'పుష్ప 3' గురించి రచయిత కామెంట్స్ వైరల్
పుష్ప 3 : ది ర్యాంపేజ్ అనే టైటిల్ తో బన్నీ, సుకుమార్‌లు మరోసారి రాబోతున్నారు.
By: Tupaki Desk | 5 Dec 2024 4:05 PM GMTపుష్ప 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. నిర్మాతలు ముందు నుంచి చెబుతున్నట్లుగా దాదాపుగా 12 వేల స్క్రీన్స్‌లో సినిమా విడుదలైంది. మొదటి రోజు వసూళ్ల విషయంలో సరికొత్త రికార్డులను నెలకొల్పబోతుంది అంటూ క్లీయర్‌గా క్లారిటీ వచ్చింది. మొదటి రోజు రూ.300 కోట్ల వసూళ్ల మార్క్‌ను క్రాస్ చేయడం కన్ఫర్మ్ అని బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు. పుష్ప 2 సినిమా చివర్లో పుష్ప 3 గురించి క్లారిటీ ఇచ్చారు. పుష్ప 3 : ది ర్యాంపేజ్ అనే టైటిల్ తో బన్నీ, సుకుమార్‌లు మరోసారి రాబోతున్నారు.
పుష్ప 3 : ది ర్యాంపేజ్ టైటిల్‌తో రాబోతున్న మూడో పార్ట్ గురించి రచయిత శ్రీకాంత్ విస్సా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్ లోని కొన్ని కీలక డైలాగ్స్‌తో పాటు కథ డెవలప్ చేయడంలో శ్రీకాంత్ విస్సా పాత్ర చాలా ఎక్కువ ఉంది. ముఖ్యంగా పుష్ప అంటే ప్లవర్ కాదు ఫైర్ అనే డైలాగ్ శ్రీకాంత్ ఆలోచన నుంచి వచ్చిందే అని సమాచారం. పుష్ప మాస్టర్ మైండ్ సుకుమార్ అయితే, ఆయన వెనుక ఉన్న టీంలో శ్రీకాంత్ విస్సా పాత్ర అత్యంత కీలకంగా యూనిట్ సభ్యులు చెబుతూ ఉంటారు.
తాజాగా పుష్ప 3 గురించి శ్రీకాంత్ విస్సా మాట్లాడుతూ... మొదటి రెండు పార్ట్‌లతో పోల్చితే పుష్ప 3 మరింత గొప్పగా ఉంటుంది. కథ మరింత డెప్త్‌గా ఉండటంతో పాటు కొత్త పాత్రలు పరిచయం అవుతాయి. కథ, కథనం మరింత లోతుగా ఉంటుంది, పుష్ప స్థాయిని మరింతగా చూపిస్తూ మూడో పాత్ర ఉంటుంది అని ఆయన చెప్పుకొచ్చారు. పుష్ప 3 కోసం ఇప్పటికే స్టోరీ లైన్ రెడీగా ఉందని ఆయన మాటలను బట్టి అర్థం అవుతుంది. పుష్ప ప్రాంచైజీలో మూడో పార్ట్ చివరిదా అంటే చెప్పలేం అన్నట్లుగా ఆయన నుంచి సమాధానం వచ్చింది.
పుష్ప రెండు పార్ట్‌లకు దర్శకుడు సుకుమార్ అయిదు సంవత్సరాలు తీసుకున్నారు. అల్లు అర్జున్ ఈ సినిమా కోసం అయిదు ఏళ్ల సమయం ఇచ్చారు. మూడో పార్ట్ వెంటనే ప్రారంభించకుండా కాస్త సమయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ గ్యాప్‌లో అల్లు అర్జున్ తన తదుపరి సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నారు, సుకుమార్ తన తదుపరి సినిమాను రామ్ చరణ్ తో చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. రామ్ చరణ్ తో సుకుమార్ చేయబోతున్న సినిమాకు శ్రీకాంత్ విస్సా రచన సహకారం అందించబోతున్నారట. చరణ్ తో సుక్కు సినిమా సైతం ఓ రేంజ్‌లో ఉంటుందని అంటున్నారు.