Begin typing your search above and press return to search.

సూర్య అంత కష్టపడి ఏం లాభం?

ఇప్పుడు సూర్య సినిమా ‘కంగువ’ను మేకర్స్ బాహుబలి రేంజ్ సినిమా అని ఘనంగా చెప్పుకుంటూ వచ్చారు.

By:  Tupaki Desk   |   13 Nov 2024 12:30 AM GMT
సూర్య అంత కష్టపడి ఏం లాభం?
X

టాలీవుడ్ నుంచి బాహుబలి పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యాక.. మన ఇండస్ట్రీ నుంచే కాక ఇతర పరిశ్రమల నుంచి కూడా ఇలాంటి భారీ ప్రయత్నాలు చాలానే జరిగాయి. కానీ ‘బాహుబలి’ టార్గెట్‌గా చేసిన ఏ సినిమా కూడా ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయాయి. ఇండియాలోనే తమదే నంబర్ వన్ ఫిలిం ఇండస్ట్రీ అని ఫీలయ్యే కోలీవుడ్ నుంచి ‘బాహుబలి’ లక్ష్యంగా ‘పొన్నియన్ సెల్వన్’ సహా చాలానే కొన్ని చిత్రాలు వచ్చాయి కానీ వాటిలో ఏవీ బాహుబలికి దరిదాపుల్లో కూడా నిలవలేకపోయాయి.

ఇప్పుడు సూర్య సినిమా ‘కంగువ’ను మేకర్స్ బాహుబలి రేంజ్ సినిమా అని ఘనంగా చెప్పుకుంటూ వచ్చారు. వందల కోట్ల బడ్జెట్ పెట్టి భారీ స్థాయిలోనే ఈ సినిమాను రూపొందించారు. సూర్య సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో ప్రోమోలు, మేకింగ్ వీడియోలు చూస్తేనే అర్థమవుతోంది. ఈ సినిమా 2 వేల కోట్లు వసూలు చేస్తుందని నిర్మాత జ్ఞానవేల్ రాజా ఘనంగా స్టేట్మెంట్ కూడా ఇచ్చేశాడు.

ఐతే తీరా రిలీజ్‌కు రెండు రోజుల ముందు చూస్తే పరిస్థితి ఏమంత ఆశాజనకంగా కనిపించడం లేదు. ‘బాహుబలి’ పార్ట్-1, పార్ట్-2 రిలీజైనపుడు దానికి పోటీయే లేదు. తెలుగులో మహేష్ బాబు సినిమా ‘శ్రీమంతుడు’ రిలీజ్ కావాల్సి ఉంటే ‘బాహుబలి’ కోసమే దాన్ని వాయిదా వేసుకున్నాడు. మొత్తం థియేటర్లు ఆ సినిమాకు అప్పగించేశారు. ఇక ‘బాహుబలి-2’ విషయానికి వస్తే దానికి ఉన్న హైప్ దృష్ట్యా మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ దానికి దారి ఇచ్చేసింది. కానీ ‘కంగువ’కు ఇలాంటి ఆశాజనక పరిస్థితులు కనిపించడం లేదు.

తమిళనాట ఈ చిత్రానికి సరిపడా స్క్రీన్లు దొరకడం కష్టమవుతోంది. దీపావళికి రిలీజైన ‘అమరన్’ సినిమా బాాగా ఆడుతుండడంతో మూడో వారంలోనూ ఆ సినిమాకు పెద్ద సంఖ్యలో స్క్రీన్లు కొనసాగుతున్నాయి. తెలుగులో కూడా దీపావళి సినిమాలు బాగా ఆడుతుండగా.. కొత్తగా ‘మట్కా’ కూడా విడుదలవుతుండడంతో దానికీ థియేటర్లు ఇవ్వక తప్పని పరిస్థితుల్లో ‘కంగువ’కు వైడ్ రిలీజ్ దక్కలేదు. ఇక నార్త్ ఇండియాలో సినిమాకు ఆశించిన స్థాయిలో బజ్ క్రియేట్ కాలేదు.

థియేటర్ల కేటాయింపు సంగతి అలా పెడితే.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఆశించిన జోరు కనిపించడం లేదు. టికెట్ల కోసం జనాలేమీ ఎగబడట్లేదు. బుకింగ్స్ నెమ్మదిగా జరుగుతున్నాయి. రెండు రోజుల్లో రిలీజ్ ఉండగా ఇంకా బుకింగ్స్ పూర్తి స్థాయిలో మొదలు కాకపోవడం కూడా మైనస్ అవుతోంది. మొత్తంగా చూస్తే సూర్య అండ్ టీం ఎంత కష్టపడ్డప్పటికీ.. రాంగ్ రిలీజ్ టైమింగ్ ‘కంగువ’కు ప్రతికూలమైన పరిస్థితి కనిపిస్తోంది.