Begin typing your search above and press return to search.

దిల్ రాజుపై ఐటి టెన్షన్.. మొత్తం ఆ సినిమా వల్లే..

ఇక ఐటీ రెయిడ్స్ కు అసలు కారణం ఈ సినిమా వల్లే వచ్చి ఉంటుందని అందరూ అనుకున్నారు.

By:  Tupaki Desk   |   21 Jan 2025 5:30 PM GMT
దిల్ రాజుపై ఐటి టెన్షన్.. మొత్తం ఆ సినిమా వల్లే..
X

టాలీవుడ్‌లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దిల్ రాజు, అతని బంధువులు, అనుబంధ సంస్థల ఇళ్లపై నిర్వహిస్తున్న ఐటీ దాడులు మరో విషయాన్ని హాట్ టాపిక్ గా మారుస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా విడుదలైన "సంక్రాంతికి వస్తున్నాం" విజయవంతంగా ప్రదర్శితం కావడంతో కలెక్షన్స్ ఒక రేంజ్ లో వస్తున్నాయి. మరోవైపు డాకు మహరాజ్ కూడా నైజాంలో కలెక్షన్స్ బాగానే రాబట్టింది. ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్నాం ఊహించని ప్రాఫిట్స్ అందిస్తోంది. ఇక ఐటీ రెయిడ్స్ కు అసలు కారణం ఈ సినిమా వల్లే వచ్చి ఉంటుందని అందరూ అనుకున్నారు.

సోషల్ మీడియాలో కూడా ప్రచారం గట్టిగానే జరుగుతోంది. కానీ, అసలు కారణం "గేమ్ ఛేంజర్" అని తెలుస్తోంది. దిల్ రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్ విడుదల ముందు భారీ ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే, సినిమా విడుదల సమయానికి ఆ సమస్యలను పరిష్కరించి సినిమా సాఫీగా విడుదల కావడంతో ఆదాయపు పన్ను శాఖ అధికారుల ఫోకస్ ఎక్కువగా పడినట్లు తెలుస్తోంది.

సినిమా విడుదలకు ముందు జరిగిన ఆర్థిక లావాదేవీలు, ఫైనాన్షియర్లు చేసిన భారీ చెల్లింపులు ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఫైనాన్సియర్ సత్య రంగయ్య ప్రసాద్, మ్యాంగో మీడియా రామ్ లాంటి వారు చివరి నిమిషంలో చేసిన ఆర్థిక సాయం గేమ్ ఛేంజర్ సాఫీగా విడుదల కావడానికి కారణమని వార్తలు వస్తున్నాయి. ఈ దాడులు ఈ చెల్లింపులు, లావాదేవీలు అన్నింటిని సమగ్రంగా పరిశీలించడానికి కేంద్రంగా మారాయి.

విడుదల సమయంలో గేమ్ ఛేంజర్ పోస్టర్లపై వచ్చిన భారీ వసూళ్ల గురించి ఉన్న అంచనాలు, వాటి వాస్తవత కూడా ప్రశ్నార్థకంగా మారాయి. "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాతో దిల్ రాజు తన ఆర్థిక పరిస్థితిని కొంతవరకు పటిష్ఠం చేసుకున్నా, ఆ సినిమా వసూళ్ల లెక్కలు ఇంకా పూర్తిగా బయటకు రావడం లేదు. ఒకవైపు గేమ్ ఛేంజర్ మిగిల్చిన సమస్యలు, మరోవైపు సంక్రాంతికి వస్తున్నాం విజయవంతం కారణంగా ఆర్థిక లావాదేవీల్లో ఉన్న గందరగోళం ఈ దాడులకు ప్రధాన కారణంగా నిలిచినట్లు తెలుస్తోంది.

టాలీవుడ్‌లో పెద్ద బడ్జెట్‌ చిత్రాలు నిర్మించడం మామూలు విషయం కాదు. కానీ, ఆర్థిక లావాదేవీలు పారదర్శకంగా లేనప్పుడు ఇలాంటి దాడులు జరుగడం తప్పదు. ఐటీ అధికారులు ఇప్పుడు సినిమా విడుదలకు ముందు పెట్టిన బడ్జెట్ లు, ఫైనాన్సర్ల సహకారం, తర్వాత జరిగిన లావాదేవీలపై మరింత లోతుగా పరిశోధన జరుపుతున్నారు.

ఏదేమైనా గేమ్ ఛేంజర్ వల్లే దిల్ రాజుకి మరో టెన్షన్ మొదలయ్యింది. ఆర్థికంగా ఎలాంటి లాభాన్ని ఇవ్వకపోగా ఇప్పుడు మరో క్లిష్టమైన చెలెంజ్ ను విసిరింది. ఇక ఐటి దాడులు నుంచి దిల్ రాజు ఏ విధంగా బయటకు వస్తారో చూడాలి.