ప్రతీ రూపాయి అల్లు అర్జున్ పేరు మీదుగానే వస్తోందా?
ఇప్పుడు సుకుమార్ కూడా ఈ లిస్టులో చేరిపోయారనే కామెంట్లు వస్తున్నాయి. 'పుష్ప 2' క్రెడిట్ మొత్తం అల్లు అర్జున్ తీసుకెళ్ళిపోయారని అంటున్నారు.
By: Tupaki Desk | 17 Dec 2024 2:30 PM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన "పుష్ప 2: ది రూల్" చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తోంది. 11 రోజుల్లోనే ₹1409 కోట్ల గ్రాస్ వసూలు చేసి, హయ్యెస్ట్ కలెక్షన్లు రాబట్టిన మూడో భారతీయ చిత్రంగా.. 2024 టాప్ గ్రాసర్ గా నిలిచింది. హిందీలో ₹560 కోట్లకి పైగా వసూళ్లతో 'బాహుబలి 2' రికార్డ్ ను బ్రేక్ చేసింది. అయితే ఇప్పుడు ఈ సక్సెస్ క్రెడిట్ మొత్తం బన్నీకే దక్కుతోంది కానీ, డైరెక్టర్ సుకుమార్ కు మాత్రం తగినంత క్రెడిట్ దక్కడం లేదని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
"పుష్ప 2" సినిమా రిలీజైన తర్వాత ఎక్కడ చూసినా అల్లు అర్జున్ గురించే మాట్లాడుకుంటున్నారు. పుష్పరాజ్ గా ఆయన అధ్బుతమైన నటనను అమలాపురం నుంచి అమెరికా వరకూ అందరూ కొనియాడుతున్నారు. ముఖ్యంగా నార్త్ లో బన్నీ మ్యానియా మామూలుగా లేదు. కానీ పుష్పరాజ్ పాత్రని క్రియేట్ చేసిన దర్శకుడు, అలాంటి బ్లాక్ బస్టర్ మూవీని తెర మీదకు తీసొచ్చిన సుకుమార్ గురించి ఎవరూ మాట్లాడుకోవడం లేదు. సినిమా అంత పెద్ద హిట్టయినా.. డైరెక్టర్ మాత్రం తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకోలేకపోయారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
నిజానికి 'బాహుబలి' సినిమాలతో దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక విధంగా ప్రభాస్ కంటే ఎక్కువగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. RRR సినిమా విషయంలోనూ అలానే జరిగింది. ఇప్పుడు రాజమౌళి అంటే పేరు కాదు.. ఒక బ్రాండ్. దాని మీదనే ఇప్పుడు టికెట్లు తెగే పరిస్థితి ఉంది. జక్కన్న తర్వాత సందీప్ రెడ్డి వంగా సక్సెస్ ఫుల్ గా తనకంటూ సొంత బ్రాండ్ ఏర్పరచుకున్న డైరెక్టర్ అని చెప్పాలి. 'కబీర్ సింగ్' 'యానిమల్' సినిమాల్లో హీరోలకు ఎంత పేరొచ్చిందో, అంతకంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నారు సందీప్.
'KGF 2' సినిమాతో ప్రశాంత్ నీల్.. 'కల్కి 2898 AD' మూవీతో నాగ్ అశ్విన్.. బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల క్లబ్ లో చేరిన దర్శకులుగా నిలిచారు. అయినప్పటికీ హిందీలో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారనే టాక్ ఉంది. మేజర్ క్రెడిట్ హీరోలకే దక్కింది కానీ, డైరెక్టర్స్ మాత్రం హిందీలో తమకంటూ బ్రాండింగ్ ఏర్పరచుకోలేకపోయారు. ఇప్పుడు సుకుమార్ కూడా ఈ లిస్టులో చేరిపోయారనే కామెంట్లు వస్తున్నాయి. 'పుష్ప 2' క్రెడిట్ మొత్తం అల్లు అర్జున్ తీసుకెళ్ళిపోయారని అంటున్నారు.
నిజానికి 'పుష్ప 2'కి భారీ మార్కెటింగ్ చేసింది, సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళింది అల్లు అర్జున్ ఒక్కడే అని చెప్పాలి. ప్రచారాన్ని తన భుజాన వేసుకొని, దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలు తిరిగాడు. పాట్నా, కొచ్చి, చెన్నై, ముంబయి.. ఎక్కడికి వెళ్ళినా తోడుగా చీఫ్ గెస్టులు ఎవరూ లేకుండా ఒక్కడే వెళ్ళాడు. ఎక్కడికి వెళ్తే అక్కడి భాష మాట్లాడుతూ జనాలను ఆకట్టుకున్నాడు. కేవలం తన బ్రాండింగ్ తోనే సినిమాని ప్రమోట్ చేసుకున్నాడు. అదే సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న సుకుమార్.. నార్త్ లో జరిగిన ఒక్క ఈవెంట్ కు కూడా అటెండ్ అవ్వలేదు. హిందీలో ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. అందుకే ఉత్తరాది జనాలకు డైరెక్టర్ రిజిస్టర్ అవ్వలేదు.
ఇప్పుడు 'పుష్ప 2' సినిమాకి వస్తున్న ప్రతీ రూపాయి పుష్పరాజ్ అల్లు అర్జున్ పేరు మీదుగానే వస్తోందని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నార్త్ నుండి సౌత్ వరకు, ప్రతి మార్కెట్ లోనూ ఆయన పేరే వినిపించడానికి అసలు కారణం ఇదే. కానీ ఇక్కడ పుష్ప వరల్డ్ ని క్రియేట్ చేసిన సుకుమార్ కష్టాన్ని తక్కువ చేయటానికి లేదు. కాకపోతే బన్నీ బ్రాండ్ పాన్ ఇండియాకి బాగా రీచ్ అవ్వడంతో, దర్శకుడి పేరు పెద్దగా వినిపించడం లేదు అనుకోవాలి. రామ్ చరణ్ చేయబోయే సినిమాతో సుక్కూ నార్త్ ఇండియాలోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.