యానిమల్ - రామాయణం తర్వాత ఈ సీక్వెల్‌లో?
అయితే యానిమల్ లాంటి యాక్షన్ సినిమా చేశాక ఎలాంటి సినిమా చేయాలి? అనేదానికి రణబీర్ ఎంపిక ఆశ్చర్యపరిచింది.
By: Tupaki Desk | 24 Nov 2024 8:21 AM GMTరణబీర్ కపూర్ కెరీర్ లో ఎన్నో క్లాసిక్ హిట్ చిత్రాల్లో నటించినా వాటన్నిటి కంటే మెరుగైన కమర్షియల్ హిట్ చిత్రం- యానిమల్. రక్తపాతం, హింసాత్మక కంటెంట్ కారణంగా చాలా విమర్శలు ఎదురైనా, చివరికి రణబీర్ కపూర్ అనే నటుడిని పాన్ ఇండియాలో ఓ వెలుగు వెలిగేలా చేసిన ఏకైక సినిమా సందీప్ రెడ్డి వంగా- యానిమల్. ఇందులో ఎలాంటి సందేహాల్లేవ్.
అయితే యానిమల్ లాంటి యాక్షన్ సినిమా చేశాక ఎలాంటి సినిమా చేయాలి? అనేదానికి రణబీర్ ఎంపిక ఆశ్చర్యపరిచింది. అతడు దంగల్ ఫేం నితీష్ తివారీ `రామాయణం`లో నటిస్తున్నాడు. ఇందులో శ్రీరాముడిగా నటిస్తున్నాడు. ఈ పాత్ర ఎంపికపైనా చాలా విమర్శలు వెల్లువెత్తినా చివరికి అతడి అభిమానులను ఇది చాలా ఎగ్జయిట్ చేసింది. తదుపరి భన్సాలీతో రణబీర్ లవ్ అండ్ వార్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
రామాయణం- లవ్ అండ్ వార్ (రొమాన్స్ చారిత్రక యుద్ధం నేపథ్యంలో) తర్వాత అతడి ఎంపిక ఎలా ఉండాలి? అనేదానికి ఇప్పుడు సమాధానం వచ్చింది. అతడు ప్రకాష్ ఝా రాజ్ నీతి సీక్వెల్ లో నటించేందుకు ఆస్కారం ఉందనేది ఒక విశ్లేషణ. ఝా ఇప్పటికే సీక్వెల్ కథను రాస్తున్నారు. స్క్రిప్టు మొత్తం రెడీ అయ్యాక రణబీర్ కి వివరిస్తారని సమాచారం. భారతదేశంలోని అత్యుత్తమ పొలిటికల్ థ్రిల్లర్‌లలో ఒకటిగా రాజ్ నీతి పరిగణలో ఉంది. ఎంపిక చేసుకున్న కథ, కథనానికి తగ్గట్టు స్టార్లు కుదిరిన చిత్రమిది. రణబీర్ ఇందులో సమర్ ప్రతాప్ అనే నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో జీవించాడు. అతడి పాత్రకు కొనసాగింపుతో కథ ఉంటుదని ఝా చెబుతున్నారు. సమర్ ప్రతాప్ నెగిటివ్ షేడ్ కూడా అప్పట్లో సినిమా విజయానికి దోహదపడింది. అతని పాత్రను కొనసాగించేందుకు అవసరమైన సరంజామా ఉంది. రాజ్ నీతి 2లో నటిస్తే అది రణబీర్ కి ప్లస్ అవుతుందని అంచనా.
ఆసక్తికరంగా ఈ చిత్రాన్ని `మహాభారతం` ఆధునిక వెర్షన్‌గా పరిగణిస్తారు. కారణం రణబీర్ -అజయ్ పాత్రలు వరుసగా అర్జునుడు, కర్ణుడిపై ఆధారపడి రాసుకున్నవి కావడమే. రాజ్ నీతి 2తో బ్లాక్ బస్టర్ సాధించి తిరిగి తన స్థానాన్ని మెరుగుపరుచుకోవాలనే కసితో ప్రకాష్ ఝా లాంటి సీనియర్ దర్శకులు పని చేస్తున్నారని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనతో ప్రతిదీ క్లారిటీ వస్తుందేమో! కాస్టింగ్ ఎంపికల గురించి అధికారిక ప్రకటన తర్వాతే స్పష్ఠత వస్తుంది.