2023లో పైరసీ కారణంగా నష్టం రూ. 22,400 కోట్లు!
తమిళ రాకర్స్ సహా మాఫియా లెజెండ్స్ ఎవరి పని వారు చేసుకుపోతుంటే దానిని చూడటం తప్ప ఏమీ చేయలేని దుస్థితి.
By: Tupaki Desk | 28 Oct 2024 3:46 AM GMTపైరసీ కారణంగా ప్రతియేటా సినీపరిశ్రమకు జరుగుతున్న నష్టం ఎంతో తెలుసా? ఈ రిపోర్ట్ గురించి తెలిస్తే నోరెళ్లబెడతారు. ఇంత పెద్ద నష్టాన్ని కలుగజేస్తున్న పైరసీ మాఫియాపై విరుచుకుపడతారు. కానీ ఏం తెలిసినా ఎవరూ ఈ మాఫియా కాలి గోటిని కూడా తాకలేరు. ఎవరూ ఏమీ చేయలేరు. మాఫియా ముందే చెప్పి సినిమాలను కాపీ చేస్తూ సైబర్ క్రైమ్ కి ఏనాడో సవాల్ విసిరింది. తమిళ రాకర్స్ సహా మాఫియా లెజెండ్స్ ఎవరి పని వారు చేసుకుపోతుంటే దానిని చూడటం తప్ప ఏమీ చేయలేని దుస్థితి.
ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (IAMAI) `ది రాబ్ రిపోర్ట్` వివరాల ప్రకారం.. భారతదేశంలోని 51 శాతం మంది మీడియా వినియోగదారులు పైరేటెడ్ మూలాల నుండి కంటెంట్‌ను యాక్సెస్ చేస్తున్నారు. అలాగే 2023లో భారతీయ వినోద పరిశ్రమ రూ. 22,400 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం.. పైరసీ ప్రమాదాలను సమర్థవంతంగా తగ్గించాల్సిన అవసరాన్ని ఇది నొక్కి చెబుతోంది.
భారతదేశం పైరసీ ఎకానమీ పరిమాణం 2023లో రూ. 22,400 కోట్లుగా ఉంది. ఇది భారతదేశ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ పరిశ్రమ ద్వారా వచ్చే సెగ్మెంట్ వారీ ఆదాయానికి పూర్తి ఆపోజిట్‌గా నాల్గవ స్థానంలో ఉంది.
ఇందులో రూ. 13,700 కోట్లు సినిమా థియేటర్ల నుండి పైరసీ కంటెంట్ ద్వారా రాగా, రూ. 8,700 కోట్లు OTT ప్లాట్‌ఫారమ్‌ల కంటెంట్ నుండి వచ్చింది. 4,300 కోట్ల రూపాయల వరకు జీఎస్టీ నష్టపోయారని రిపోర్ట్ అందింది.
పైరసీ అనేది సినిమాలు, సంగీతం, సాఫ్ట్‌వేర్ సహా చాలా రకాల మేధో సంపత్తిని కాపీరైట్ తో సంబంధం లేకుండా అనధికారికంగా కాపీ చేయడం.. ఉపయోగించుకోవడం లేదా బయట అమ్మకాలు సాగించడం..దీనిని ఒక రకమైన దొంగతనంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది ఒరిజినల్ (సినిమా సంగీతం వగైరా) సృష్టికర్తల హక్కులను ఉల్లంఘించే నేరం. వారికి భారీగా ఆర్థిక నష్టాలను కలిగించడం కిందే లెక్క.
IAMAI డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ కమిటీ చైర్మన్ రోహిత్ జైన్, వాటాదారుల మధ్య సమిష్టి చర్య తక్షణ అవసరాన్ని నొక్కి చెప్పారు. భారతదేశంలో డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ అసాధారణ వృద్ధి కాదనలేనిది.. సినిమా వినోదం 2026 నాటికి రూ. 14,600 కోట్లకు చేరుకుంటుందని అంచనా. కానీ పైరసీ అందరినీ భయపెడుతోంది. దీనిని పరిష్కరించడానిక ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలో కీప్లేయర్స్..వినియోగదారులు ఏకం కావాలి అని అన్నారు. అధిక సబ్‌స్క్రిప్షన్ ఫీజులు, కావలసిన కంటెంట్ అందుబాటులో లేకపోవడం.. పైరేటెడ్ కంటెంట్ ని ఆశ్రయించడానికి కారణం. మల్టీ ప్లాట్ ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్‌లను మేనేజ్ చేయడంలో ఇబ్బందిని పేర్కొన్నారు.
ముఖ్యంగా 19 నుండి 34 సంవత్సరాల వయస్సు గల యువ ప్రేక్షకులు పైరసీని ఎక్కువగా అనుసరిస్తున్నారని, మహిళలు OTT షోలను ఇష్టపడుతున్నారని, పురుషులు క్లాసిక్ చిత్రాల వైపు మొగ్గు చూపుతున్నారని ఈ నివేదిక పేర్కొంది. ఆసక్తికరంగా పైరేటెడ్ కంటెంట్‌ను యాక్సెస్ చేసే వారిలో 64 శాతం మంది ప్రకటనల అంతరాయాలు ఉన్నప్పటికీ, ఉచితంగా ఆఫర్ చేసినట్లయితే ఓటీటీలపై ఆధారపడేందుకు సుముఖత వ్యక్తం చేసారు. కంటెంట్ ప్రొవైడర్లు తమ ధరల నమూనాలు పునరాలోచించాల్సిన అవసరాన్ని వెల్లడించారు. దాదాపు 70 శాతం మంది పైరేటెడ్ కంటెంట్ వినియోగదారులు తాము ఎలాంటి OTT సబ్‌స్క్రిప్షన్‌లను కొనుగోలు చేయకూడదని పేర్కొన్నట్లు రివ్యూ పేర్కొంది.