Begin typing your search above and press return to search.

హీరోలపై కూడా ఐటీ అధికారుల ఫోకస్.. ఎందుకంటే?

ఈ నేపధ్యంలో పెద్ద బ్యానర్ల నుండి భారీగా అడ్వాన్సులు తీసుకున్న విషయాలపై కూడా ఐటీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారాని ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   21 Jan 2025 10:34 AM GMT
హీరోలపై కూడా ఐటీ అధికారుల ఫోకస్.. ఎందుకంటే?
X

తెలుగు చిత్ర పరిశ్రమలో ఆదాయ పన్ను శాఖ దాడులు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. ఈసారి బడా నిర్మాణ సంస్థలు, పెద్ద సినిమాలు, ప్రఖ్యాత నిర్మాతలు మాత్రమే కాకుండా, కొన్ని ప్రముఖ హీరోల ఆర్థిక లావాదేవీలు కూడా విచారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో పెద్ద బ్యానర్ల నుండి భారీగా అడ్వాన్సులు తీసుకున్న విషయాలపై కూడా ఐటీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారాని ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే వినిపిస్తోంది.

ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖ హీరోలు పెద్ద బ్యానర్ల నుండి తమ తదుపరి ప్రాజెక్ట్‌లకు సంబంధించి పెద్ద మొత్తంలో అడ్వాన్సులు తీసుకున్న మాట వాస్తవమే. అయితే, ఈ లావాదేవీలలో కొంత భాగం క్యాష్ రూపంలో జరగడమే సమస్యగా మారిందట. నిబంధనల ప్రకారం, లావాదేవీలు బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా జరగాలి. కానీ క్యాష్ రూపంలో చెల్లింపులు జరగడం పన్ను ఎగవేతకు దారితీస్తుందని ఐటీ అధికారులు భావిస్తున్నారు. ఇది ప్రస్తుతం పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

ఇటీవలి కాలంలో భారీ బడ్జెట్ చిత్రాల సంఖ్య పెరిగిన క్రమంలో, హీరోల రెమ్యునరేషన్లు కూడా అమాంతం పెరిగాయి. ఒక్కో ప్రాజెక్ట్‌కు పాన్ ఇండియా హీరో 100 కోట్లకు పైనే ఛార్జ్ చేస్తున్నారు. మీడియం రేంజ్ హీరోలు సైతం 15 కోట్ల నుంచి 30 కోట్ల వరకు తీసుకుంటున్నారని సమాచారం. ఈ మొత్తంలో కొంత భాగం నిర్దిష్టంగా బ్యాంక్ లావాదేవీల ద్వారా పరిగణనలోకి వస్తుండగా, మిగతా భాగం క్యాష్ రూపంలో తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇది పన్ను దాడులకు ప్రధాన కారణమయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఐటీ దృష్టి బడ్జెట్ లావాదేవీలతో పాటు క్యాష్ ట్రాన్సాక్షన్లపై ఉంది. క్యాష్ పేమెంట్ల వ్యవహారంపై విచారణ జరిపేందుకు, బ్యానర్లు చెల్లించిన మొత్తాలు, హీరోల స్వీకరించిన రశీదులు, వాటికి సంబంధించిన డేటాను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ఈ పేమెంట్లు పన్ను చెల్లింపులకు సంబంధించి నిబంధనల్ని పాటించాయా అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు.

ఇక ఈ పరిణామాలు పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. ఇప్పటికే పలు నిర్మాణ సంస్థలు, నిర్మాతలు తమ లావాదేవీలను పారదర్శకంగా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పన్ను ఎగవేతకు సంబంధించిన ఆరోపణలు నమ్మకం కోల్పోయేలా చేయగలవు, కాబట్టి భవిష్యత్తులో ఇండస్ట్రీ మొత్తం పన్ను చెల్లింపుల విషయంలో మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో దూసుకెళుతోంది. కానీ ఈ ఐటీ దాడులు పరిశ్రమపై ఎంతవరకు ప్రభావం చూపుతాయనే విషయం ఆసక్తిగా మారింది. పారదర్శకత పెంచడమే దీనికి ఒక పరిష్కారమని పరిశ్రమలో పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.