. అయితే తెలంగాణలో స్పెషల్ బెనిఫిట్స్ ఉంటాయా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
'పుష్ప 2: ది రూల్' సినిమాకి టికెట్ ధరలను భారీగా పెంచుకునేందుకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ముందురోజు రాత్రి 9.30 గంటల షోకు అదనంగా రూ.800 పెంచుకోడానికి పర్మిషన్ ఇవ్వడంతో, మల్టీప్లెక్స్‌లలో టికెట్ రేటు ఏకంగా రూ.1200లకు చేరింది. దీనిపై నార్మల్ ఆడియన్స్ నుంచి వ్యతిరేకత వ్యక్తం అయింది. అందుకే ఇప్పుడు సంక్రాంతికి విడుదల కాబోతున్న 'గేమ్ ఛేంజర్', 'డాకు మహారాజ్' సినిమాల హైక్స్ విషయంలో ఏపీ ప్రభుత్వం కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. అందుకే 'పుష్ప 2' పోలిస్తే హైక్స్ కాస్త తగ్గించారనే చెప్పాలి.
రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమాకి జనవరి 10 అర్ధరాత్రి 1 గంట బెనిఫిట్ షో టికెట్ రేటును పన్నులతో కలిపి రూ.600గా నిర్ణయించారు. ఆ తర్వాతి రోజు నుంచి రెండు వారాల పాటు మల్టీప్లెక్సుల్లో రూ.175, సింగిల్ స్క్రీన్ ధియేటర్లు రూ.135 చొప్పున టికెట్ ధరలను పెంచుకునేందుకు ఏపీ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరి 11 తేదీ నుంచి 23 తేదీ వరకూ ఇవే రేట్లతో 5 షోలకే అనుమతి ఇచ్చారు.
అయితే ''డాకు మహారాజ్'' సినిమాకి 'గేమ్ ఛేంజర్' కంటే తక్కువ హైక్స్ ఇచ్చారు. అయినప్పటికీ జనవరి 12 నుంచి 25 వరకూ అంటే 14 రోజుల పాటు ఈ ధరలు అమలులో ఉండటంతో పాటు, ఐదు షోల ప్రదర్శనకు అనుమతి ఇవ్వడం కలెక్షన్స్ పరంగా చాలా మేలు చేసే అంశం అని చెప్పాలి. టికెట్ రేట్లు పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
ఇటీవల సంధ్య థియేటర్ ఘటన, తదనంతర పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో సినిమాలకు ప్రత్యేక అనుమతులు ఉండబోవని సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే సినిమాల బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపునకు అనుమతి ఉండదు అని అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు. అయితే ముఖ్యమంత్రితో సినీ ప్రముఖుల భేటీ తర్వాత, టికెట్ రేట్లు మరియు స్పెషల్ షోలను మార్గనిర్దేశం చేయడానికి ఓ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి సినిమాలపై రేవంత్ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ఇక ''డాకు మహారాజ్'' విషయానికొస్తే, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో బాలకృష్ణ సరికొత్తగా కనిపించనున్నారు. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాబీ డియోల్, చాందినీ చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసింది.