Begin typing your search above and press return to search.

మ‌హా కుంభ‌మేళా సాక్షిగా మ‌రో న‌టి స‌న్యాసం

ఇదిలా ఉంటే ఇప్పుడు మహా కుంభమేళా 2025 సాక్షిగా, మాజీ అందాల రాణి, న‌టి ఇషికా తనేజా సనాతన ధర్మాన్ని అనుసరించడానికి నటనా వృత్తికి వీడ్కోలు పలికింది.

By:  Tupaki Desk   |   8 Feb 2025 3:30 PM GMT
మ‌హా కుంభ‌మేళా సాక్షిగా మ‌రో న‌టి స‌న్యాసం
X

మ‌హా కుంభ‌మేళా సాక్షిగా చిత్ర‌విచిత్రాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ప‌లువురు అందాల క‌థానాయిక‌లు స‌న్యాసినులుగా మార‌డానికి కుంభ‌మేళాను వేదిక‌గా ఎంచుకోవ‌డం ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇంత‌కుముందు వెట‌ర‌న్ న‌టి మ‌మ‌తా కుల‌క‌ర్ణి స‌న్యాసం పుచ్చుకోగా, దానిపై చాలా విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. కుంభ‌కోణాల న‌టి అన్న ముద్ర‌ను హైడ్ చేయ‌డానికి మ‌మ‌తా స‌న్యాసినిగా మారింద‌ని విమ‌ర్శించారు. ఆ త‌ర్వాత స‌నాత‌న ప‌ద‌వి నుంచి త‌న‌ను గురువులు తొల‌గించ‌డం సంచ‌ల‌న‌మైంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు మహా కుంభమేళా 2025 సాక్షిగా, మాజీ అందాల రాణి, న‌టి ఇషికా తనేజా సనాతన ధర్మాన్ని అనుసరించడానికి నటనా వృత్తికి వీడ్కోలు పలికింది. ఉత్సవంలో గంగా నదిలో పవిత్ర స్నానం చేసిన తర్వాత స‌న్యాసం పుచ్చుకుని సనాతన ధర్మాన్ని అనుసరించడానికి తన నటనా వృత్తికి వీడ్కోలు పలికిందని జాతీయ మీడియాలో క‌థ‌నాలొచ్చాయి.

త‌నేజా 2018లో మిస్ వరల్డ్ టూరిజం టైటిల్‌ను గెలుచుకుంది. ఆధ్యాత్మిక మలుపు తీసుకున్న తర్వాత సమాజంలో మహిళల పాత్రలపై తన డేరింగ్ స్టేట్‌మెంట్స్ తో ఆమె వార్తల్లో నిలిచింది. జనవరి 29న మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జరిగిన తన గురు దీక్ష వేడుకకు హాజరైన తర్వాత ఇషికా తనేజా మహా కుంభ్‌లో పవిత్ర జలాల్లో స్నానం చేసింది. ఆమె శంకరాచార్య స్వామి సదానంద సరస్వతి జీ మహారాజ్ నుండి ఆధ్యాత్మిక దీక్షను పొందింది. త‌న కొత్త మార్గం గురించి ఆమె మాట్లాడుతూ..నేను స‌నాత‌నాన్ని అనుస‌రించే స‌న్యాసినిని. సేవా స్ఫూర్తితో నేను మారాను. మహా కుంభ్‌లో దైవిక శక్తులు ఉన్నాయి. నా జీవితంలో అతిపెద్ద విజయం ఏమిటంటే నేను శంకరాచార్య జీ నుండి గురు దీక్షను పొందాను. గురువు గారిని క‌లిసాక‌ జీవితానికి ప‌ర‌మార్థం తెలిసింది`` అని అన్నారు.

కొన్నేళ్లుగా సినిమాలు మ్యూజిక్ వీడియోల‌లో న‌టించాక‌, తిరిగి నా ఇంటికి వచ్చాను అని కూడా త‌నేజా పేర్కొన్నారు. స్త్రీలను చిన్న బట్టలు ధరించి నృత్యం చేయమని బలవంతం చేయలేదు. వారు సనాతన సేవ చేయడానికే తయారైన వారు అని ఆమె అన్నారు. ఇషికా తనేజా ఇక‌పై న‌ట‌న‌లోకి తిరిగి రాన‌ని స్ప‌ష్ఠంగా చెప్పారు. అయితే, భవిష్యత్తులో సినిమాలు నిర్మించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆమె పేర్కొన‌డం కొస‌మెరుపు.

2016లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 100 మంది భారత మహిళా సాధకుల విభాగంలో ఇషికను రాష్ట్రపతి అవార్డుతో సత్కరించారు. ఆమె విక్రమ్ భట్ నిర్మించిన వెబ్ సిరీస్ `హాద్‌`లో నటించింది. 60 ర‌కాల‌ మోడళ్లలో కేవలం 60 నిమిషాల్లో 60 పూర్తి ఎయిర్ బ్రష్ మేకప్‌లను పూర్తి చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను నెల‌కొల్పిన ఘ‌న‌త‌ త‌నేజా సొంతం.