ఆర్సీ16 నిర్మాత పై కూడా ఐటీ దాడులు
ఈ దాడుల క్రమంలో తాజాగా రామ్ చరణ్ ఆర్సీ16, ఆర్సీ17 చిత్రాల నిర్మాత వెంకట సతీష్ కిలారు నివాసంలో కూడా ఐటీ సోదాలు జరిపినట్లు సమాచారం.
By: Tupaki Desk | 21 Jan 2025 9:59 AM GMTతెలుగు చిత్ర పరిశ్రమలో ఐటీ దాడులు మరింత ఉత్కంఠ రేపుతున్నాయి. బడా నిర్మాణ సంస్థలు, పెద్ద బడ్జెట్ చిత్రాలపై ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికులు దృష్టి పెట్టారు. ఈ దాడుల క్రమంలో తాజాగా రామ్ చరణ్ ఆర్సీ16, ఆర్సీ17 చిత్రాల నిర్మాత వెంకట సతీష్ కిలారు నివాసంలో కూడా ఐటీ సోదాలు జరిపినట్లు సమాచారం. విజయవాడకు చెందిన ఈ నిర్మాతకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారని తెలుస్తోంది.
వృద్ధి సినిమాస్ బ్యానర్‌ను స్థాపించిన వెంకట సతీష్ కిలారు, పాన్ ఇండియా స్థాయిలో రెండు ప్రాజెక్ట్‌లకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్సీ16 ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లింది. ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ ఖర్చుచేస్తుండటంతో, సంబంధిత లావాదేవీలపై ఐటీ అధికారులు తనిఖీలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందనున్న ఆర్సీ17 చిత్రం కూడా వెంకట సతీష్ నిర్మాణంలో ఉంది.
ముఖ్యంగా ఇలాంటి పెద్ద బడ్జెట్ సినిమాలకు పెట్టుబడులు ఎలా సమకూరుతున్నాయి? అన్నది ఇప్పుడు ఐటీ దృష్టిని ఆకర్షిస్తోంది. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో RC16 ని నిర్మిస్తున్నట్లు టాక్. చాలా కాలం తరువాత ఐటీ దాడులు టాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీశాయి. బడ్జెట్ లావాదేవీలు, ఫైనాన్సింగ్ అంశాలపై ఫుల్ ఫోకస్ పెట్టిన అధికారులు, మరిన్ని వివరాలు వెలికితీస్తారని భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో, పెద్ద బడ్జెట్ సినిమాలు నిర్మించే నిర్మాతలు మరింత పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
ఈ ఐటీ దాడుల ప్రభావం టాలీవుడ్ నిర్మాణ వ్యూహాలపై ఎంతవరకు ఉంటుంది? అన్నది ఆసక్తికరంగా మారింది. పాన్ ఇండియా సినిమాల బడ్జెట్ లావాదేవీలు పరిశీలనకు వస్తున్న ఈ సమయంలో, బడా నిర్మాతలు మరింత బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని పరిశ్రమ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు
ఫేక్ కలెక్షన్స్ కూడా పలు అనుమానాలు తావిస్తున్నట్లు తెలుస్తోంది. విడుదలకు ముందే వెయ్యి కోట్ల బిజినెస్ అనడం అలాగే మొదటి రోజే రికార్డ్ కలెక్షన్స్ అని పోస్టర్స్ వదలడం వంటి అంశాలు కూడా ఐటి దాడులు చేయడానికి కారణమని తెలుస్తోంది. పలువురు నిర్మాతలు కలెక్షన్స్ విషయంలో కొంత ఫేక్ ఉన్న మాట వాస్తవమే అని క్లారిటి కూడా ఇచ్చారు. ఇక ఈ తరుణంలో ఐటి రెయిడ్స్ అనంతరం నిర్మాతలు కలెక్షన్స్ విషయంలో ఏ విధంగా ఆలోచిస్తారో చూడాలి.