Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌ టాప్‌ ప్రొడ్యూసర్స్‌పై ఐటీ దాడులు

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో మరోసారి ఆదాయపన్ను శాఖ అధికారులు హాట్ టాపిక్ గా మారాయి

By:  Tupaki Desk   |   21 Jan 2025 5:00 AM GMT
టాలీవుడ్‌ టాప్‌ ప్రొడ్యూసర్స్‌పై ఐటీ దాడులు
X

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో మరోసారి ఆదాయపన్ను శాఖ అధికారులు హాట్ టాపిక్ గా మారాయి. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు, మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మాతలు నవీన్‌, సీఈఓ చెర్రీల ఇళ్లపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అలాగే మ్యాంగో సంస్థలో కూడా ఐటి సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ తనిఖీలతో టాలీవుడ్‌ ఇండస్ట్రీలో హడావుడి నెలకొంది. పుష్ప 2, సంక్రాంతికి వస్తున్నాం వంటి బిగ్‌ బడ్జెట్‌ చిత్రాలు నిర్మించిన ఈ నిర్మాతలు ఇప్పుడు ఐటీ అధికారుల దృష్టిలో పడ్డారు.

దిల్‌ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఇటీవల విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం భారీ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం 200 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించగా, దిల్ రాజు నిర్మాణ సంస్థ భారీ స్థాయిలో విస్తరించింది. మరోవైపు గేమ్ ఛేంజర్ డిజాస్టర్ ద్వారా డిజాస్టర్ టాక్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక సినిమా ఆ సినిమాల హడావుడిలో ఉండగా జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లోని దిల్‌ రాజు నివాసం, ఆఫీసులపై ఐటీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. దిల్‌ రాజు బంధువులు, కూతురు హన్సితా రెడ్డి నివాసాల్లోనూ ఈ సోదాలు కొనసాగుతున్నాయి.

అలాగే ‘పుష్ప 2: ది రూల్’ వంటి పాన్‌ ఇండియా చిత్రంతో సంచలన విజయాన్ని సాధించిన మైత్రి మూవీ మేకర్స్‌ ఇప్పుడు ఐటీ అధికారుల దృష్టిలో నిలిచారు. మైత్రి ప్రొడ్యూసర్స్ నవీన్‌, సీఈవో చెర్రీ నివాసాలు, కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. పుష్ప 2 చిత్రంతో పాటు మైత్రి సంస్థ భారీ స్థాయిలో చిత్రాలను నిర్మిస్తోంది. ఈ రైడ్స్‌లో పెద్ద స్థాయి ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు జరుగుతుందనే టాక్‌ వినిపిస్తోంది.

టాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌ చిత్రాల నిర్మాణం విషయంలో ఈ నిర్మాతలు ముందంజలో ఉంటారు. దిల్‌ రాజు ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాలను నిర్మించారు. ఇక ‘డాకు మహారాజ్‌’ సినిమాను నైజాంలో పంపిణీదారుగా ఉన్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్‌ ఇటీవల ‘పుష్ప 2’ సినిమాతో మరోసారి పాన్‌ ఇండియా స్థాయిలో పెద్ద విజయాన్ని అందుకున్నారు.

ఈ సోదాలపై టాలీవుడ్‌ వర్గాల్లో పెద్ద చర్చ మొదలైంది. పెద్ద బడ్జెట్‌ చిత్రాలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు, ఆదాయపు పన్నుల చెల్లింపులపై అధికారులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ దాడులు టాలీవుడ్‌లో మరింత కీలకమైన ఆర్థిక విషయాలపై దృష్టి పెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సంక్రాంతి సందర్భంగా భారీ వసూళ్లతో దూసుకుపోయిన చిత్రాలు ఇప్పుడు ఐటీ దాడులతో టాలీవుడ్‌ నిర్మాతలకు బిగ్‌ షాక్‌ ఇచ్చాయి. ఈ దాడులు ఇండస్ట్రీపై ఎలాంటి ప్రభావం చూపుతాయో, ఇంకా ఏ వివరాలు బయటకు వస్తాయో చూడాలి.