పేదల కోసం స్టార్ హీరోయిన్ దుస్తులు వేలం
మంచి కోసం.. మేలు కోసం ఏదైనా సేవాకార్యక్రమాన్ని ప్రారంభిస్తే దానిని ప్రశంసించకుండా ఉండలేం.
By: Tupaki Desk | 5 Nov 2024 6:07 AM GMTమంచి కోసం.. మేలు కోసం ఏదైనా సేవాకార్యక్రమాన్ని ప్రారంభిస్తే దానిని ప్రశంసించకుండా ఉండలేం. భారతదేశంలో విద్యకు నోచుకోని బడుగు బలహీన వర్గాల ఆడపిల్లల కోసం ఏదైనా చేయాలని ఆలోచిస్తే అది ప్రోత్సహించదగినది. పది మందిని ఆలోచింపజేసే మేలైన నిర్ణయంగా భావించాలి. ఇప్పుడు హిందీ పరిశ్రమ నుంచి స్టార్ హీరోయిన్ జాక్విలిన్ ఫెర్నాండెజ్ అలాంటి ఒక మంచి పనికి `నేను సైతం` అంటూ ముందుకు వచ్చారు.
సామాజిక కార్యక్రమం `బీస్ట్ ఫిలాంత్రోపీ`తో కలిసి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ `ఎంపవర్ గర్ల్స్ ఇన్ ఇండియా` ఇనిషియేషన్ కోసం ముందడుగు వేయడం ప్రశంసనీయం. అంతేకాదు ఆన్లైన్ లో జాక్విలిన్ ధరించిన డిజైనర్ దుస్తులను వేలం వేయడం ద్వారా వచ్చే మొత్తాన్ని యువతుల చదువుల కోసం ఉపయోగించాలనేది ప్లాన్.
ఈ వేలంలో పాల్గొని భారతదేశంలోని యువతుల కోసం విద్య, మార్గదర్శకత్వం, జీవితాన్ని మార్చే అవకాశాలకు నిధులు సమకూర్చడంలో సహాయం చేయాల్సిందిగా కోరారు. బీస్ట్ ఫిలాంత్రోపీ బయోలోని లింక్ ద్వారా వేలంలో పాల్గొని జాక్విలిన్ దుస్తులను అభిమానులు సొంతం చేసుకోవచ్చు.
జాక్విలిన్ ప్రయత్నం బావుంది. పేద విద్యార్థినులు ఖరీదైన విద్యను సొంతం చేసుకోవాలంటే కచ్ఛితంగా విరాళాలు అందించే దాతలు అవసరం. అలాంటి వారిని ప్రేరేపిస్తూ భారీ సేవా కార్యక్రమాన్ని జాకీ ముందుకు నడిపించడం నిజంగా ప్రశంసించదగినది. కాన్ మేన్ సుఖేష్ చంద్రశేఖర్ 200 కోట్ల మోసం కేసులో అతడి నుంచి బహుమతులు అందుకున్న వారి జాబితాలో జాక్విలిన్ పేరు వినిపించడం నిజంగా ఆశ్చర్యపరిచింది. అయితే ఇలాంటి అపప్రద నుంచి బయటపడేందుకు జాక్విలిన్ వీలైనన్ని మంచి పనులు చేసేందుకు ప్రయత్నిస్తోంది.