జనసేన.. కనిపించని సాయంగా త్రివిక్రమ్!
కౌలు రైతులకి ఆయన ఆర్ధిక సహాయం చేసాడంటే దానికి కారణం సినిమాలని చెప్పొచ్చు.
By: Tupaki Desk | 5 Jun 2024 3:53 AM GMTఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. పోటీ చేసిన అన్ని స్థానాలలో కూడా జనసేన పార్టీని ప్రజలు పట్టం కట్టారు. అయితే పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలు చేస్తూనే సినిమాలు కూడా చేస్తూ వస్తున్నారు. ఈ ఐదేళ్ల కాలంలో చేసిన సినిమాలు తక్కువే అయిన అవి ఆర్ధికంగా పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణానికి హెల్ప్ అయ్యాయని చెప్పొచ్చు. కౌలు రైతులకి ఆయన ఆర్ధిక సహాయం చేసాడంటే దానికి కారణం సినిమాలని చెప్పొచ్చు.
పవన్ కళ్యాణ్ కు పెద్దగా వ్యాపారాలు ఏమి లేవు. ఆయన ఆదాయం రావాలి అంటే కేవలం సినిమాల ద్వారానే. ఇక 2019 ఎన్నికలలో ఘోరమైన ఓటమి తర్వాత కూడా పార్టీని నడపడానికి పవన్ కళ్యాణ్ కి ఆర్ధిక తోడ్పాటు అందించింది ఈ సినిమాలే. పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తూ సినిమాలు చేయగలిగాడు అంటే దానికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే మాట ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. ఈ ఐదేళ్ల కాలంలో పవన్ కళ్యాణ్ చేసిన సినిమా కథలు పూర్తి స్థాయిలో వినలేదు.
త్రివిక్రమ్ ముందుగా పవన్ కి సరిపోయే కథలు విని వాటిని మేగ్జిమమ్ ఫైనల్ చేసేవారు. అలాగే దర్శకుల విషయంలో కూడా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ డెసిషన్ కి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ కారణంగానే పవన్ కళ్యాణ్ వేగంతో మూవీస్ చేయగలిగారు. అందుకే పవన్ కళ్యాణ్ కూడా చాలా సందర్భాలలో త్రివిక్రమ్ గురించి ఎక్కువ ప్రస్తావిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ కి ఆర్ధికంగా బలం చేకూరడంలో కనిపించని సాయంగా త్రివిక్రమ్ ఉన్నాడని ఇండస్ట్రీలో అందరికి తెలిసిన విషయమే.
వారిద్దరి స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇద్దరి భావజాలం కలవడంతో పవన్ కళ్యాణ్ తన మిత్రుల జాబితాలోకి త్రివిక్రమ్ వచ్చారు. అలాగే త్రివిక్రమ్ ఏదైనా చెప్పాడంటే పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో విశ్వసిస్తారు. ఈ సమన్వయం సినిమాల ఎంపికకి కూడా కారణం అయ్యింది. అలాగే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వంలో కూడా త్రివిక్రమ్ ప్రభావం ఎంతో కొంత ఉంటుందని చెప్పొచ్చు.
ఆయన్ని అభిమానించే వారిలో చాలా మంది ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ ని తిట్టలేక త్రివిక్రమ్ పై విమర్శలు చేస్తారు. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాలు చేశారు. అందులో అజ్ఞాతవాసి దారుణంగా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్లీ బాండింగ్ ఏర్పడింది. అలాగే ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లకి కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మంచి ఫ్రెండ్లీ బాండింగ్ ఉంది.