Begin typing your search above and press return to search.

బన్నీ వాస్ చెప్పినట్టు ఇదిలాగే కొనసాగితే కష్టమే!

అదే జరిగితే రానున్న రోజుల్లో పెద్ద హీరోలకు కూడా 30-40 శాతం థియేట్రికల్ బిజినెస్ తగ్గిపోతుందని విశ్లేషించారు.

By:  Tupaki Desk   |   20 July 2024 11:46 AM GMT
బన్నీ వాస్ చెప్పినట్టు ఇదిలాగే కొనసాగితే కష్టమే!
X

'ఆయ్' సినిమా ప్రెస్ మీట్ లో జీఏ2 పిక్చర్స్ నిర్మాత బన్నీ వాస్ ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితులు, ఎగ్జిబిటర్స్ కష్టాలు, ఎర్లీ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి మాట్లాడారు. ఈరోజుల్లో సినిమా బాగుంది అని మౌత్ టాక్ వస్తేనే జనాలు థియేటర్లకు వస్తున్నారని అన్నారు. పెద్ద సినిమాలు లేట్ అవ్వడం, సినిమాలను 21 రోజుల్లోనే ఓటీటీకి ఇవ్వడం వంటివి ఇలానే కొనసాగితే, రాబోయే రోజుల్లో 50 శాతం సింగిల్ స్క్రీన్స్ కనుమరుగై పోతాయన్నారు. అదే జరిగితే రానున్న రోజుల్లో పెద్ద హీరోలకు కూడా 30-40 శాతం థియేట్రికల్ బిజినెస్ తగ్గిపోతుందని విశ్లేషించారు.

బన్నీ వాస్ మాట్లాడుతూ.. "థియేటర్ సిస్టమ్ నాశనం అయిపోతుందనేది మీడియాకి ప్రొడ్యూసర్స్ కి అందరికీ తెలిసిన విషయమే. హిందీ, మలయాళ చిత్ర పరిశ్రమలు దాన్ని కరెక్ట్ చేసుకొని ముందుకి వెళ్తున్నాయి. మన తెలుగు ఇండస్ట్రీలో అందరం మాట్లాడుతున్నాం కానీ ఏదీ జరగడం లేదు. జనాలను మళ్ళీ థియేటర్లకు రప్పించడానికి ఓటీటీ రిలీజ్ గ్యాప్ పెంచాలని మీటింగ్స్ లో మాట్లాడుకుంటున్నాం. కానీ ఆఫీసులకు వెళ్ళాక ఎవరి సినిమా వాళ్ళదే, ఎవరి డబ్బులు వాళ్లవే. ఎవరైనా ఒక్క సినిమాని ఇస్తే మొత్తం రూల్ అంతా బ్రేక్ అయిపోతుంది. ఫిలిం ఛాంబర్ లో ఎగ్జిబిటర్స్ తో సహా అందరం కూర్చొని మాట్లాడుకుని కలసి కట్టుగా ఉంటే తప్ప ఇది అవ్వదు" అని అన్నారు.

"ఫ్రాన్స్ లో ఒక సినిమా థియేటర్లో 100-120 రోజులు ఆడిన తర్వాతే ఓటీటీ లేదా శాటిలైట్ కి వెళ్ళాలనే రూల్ వుంది. థియేటర్ వ్యవస్థ చచ్చిపోతుందని, దాని వల్ల ఎంప్లాయిమెంట్ పోతుందని అక్కడి ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకుంది. మన గవర్నమెంట్ కూడా అలాంటి సిస్టమ్ ను తీసుకొచ్చి, ఇన్ని రోజులు కచ్ఛితంగా ధియేటర్ లో ఆడాలి.. అలా అయితేనే రేట్స్ బెనిఫిట్ ఉంటది అని రూల్ పెడితే తప్ప, దీన్ని ఇక్కడ కరెక్ట్ చేయడం చాలా కష్టం"

"ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిసొచ్చిన తర్వాత మళ్ళీ ఇండస్ట్రీలో మీటింగ్ జరగలేదు. దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి పెద్దలు ఇనిషియేట్ తీసుకోవాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇండస్ట్రీకి ఫ్రెండ్లీ గవర్నమెంట్స్ ఉన్నాయి. ఇలాంటి మంచి టైంలో ఇండస్ట్రీకి మనం ఏం చేసుకోలేకపోతే అది మన దురదృష్టం అనే అనుకోవాలి" అని బన్నీ వాస్ పేర్కొన్నారు. ఇటీవల కాలంలో గీతా ఆర్ట్స్2 బ్యానర్ లో చిన్న సినిమాలు తీయడం గురించి కూడా మాట్లాడారు.

