Begin typing your search above and press return to search.

అల్లరి నరేష్ 18 కోట్లు.. మళ్ళీ ఎప్పటికో?

రాజేంద్రప్రసాద్, సీనియర్ నరేష్ తర్వాత టాలీవుడ్ లో కామెడీ హీరో అనే ముద్ర అల్లరి నరేష్ కి వచ్చింది.

By:  Tupaki Desk   |   25 Aug 2024 2:30 PM GMT
అల్లరి నరేష్ 18 కోట్లు.. మళ్ళీ ఎప్పటికో?
X

స్టార్ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ తనయుడిగా అల్లరి నరేష్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. మొదటి సినిమా అల్లరినే తన ఇంటి పేరుగా నరేష్ మార్చేసుకున్నారు. తరువాత వరుసగా కామెడీ కథలతో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. రాజేంద్రప్రసాద్, సీనియర్ నరేష్ తర్వాత టాలీవుడ్ లో కామెడీ హీరో అనే ముద్ర అల్లరి నరేష్ కి వచ్చింది. అయితే ఆ బ్రాండ్ కొంతకాలం పాటు అతనికి మంచి ఇమేజ్ తీసుకొచ్చింది.

2012లో వచ్చిన సుడిగాడు సినిమా వరకు కామెడీ హీరోగా నరేష్ స్పీడ్ ని ఎవరూ అడ్డుకోలేకపోయారు. కితకితలు, సీమశాస్త్రీ, బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్, సిద్దు ఫ్రమ్ సికాకుళం, బెండు అప్పారావు ఆర్.ఎం.పి, బెట్టింగ్ బంగార్రాజు, కత్తి కాంతారావు, ఆహా నా పెళ్ళంటా, సీమ టపాకాయ్, సుడిగాడు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ని అల్లరి నరేష్ అందుకున్నారు. ఇవి కాకుండా మిగిలిన సినిమాలలో చాలా వరకు కమర్షియల్ గా వర్క్ అవుట్ అయ్యాయి.

2010లో అల్లరి నరేష్ నుంచి ఏకంగా 6 సినిమాలు థియేటర్స్ లోకి వచ్చాయి. 2012 వరకు ప్రతి ఏడాది 3-4 సినిమాలని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఆయన కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా సుడిగాడు మూవీ నిలిచింది. ఈ సినిమా ఏకంగా 18 కోట్ల షేర్ కలెక్షన్స్ ని లాంగ్ రన్ లో సొంతం చేసుకుంది. నరేష్ కెరియర్ పరంగా కూడా సుడిగాడు చివరి బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పాలి. హిట్ సినిమాల స్పూఫ్ లతో ఈ మూవీ తెరకెక్కింది. తమిళంలో హిట్ అయిన తమిళ్ పదం రీమేక్ గా భీమినేని శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు.

ఆ తరువాత కూడా వరుసగా కామెడీ కథలతో నరేష్ మూవీస్ చేస్తూ వస్తోన్న కమర్షియల్ సక్సెస్ లు మాత్రం అందుకోలేదు. నరేష్ మార్కెట్ కూడా నెమ్మదిగా డ్రాప్ అవుతూ వచ్చింది. దీంతో జోనర్ మార్చి కంప్లీట్ సీరియస్ కాన్సెప్ట్ తో నాంది అనే సినిమా చేసి అల్లరి నరేష్ సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా అత్యధికంగా 9.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. దాని తర్వాత మరల సీరియస్ స్టోరీస్ ట్రై చేసిన అంతగా వర్క్ అవుట్ కాలేదు. చివరిగా ఆ ఒక్కటి అడక్కు సినిమాతో నరేష్ ప్రేక్షకుల ముందుకొచ్చారు.

ఈ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. ఈ మూవీ 2 కోట్ల షేర్ ని లాంగ్ రన్ లో అందుకుంది. అయితే నాందికి ముందు చేసిన సినిమాలు అయితే కనీసం 1.50 కోట్ల షేర్ ని కూడా అందుకోలేకపోయాయి. సుడిగాడు సినిమా సీక్వెల్ చేయాలనే ఆలోచనలో నరేష్ చాలా కాలం నుంచి ఉన్నారు. దానికి స్టోరీ కూడా అతనే సమకూర్చనున్నారంట. మరో వైపు త్వరలో బచ్చలమల్లి అనే సినిమాతో నరేష్ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఈ సినిమాలో రౌడీ షీటర్ గా అతని పాత్ర ఉండబోతోంది. రియల్ లైఫ్ క్యారెక్టర్ స్ఫూర్తితో ఈ సినిమాని డైరెక్టర్ సుబ్బు తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీతో బ్లాక్ బస్టర్ కొడతాననే నమ్మకంతో నరేష్ ఉన్నారు. అయితే సుడిగాడు తరహాలో 18 కోట్ల షేర్ కలెక్షన్స్ ని నరేష్ మరల ఎప్పుడు అందుకుంటాడో చూడాలి.