Begin typing your search above and press return to search.

నిహారిక కొణిదెల 'కమిటీ కుర్రోళ్ళు' హిట్టా ఫ్లాపా?

నూతన దర్శకుడు యదు వంశీ అద్భుత స్క్రీన్ ప్లే ఈ సినిమా విజ‌యానికి స‌హ‌క‌రించింద‌నేది టాక్.

By:  Tupaki Desk   |   11 Aug 2024 1:13 PM GMT
నిహారిక కొణిదెల కమిటీ కుర్రోళ్ళు హిట్టా ఫ్లాపా?
X

మెగా డాటర్ నిహారిక కొణిదెల న‌టిగా కొన‌సాగుతూనే నిర్మాత‌గాను రాణిస్తున్నారు. తాజాగా నిహారిక‌ నిర్మించిన 'కమిటీ కుర్రోళ్ళు' థియేట‌ర్ల‌లోకి విడుదలై విజ‌యం సాధించింది. నూతన దర్శకుడు యదు వంశీ అద్భుత స్క్రీన్ ప్లే ఈ సినిమా విజ‌యానికి స‌హ‌క‌రించింద‌నేది టాక్. చిన్ననాటి జ్ఞాపకాల ఆధారంగా అద్భుత‌ క‌థ‌తో ఈ చిత్రం తెర‌కెక్కింది. గోదావరి ప్రాంతంలోని అంద‌మైన బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెర‌కెక్కింది. ఇందులో జాతర సన్నివేశాలు స‌హా ప్ర‌తిదీ ప్ర‌త్యేక‌త‌తో ఆక‌ట్టుకున్నాయి. అనుభవజ్ఞులైన నటీనటులు యువ‌త‌రంతో క‌లిసి న‌టించారు.

'కమిటీ కుర్రోళ్ళు' బాక్సాఫీస్ వ‌ద్ద అంచనాలను అందుకుంది. 2.06 కోట్లకు పైగా రెండవ రోజు వసూళ్లతో ఇప్ప‌టికే 3.69 కోట్ల మేర‌ అద్భుతమైన ఓపెనింగ్ ల‌ను తెచ్చింది. ఈ విజయం ప‌రిశ్ర‌మ‌లో కొత్త బెంచ్‌మార్క్‌ని సెట్ చేసింది.

న‌టీన‌టుల ప్ర‌తిభ‌, ద‌ర్శ‌కుడి ప‌నిత‌నం, అనుదీప్ దేవ్ ఆత్మీయ సంగీతం, రాజు ఎదురోలు అద్భుతమైన సినిమాటోగ్రఫీ మూవీలో భావోద్వేగ స్థాయిల‌ను పెంచాయి. దృశ్యపరంగా శ్రవణపరంగా ప్రేక్ష‌కుల‌ను లీనం చేయ‌డంలో ఆ ఇరువురూ స‌క్సెసయ్యారు. వెంకట సుభాష్ చీర్ల -కొండల్ రావు అడ్డగళ్ల రాసిన చమత్కారమైన, ప్రామాణికమైన సంభాషణలు కథనంలో బిగిని పెంచాయి. పాత్రలకు ప్రామాణికతను జోడించాయి.

ఇది ఒరిజిన‌ల్ కథల శక్తిని, కొత్త ప్రతిభ సామర్థ్యాన్ని ప్రదర్శించింది. సంప్రదాయేతర కథనాలను అన్వేషించడానికి, తెలుగు ప్రేక్షకుల వివేచనాత్మక అభిరుచిని విశ్వసించడానికి ఇలాంటి విజయం ప్రేరణగా పనిచేస్తుంది. యదు వంశీ ఇలాంటి ఒక సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేయడం చెప్పుకోదగ్గ విజయం. అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకునేలా కథను రూపొందించడం అత‌డి ప్రతిభకు నిదర్శనం. `కమిటీ కుర్రోళ్ళు` కేవలం సినిమా మాత్రమే కాదు.. ఇది తెలుగు చిత్ర పరిశ్రమపై శాశ్వత ప్రభావాన్ని చూపిన సాంస్కృతిక దృగ్విష‌యం అని విశ్లేషిస్తున్నారు. వంశీ నందిపాటి `కమిటీ కుర్రోళ్ళు` చిత్రాన్ని థియేట్రికల్ గా రిలీజ్ చేస్తోంది. సందీప్ సరోజ్, య‌శ్వంత్, ఈశ్వ‌ర్, త్రినాధ్, ప్ర‌సాద్ బెహ‌రా త‌దిత‌రులు న‌టించారు. రాధ, తేజస్వీ రావు, టీనా శ్రావ్య‌, విశిక‌, ష‌ణ్ముఖి తదిత‌రులు న‌టించారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ LLP, శ్రీ రాధా దోమదర్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.