"కరోనా తర్వాత రెండు మూడేళ్లు మనకు టెస్టింగ్ పీరియడ్. ఇలాంటి టైంలో అధిక బడ్జెట్ తో నేను రిస్క్ చెయ్యలేను. స్లో అండ్ స్టడీగా వెళ్ళండి అని అల్లు అరవింద్ చెప్పారు. అందుకే ఈ మూడేళ్లు స్లోగా చిన్న సినిమాలు చేస్తూ వచ్చాం. ఇప్పుడు చేస్తున్న 'తండేల్' పెద్ద బడ్జెట్ మూవీ. 75 కోట్లకు పైగా ఖర్చు అవుతోంది. జనాలకు ఏం నచ్చుతోంది. ఎలాంటి సినిమాలు చూస్తున్నారు. ఎలాంటి చిత్రాలకు టికెట్లు తెగుతున్నాయనే దానిపై ఇప్పుడు ఓ అవగాహన వచ్చింది. అందుకే మళ్ళీ పెద్ద సినిమాలు స్టార్ట్ చేస్తున్నాం" అని బన్నీ వాసు చెప్పారు.

"కల్కి 2898 AD" సినిమా ₹1000 కోట్లుకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసినప్పటికీ, తాను ఊహించిన స్థాయిలో వసూళ్లు రాలేదని బన్నీ వాస్ అన్నారు. ఇదే సినిమా మూడేళ్ళ కిందట వచ్చుంటే, ఇప్పుడు వస్తున్న కలెక్షన్లకు రెండింతలు వసూలు చేసేదని, ఆ చిత్రానికి అంత కెపాసిటీ ఉందని బన్నీ వాస్ అభిప్రాయపడ్డారు. "ఈరోజుకీ 30 శాతం మంది ప్రేక్షకులు కల్కి సినిమాను ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాంలే అని థియేటర్లకు రాకుండా ఇంట్లోనే కూర్చున్నారు. ఇదివరకు అలా ఉండేది కాదు" అని బన్నీ వాస్ తెలిపారు.

"కల్కి లాంటి పెద్ద సినిమా మగధీర, బాహుబలి-1, బాహుబలి-2 టైంలో వచ్చి ఉంటే వేరేలా ఉండేది. ఆ సినిమాలకు మాకు 3-4 వారాల పాటు థియేటర్లు ఫుల్ అయ్యాయి. ఇప్పుడు కల్కి సినిమా బాగుంది.. అంత పెద్ద హిట్టయింది కానీ, దానికి రావాల్సిన ఇన్కమ్ రాలేదనేది నా ఒపీనియన్" అని బన్నీ వాస్ అన్నారు. ఈరోజుల్లో థియేటర్లకు జనాలు రావడం తగ్గిపోతోందని, అందుకే కలెక్షన్లు తగ్గుతున్నాయని విశ్లేషించారు. ఇటీవలి కాలంలో థియేటర్ ఓనర్లు కరెంట్ బిల్లులు కూడా కట్టుకోలేని స్థితికి వెళ్లారని అన్నారు.

"కల్కి లాంటి సినిమా రెండు మూడేళ్ళకు ఒకటి వస్తుంది. గతేడాది డిసెంబర్ నుంచి, మొన్న కల్కి వచ్చే వరకూ పెద్ద పెద్ద ఎగ్జిబిటర్స్ కూడా కరెంట్ బిల్లులు కట్టలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. ఈ సినిమా కోసం అప్పు తీసుకొచ్చి కరెంట్ బిల్లులు కట్టి చాలా థియేటర్లు రీఓపెన్ చేశారు" అని బన్నీ వాసు తెలిపారు. రాబోయే పెద్ద సినిమాలు కూడా రావాల్సిన దానికంటే తక్కువే వసూలు చేస్తాయని పేర్కొన్నారు.

"కల్కి తర్వాత వచ్చే పెద్ద సినిమా 'దేవర'. సెప్టెంబర్ 27న వస్తుంది. ఆ తర్వాత డిసెంబర్ 6న 'పుష్ప' వస్తుంది. ఈ గ్యాప్ లో కరెంట్ బిల్స్ లాంటివి తట్టుకోవాలి. ఎంత కలెక్ట్ చేస్తాయనేది పక్కన పెడితే, ఖచ్చితంగా ఈ సినిమాలన్నిటికీ రావాల్సిన రెవెన్యూ కంటే 30-40 శాతం తక్కువగానే వస్తుందనేది నా అంచనా" అని బన్నీ వాసు అన్నారు. ఈ సందర్భంగా 'కల్కి రికార్డ్స్ ను పుష్ప 2 బ్రేక్ చేస్తుందా?' అని అడగ్గా.. "బ్రేక్ చేస్తే బాగుంటుంది. ఇండస్ట్రీ బాగుంటుంది. ఎగ్జిబిటర్లు బాగుంటారు. ఎప్పుడు కూడా ఒక సినిమాని ఇంకో బ్రేక్ చేస్తేనే మంచిది" అంటూ నవ్వుతూ బదులిచ్చారు బన్నీ వాస్.