Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ సినిమాకు దారేది!

ఎక్కువగా స్టార్ హీరోలతోనే సినిమాలు తీస్తూ, ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నారు.

By:  Tupaki Desk   |   22 July 2024 7:43 AM GMT
త్రివిక్రమ్ సినిమాకు దారేది!
X

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. రచయితగా కెరీర్ ప్రారంభించిన ఆయన, దర్శకుడిగానూ తన ప్రతిభను చాటుకున్నారు. ఎక్కువగా స్టార్ హీరోలతోనే సినిమాలు తీస్తూ, ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నారు. అయితే ఇటీవల కాలంలో త్రివిక్రమ్ మరీ స్లోగా సినిమాలు తెరకెక్కిస్తున్నారు. గత ఆరేళ్లలో ఆయన్నుంచి మూడు చిత్రాలు మాత్రమే వచ్చాయి. 'గుంటూరు కారం' వచ్చి ఆరు నెలలు దాటిపోయినా, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందనేది క్లారిటీ రావడం లేదు.

నిజానికి గతేడాది జులైలోనే డైనమిక్ కాంబో ఈజ్ బ్యాక్ అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలయికలో ఓ భారీ ప్రాజెక్ట్ కు అనౌన్స్ మెంట్ వచ్చింది. అయితే 'పుష్ప 2' ఇంకా సెట్స్ మీద ఉండటం, సూపర్ స్టార్ మహేశ్ బాబుతో త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన 'గుంటూరు కారం' సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో బన్నీతో సినిమా ఉంటుందో లేదో అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో కచ్చితంగా మూవీ ఉంటుందని నిర్మాత బన్నీ వాస్ స్పష్టం చేసారు. కానీ ఇది ఎప్పుడు పట్టాలెక్కుతుందనేదే తెలియడం లేదు. దీనికి తోడు ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ సినిమాలను పూర్తి చేసే వరకు త్రివిక్రమ్ తదుపరి ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టే అవకాశం లేదనే టాక్ వినిపిస్తోంది.

పవన్ కళ్యాణ్ రాజకీయాల మీద ఫుల్ ఫోకస్ పెట్టడంతో, సినిమాలకు సంబంధించిన విషయాలు ఆయనకు అత్యంత సన్నిహితుడైన త్రివిక్రమ్ చూసుకుంటూ వస్తున్నారనే మాట ఎప్పటి నుంచో వింటున్నాం. జనసేనాని సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఆయన ప్రాజెక్ట్స్ అన్నీ దర్శకుడే సెట్ చేస్తున్నారని కూడా చెప్పుకున్నారు. ఇందులో నిజంగా త్రివిక్రమ్ పాత్ర ఎంతనేది పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ హీరోగా మొదలైన 'హరి హర వీర మల్లు', 'ఉస్తాద్ భగత్ సింగ్', OG చిత్రాల షూటింగ్స్ పెండింగ్ లో ఉన్నాయి. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత, ఈ సినిమాలు ఎప్పుడు పూర్తవుతాయి? ఎప్పుడు తిరిగి సెట్స్ మీదకు వెళ్తాయి? అనేది ప్రశ్నార్థంగా మారింది. దీంతో నిర్మాతల మీద అధిక భారం పడుతోంది.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన పెండింగ్ చిత్రాలను పర్యవేక్షించే బాధ్యతను త్రివిక్రమ్‌కు అప్పగించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అనుకున్న సమయానికి ఆ సినిమాలను పూర్తి చేసేందుకు నిర్మాతలతో సమన్వయం చేసుకుంటారని.. ఎప్పుడెప్పుడు పవన్ అందుబాటులో ఉంటారు, ఏ సినిమాకి ఎన్ని డేట్స్ ఇస్తారు అనేది దర్శకుడు నిర్ణయిస్తారని అంటున్నారు. ఇటీవల విజయవాడలో పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ భేటీ అయింది కూడా అందుకే అని.. పవన్ నటిస్తున్న ఈ మూడు ప్రాజెక్ట్‌లు పూర్తయిన తర్వాతే బన్నీ సినిమాపై ఆయన దృష్టి పెడతారని చెప్పుకుంటున్నారు. ఇదే నిజమైతే ఆలోపు అల్లు అర్జున్ మరో మూవీ చేసే అవకాశాలు లేకపోలేదు.

ఏదేమైనా అల్లు అర్జున్‌ - త్రివిక్ర‌మ్‌ శ్రీనివాస్ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకూ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'జులాయి' 'సన్నాఫ్ సత్యమూర్తి' 'అల వైకుంఠపురములో' సినిమాలు మంచి విజయం సాధించాయి. నాలుగోసారి ఓ భారీ ప్రాజెక్ట్ కోసం చేతులు కలపబోతున్నారు. ఇప్పటికే స్టోరీ లైన్ ఫిక్స్ అయిందని, కథ కంటే ఇదొక కాన్సెప్ట్ అని నిర్మాత బన్నీ వాస్ ఈ మధ్యనే చెప్పారు. ఇది చాలా బిగ్ ప్రాజెక్ట్ అని, ప్రీ ప్రొడక్షన్‌కే ఏడాదిన్నర సమయం పడుతుందని అన్నారు. బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప 2' సినిమా చేస్తున్నారు. ఒక నెల తర్వాత ఆయన తదుపరి ప్రాజెక్ట్ పై క్లారిటీ వస్తుందని బన్నీ వాస్ తెలిపారు.