దళపతి విజయ్‌కి 'జనసేన' స్ఫూర్తి?
రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్న దళపతి విజయ్ .. తన చిట్టచివరి చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 29 Jan 2025 6:30 PM GMTరాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్న దళపతి విజయ్ .. తన చిట్టచివరి చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా టైటిల్ ని ప్రకటించారు. ఈ చిత్రానికి 'జన నాయగన్' అనే ఆసక్తికర టైటిల్ ని ఎంపిక చేసారు. ఈ టైటిల్ వినగానే పవన్ కల్యాణ్ అభిమానులు చాలా ఖుషీ అయ్యారు. నిజానికి వారి ఫీలింగ్ ఇలా ఉంది. ''టాలీవుడ్ పవర్ స్టార్ 'జనసేన' పార్టీ టైటిల్ ని, కోలీవుడ్ పవర్ స్టార్ మూవీ టైటిల్ ప్రతిధ్వనిస్తోంద''ని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
టాలీవుడ్ పవర్‌స్టార్ తో కోలీవుడ్ పవర్‌స్టార్ విజయ్ కి కొన్ని పోలికలు ఉన్నాయని వారు చెబుతున్నారు. ఆ ఇద్దరూ సామాన్య బడుగు జీవుల గురించి ఆలోచించే వ్యక్తులు. నటులుగా, రాజకీయ నాయకులుగాను వారి పంథా ఇంచుమించు ఒకేలా ఉంటుంది. తలకు ఎర్ర కండువా చుట్టుకుని మార్స్కిజాన్ని ఇష్టపడేవాడిగా పవన్ చాలా కాలం కనిపించారు. ఇటీవల రాజకీయంగా భాజపాతో అలయెన్స్ కారణంగా కాషాయాన్ని, ఆధ్యాత్మిక పంథాను సమర్థిస్తూ ముందుకు సాగుతున్నా కానీ, అంతకుముందు కమ్యూనిస్ట్- ప్రజా నాట్యమండలి భావజాలాలను పవన్ ప్రదర్శించారని గుర్తుంచుకోవాలి. సామాన్య ప్రజలలో జనసేనాని ఇమేజ్ పెంచుకుంటుండగా, ఇప్పుడు దళపతి విజయ్ కూడా కామన్ పీపుల్ అజెండాతోనే తన పార్టీని స్థాపించి ప్రచార కార్యక్రమాల్లో ఉన్నారు.
ఇలాంటి సమయంలో పీపుల్స్ లీడర్ గా అతడు 'జన నాయగన్' అనే టైటిల్ ని పెట్టుకుని సినిమా తీస్తుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దళపతి విజయ్ చివరి చిత్రం టైటిల్ తమిళనాడులో వేవ్స్ క్రియేట్ చేస్తోంది. అధికారికంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టే ముందు విజయ్ చివరి సినిమా కావడంతో ఫ్యాన్స్ లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ముఖ్యంగా టైటిల్ ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఈ చిత్రానికి కెవిఎన్ ప్రొడక్షన్స్ నిధులు సమకూరుస్తోంది. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది విజయ్ కెరీర్లో ఒక ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్‌గా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. టైటిల్ పోస్టర్ లో ఎత్తైన వేదికపై నిలబడి తన మద్దతుదారులతో సెల్ఫీ తీసుకుంటూ కనిపించాడు దళపతి. ఈ నేపథ్యం విజయ్ను పీపుల్స్ లీడర్‌గా ఆవిష్కరిస్తోంది. నిజానికి ఈ చిత్రానికి 'నాలై తీర్పు' అని టైటిల్ పెట్టారని పుకార్లు వచ్చాయి. కానీ చివరికి 'జన నాయగన్'గా ఖరారైంది. ప్రతిభావంతుడైన అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఎన్బీకే నటించిన 'భగవంత్ కేసరి'కి అధికారిక రీమేక్ అని పుకార్లు వినిపిస్తున్నా కానీ దానిపై ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.