Begin typing your search above and press return to search.

క‌ల్కి త‌ర్వాతా పాన్ ఇండియా హవా మ‌న‌దే

జూలై 12న కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2 విడుదల కానుండ‌గా క్రేజీ కాంబినేష‌న్ పై బోలెడన్ని అంచ‌నాలున్నాయి.

By:  Tupaki Desk   |   8 July 2024 3:34 PM GMT
క‌ల్కి త‌ర్వాతా పాన్ ఇండియా హవా మ‌న‌దే
X

నాగ్ అశ్విన్ లార్జర్-దేన్-లైఫ్ పాన్-ఇండియన్ సైన్స్ ఫిక్ష‌న్ మూవీ కల్కి 2898 AD సంచ‌ల‌న విజ‌యం సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద రూ.700 కోట్లకు పైగా వసూలు చేసి 1000 కోట్ల క్ల‌బ్ వైపు ప‌రుగులు పెడుతోంది. కల్కి 2898 AD బహుశా ఈ సంవత్సరం సౌత్ పాన్-ఇండియన్ విజయానికి ప్రారంభం మాత్రమే. జూలై 12న కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2 విడుదల కానుండ‌గా క్రేజీ కాంబినేష‌న్ పై బోలెడన్ని అంచ‌నాలున్నాయి. క‌మ‌ల్- శంక‌ర్ ఫ్యాక్ట‌ర్‌ మ్యాజిక్ మ‌రోసారి వ‌ర్క‌వుటైతే ఇది పాన్ ఇండియా హిట్ కావ‌డం ఖాయ‌మ‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఇది మాత్ర‌మే కాదు.. తెలుగు- తమిళ పరిశ్రమల నుండి ప‌లువురు క్రేజీ స్టార్లు న‌టించిన పాన్ ఇండియ‌న్ సినిమాలు క్యూలో ఉన్నాయి. అద్భుత‌మైన కళా ప్రక్రియ, స్టార్ డ‌మ్ తో వ‌స్తున్న ఈ సినిమాల్లో కంటెంట్ బలంగా ఉంద‌న్న ప్ర‌చారం బోలెడంత హైప్ పెంచింది.

ముఖ్యంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి దర్శకుడు SS రాజమౌళి నుంచి పాన్-ఇండియన్ విజ‌యాలు చూసిన ఆడియెన్ కి ఇప్పుడు సుకుమార్, కొర‌టాల శివ వంటి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుల నుంచి పాన్ ఇండియా హిట్లు చూడాల‌నే త‌హ‌త‌హ ఉంది. రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898AD అద్భుతమైన విజయం తెలుగు చిత్ర‌సీమ‌లో ఎంతో ఉత్సాహాన్ని నింపిన వేళ సుకుమార్, కొర‌టాల వంటి వారు త‌మ సినిమాల్ని భారీ కాన్వాసుతో తీసుకు వ‌స్తుండ‌డంతో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.

పుష్ప 2021లో విడుదలై రూ.320 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇది పాన్ ఇండియా హిట్ గా నిలిచింది. ఇప్పుడు డిసెంబర్ 6న పుష్ప 2 విడుదలకు సిద్ధమవుతోంది. మ‌రోసారి అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేష‌న్ సంచ‌ల‌నాలు సృష్టించ‌డం ఖాయ‌మ‌ని అంచ‌నా వేస్తున్నారు. మొదటి సినిమా కంటే పెద్ద కాన్వాస్‌తో వస్తున్న పుష్ప సీక్వెల్ 1000 కోట్ల క్ల‌బ్ లో నిల‌వ‌డం ఖాయ‌మ‌ని అంచ‌నా వేస్తున్నారు. సీక్వెల్ సినిమాని బాక్సాఫీస్ వద్ద మరింత మెరుగ్గా చేస్తానని బ‌న్ని-సుక్కూ ఇప్ప‌టికే హామీ ఇచ్చారు. అదే సమయంలో జూ. ఎన్టీఆర్ న‌టించిన‌ యాక్షన్ డ్రామా దేవర పాన్ ఇండియా కేట‌గిరీలో అత్యంత భారీగా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. దీనికి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ లాంటి హిందీ తార‌లు ఇందులో న‌టించ‌డం పాన్ ఇండియ‌న్ అప్పీల్ ని మ‌రింత పెంచింది.

2022లో రాజమౌళి RRR తర్వాత క‌ల్కి అతి పెద్ద పాన్ ఇండియ‌న్ విడుద‌ల కాగా RRR ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.1200 కోట్లను వసూలు చేసింది. ఇప్పుడు పుష్ప 2, దేవ‌ర చిత్రాలు అదే స్థాయిలో విడుద‌ల కానున్నాయి. పుష్ప 2 కోసం 200కోట్లు పైగా ఖ‌ర్చు చేస్తున్నార‌ని స‌మాచారం ఉంది. అలాగే దేవర 300 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోంద‌ని కూడా చ‌ర్చ సాగింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నాలు న‌మోదు చేయ‌డం ఖాయమ‌ని అభిమానులు భావిస్తున్నారు.

