సీనియర్ హీరోని ఫాలో అవుతున్న నితిన్
అయితే ఏదో టీమ్ మొత్తం కలిసి ఒక ఇంటర్వ్యూ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తే ఇప్పుడు ప్రేక్షకులు చూడటం లేదు.
By: Tupaki Desk | 20 March 2025 11:27 AM ISTఈ రోజుల్లో సినిమా ఆడియన్స్ వరకు వెళ్లాలంటే ప్రమోషన్స్ చాలా కీలకంగా మారాయి. అయితే ఏదో టీమ్ మొత్తం కలిసి ఒక ఇంటర్వ్యూ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తే ఇప్పుడు ప్రేక్షకులు చూడటం లేదు. సినిమా లానే ప్రమోషన్స్ కూడ కొత్తగా ఉండాలనుకుంటున్నారు. దీంతో సినిమాను ప్రమోట్ చేయడం చిత్ర యూనిట్ కు పెద్ద సవాలుగా మారింది.
సినిమాపై బజ్ ను పెంచడం దగ్గర నుంచి అందరూ మూవీ గురించి మాట్లాడుకుని ఆడియన్స్ ను థియేటర్ల వరకు రప్పించేవి ప్రమోషన్సే. బాక్సాఫీస్ ఓపెనింగ్స్ విషయంలో కూడా ప్రమోషన్స్ కీలక పాత్ర పోషిస్తుండటంతో చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు ప్రతీ ఒక్కరూ తమ మూవీ ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.
సినీ ఇండస్ట్రీలో 40 ఏళ్లుగా అగ్ర హీరోగా కొనసాగుతున్న వెంకటేష్ సైతం రీసెంట్ గా తన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొని ప్రమోషన్స్ అనేవి సినిమా సక్సెస్ పై ఎలాంటి ఇంపాక్ట్ చూపుతాయో తెలియచేశారు. కేవలం ప్రమోషన్స్ వల్లే సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ నుంచి భారీ బ్లాక్ బస్టర్ అయిందని చెప్పొచ్చు.
ఇప్పుడు వెంకటేష్ ను చూసి టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కూడా అదే దారిలో వెళ్తున్నాడు. రియల్ లైఫ్ లో చాలా రిజర్వ్డ్ గా ఉండే నితిన్ తన తాజా చిత్రం రాబిన్‌హుడ్ ప్రమోషన్స్ కోసం తెగ కష్టపడుతున్నాడు. ఎప్పుడూ లేదని కాలేజ్ టూర్లు, మాల్స్ కు వెళ్లడం, వివిధ ఈవెంట్స్ కు వెళ్లడం, ఆఖరికి స్టేజ్ పై డ్యాన్సులు కూడా చేస్తున్నాడు.
వెంకటేష్ లానే చిత్ర యూనిట్ తో కలిసి నితిన్ ఫన్నీ ఇంటర్వ్యూలు, పాడ్ కాస్ట్‌లు చేస్తూ ప్రమోషన్స్ ద్వారా కూడా మంచి ఫన్ అందిస్తున్నాడు. మరి వెంకీ దారిలో వెళ్తున్న నితిన్ కు, ఆయన లానే ఆ స్థాయి సక్సెస్ దక్కుతుందా లేదా అనేది తెలియాలంటే రాబిన్ హుడ్ రిలీజ్ వరకు ఆగాల్సిందే. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన రాబిన్ హుడ్ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటించగా మార్చి 27న మూవీ ప్రేక్షకుల ముందుకొస్తుంది.