కల్కీ వాయిదా వేస్తున్నారా?
ఆ సమయంలో సినిమా రిలీజ్ అన్నది సరైన సమయం కాదని తాజాగా చిత్ర వర్గాల్లో చర్చకొచ్చిందిట.
By: Tupaki Desk | 29 March 2024 8:16 AM GMTప్రభాస్ కథానాయకుడిగా నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం 'కల్కి 2898' ఇప్పటికే రిలీజ్ తేదిని ప్రకటించిన సంగతి తెలిసిందే. మే 9న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటనా వచ్చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఆ తేదీకి వచ్చేస్తుందని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేసాయి. కానీ ఇప్పుడా సమీకరణాలు మారుతున్నట్లు తాజాగా అందుతోన్న సమాచారం. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల వేడి ఎలా ఉందో తెలిసిందే. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారం పనుల్లో బిజీ అయ్యాయి. చంద్రబాబు నాయుడు..పవన్ కళ్యాణ్ ఎవరికి వారుగా ప్రచారంలో బిజీ అయ్యారు.
అధికారిక పార్టీ కూడా మొన్నటి నుంచి ప్రచారం మొదలు పెట్టేసింది. ఇప్పుడు జనాలంతా ఆ పార్టీల వెనుకే కనిపిస్తున్నారు. మే 9 అంటే ఎన్నికల తేదికి అతీ సమీపంలో ఉంది. ఆ సమయంలో సినిమా రిలీజ్ అన్నది సరైన సమయం కాదని తాజాగా చిత్ర వర్గాల్లో చర్చకొచ్చిందిట. ప్రేక్షకులంతా ఎన్నికల హడావుడి లో ఉంటారు. అప్పుడు రిలీజ్ చేస్తే ప్రేక్షకులు థియేటర్ కి వచ్చి చూసే సన్నివేశం ఉంటుందా? అన్న సందేహం మొదలైనట్లు కనిపిస్తోంది. ఇప్పటికే థియేటర్లకి జనాలు రావడం లేదనే బెంగ ఉంది.
ఇలాంటి కన్ ప్యూజన్ నడుమ రిలీజ్ అయితే సినిమాకి నష్టం వాటిల్లుతుందని భావిస్తున్నారుట. దీంతో రిలీజ్ తేదీ మార్చే ప్లాన్ లోఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయం డిస్ట్రిబ్యూటర్లు అందరికీ చెవిన వేసినట్లు తెలిసింది. అయితే మే 9 గనుక కోల్పోతే మళ్లీ ఆగస్టులోనే రిలీజ్ ఉంటుందని తెలిసింది. సరిగ్గా 'పుష్ప-2' రిలీజ్ కి ముందుగానీ..తర్వా త గానీ రిలీజ్ అయ్యేలా ప్రత్యామ్నాయం వెతుకుతున్నారుట. అదే గనుక జరిగితే బాక్సాఫీస్ వద్ద వార్ తప్పదు.
హిందీ మార్కెట్లో బన్నీ..ప్రభాస్ కి మంచి క్రేజ్ ఉంది. పుష్పకి భారీ ఎత్తున వసూళ్లు వచ్చినవన్నీ నార్త్ మార్కెట్ నుంచే. ఇక డార్లింగ్ హిందీ మేనియా కొంత కాలంగా కొనసాగుతూనే ఉంది. అలాంటి సమయంలో రెండు సినిమాలు రిలీజ్ అయితే ఇబ్బంది ఎలా ఉంటుందోచెప్పాల్సిన పనిలేదు. థియేటర్ల సర్దుబాటు నుంచే యుద్దం మొదలవుతుంది. ఆ తర్వాత అది ఫ్యాన్ వార్ గానూ దారి తీస్తుంది. రెండు సినిమాల ఓపెనింగ్ లు..లాంగ్ రన్ వసూళ్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. కాబట్టి కల్కీ ఆగస్టు కి వెళ్తే గనుకు చాలా సమస్యలు ఉత్పన్నం అవుతాయి.