కోలీవుడ్ లోను భారీ చిత్రాలు:

తమిళ చిత్ర పరిశ్రమ 2024 మొదటి సగం బాక్సాఫీస్ వద్ద ఆశించినంత మెరుగ్గా లేదు. అయితే 2024 ద్వితీయార్థంలో ప‌లువురు అగ్ర హీరోలు న‌టించిన భారీ పాన్ ఇండియా చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నందున త‌మిళ ప్రేక్ష‌కుల్లో ఉత్సాహం నెల‌కొంది. జూలై 12న ఇండియన్ 2 విడుదల కానుంది. ఇది 1996 బ్లాక్‌బస్టర్ ఇండియన్‌కి సీక్వెల్ కాబట్టి చాలా అంచనాలు ఉన్నాయి. జూలై 26 న ధనుష్ చిత్రం రాయన్ థియేటర్లలోకి రానుంది. రాయన్‌ని ధనుష్ ర‌చ‌య‌త‌...అత‌డే దర్శకత్వం వహించారు - 2017లో సూపర్‌హిట్ అయిన పా పాండి తర్వాత ధ‌నుష్‌కి ద‌ర్శ‌కుడిగా రెండవ చిత్రం. ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ క‌థాంశంతో రూపొందుతోంది.

విక్ర‌మ్ క‌థానాయ‌కుడిగా పా రంజిత్ దర్శకత్వం వహించిన తంగలన్ పైనా భారీ అంచ‌నాలున్నాయి. ఈ చిత్రం ఆగష్టు 15న విడుదలవుతోంది. బ్రిటీష్ పాలనలో గోల్డ్ మైనింగ్ చుట్టూ తిరిగే పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఇది. కేజీఎఫ్ కంటే భిన్న‌మైన అంశాల‌తో ఈ చిత్రాన్ని పా రంజిత్ తెర‌కెక్కిస్తుండ‌గా, పోస్ట‌ర్లు లుక్ ల‌కు అద్భుత స్పంద‌న వ‌చ్చింది.

అయితే ప్రస్తుతం అందరి దృష్టి సూర్య `కంగువ`పై ఉంది. ఇది రూ.300 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఫాంటసీ పీరియడ్ యాక్షన్ చిత్రం. పుష్ప 2, దేవ‌ర త‌ర‌హాలోనే భారీ కాన్వాస్ తో రూపొందించిన చిత్ర‌మిది. ఇందులో బాబీ డియోల్, దిశా పటాని వంటి బాలీవుడ్ స్టార్లు న‌టించారు. దీనిని పాన్-ఇండియా కేట‌గిరీలో అత్యంత భారీగా విడుద‌ల చేయ‌నున్నారు. దర్శకుడు శివ దీన్ని తెరపై భారీ దృశ్యంగా మార్చడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నార‌ని స‌మాచారం. కల్కి చిత్రం అసాధార‌ణ వ‌సూళ్ల‌తో సంచ‌ల‌నాలు సృష్టిస్తుంటే, త‌దుప‌రి విడుద‌ల‌కు రానున్న పుష్ప 2, దేవ‌ర‌, కంగువ, తంగ‌లన్ చిత్రాల మ్యాజిక్ గురించి ఆశ‌లు నెల‌కొన్నాయి.

భార‌తీయుడు 2 జూలై 12 ..రాయ‌న్ జూలై 26 .. తంగ‌ల‌న్ ఆగ‌స్టు 15 ... ది గోట్ సెప్టెంబ‌ర్ 5 ..దేవ‌ర సెప్టెంబ‌ర్ 27 ..కంగువ అక్టోబ‌ర్ 10 ..పుష్ప 2 డిసెంబ‌ర్ 6 .. ఇలా వ‌రుస‌గా తేదీలు లాక్ అయ్యాయి. మ‌ధ్య‌లో ఇత‌ర స్టార్లు న‌టించిన భారీ చిత్రాలు కూడా విడుద‌ల క్యూలో ఉన్నాయి. అందువ‌ల్ల ద్వితీయార్థంలో ఆడియెన్ కి కావాల్సినంత స్పెష‌ల్ ట్రీట్ అంద‌నుంది.

దాదాపు ప్రతి నెలా పెద్ద పాన్-ఇండియన్ సినిమాలు విడుద‌ల‌కు రెడీ అవుతున్నాయి. జూలై నుండి డిసెంబర్ వరకు భారతీయ ప్రేక్షకులు నిజంగా స్పెష‌ల్ విజువల్ ట్రీట్ సిద్ధమ‌వుతోంది.