జైలు నుంచే బెదిరించాడంటూ నటి ఫిర్యాదు!
అందాల కథానాయిక జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తనను వేధింపులకు గురిచేశారని, బెదిరించారని సుఖేష్ చంద్రశేఖర్‌పై ఆరోపించారు.
By: Tupaki Desk | 14 Feb 2024 5:26 AM GMTఅందాల కథానాయిక జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తనను వేధింపులకు గురిచేశారని, బెదిరించారని సుఖేష్ చంద్రశేఖర్‌పై ఆరోపించారు. ఇప్పుడు జాక్విలిన్ చట్టపరంగా ఫిర్యాదును సమర్పించారు. ప్రముఖ జాతీయ మీడియా కథనం ప్రకారం, ఫెర్నాండెజ్ ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరాకు ఫిర్యాదు చేస్తూ ఆ లేఖను స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్ బ్రాంచ్)కి పంపారు. ఫిర్యాదు మేరకు ప్రత్యేక విభాగాన్ని ప్రాథమిక విచారణకు ఆదేశించారు.
ప్రాసిక్యూషన్ విట్నెస్ ప్రొటెక్షన్‌లో వ్యవస్థాగత వైఫల్యం! అనే శీర్షికతో పోలీస్ చీఫ్‌కి ఆమె పంపిన లెటర్ కమ్యూనికేషన్‌లో ముఖ్యమైన చిక్కులతో కూడిన కేసులోకి తనను అన్యాయంగా లాగడంపై ఫెర్నాండెజ్ తన బాధను వ్యక్తం చేసింది. ప్రస్తుతం మండోలి జైలులో ఖైదీగా ఉన్న సుకేష్ అని చెప్పుకునే వ్యక్తి నుండి మానసిక ఒత్తిడిని, బెదిరింపులను ఎదుర్కొంటున్నానని లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది.
జాక్వెలిన్ ఈ లేఖలో తన ధైన్య పరిస్థితిని వివరిస్తూ.. భద్రత కోసం చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరింది. అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (MCOCA) కింద ఒక కేసులో ప్రాసిక్యూషన్ సాక్షిగా ఆమెకు రక్షణ కల్పించేందుకు భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సంబంధిత సెక్షన్ల కింద FIR నమోదు చేయాలని అభ్యర్థించారు.
న్యాయ నిర్వహణలో ప్రాథమికమైన సాక్షుల రక్షణ సూత్రం రాజీ పడిందని ఫెర్నాండెజ్ పేర్కొన్నారు. నిందితులకు అందుబాటులో ఉన్న అన్ని కమ్యూనికేషన్ మార్గాలను పరిశీలించడం.. తదుపరి ఏ పెద్ద తప్పు జరగకుండా నిరోధించడానికి పటిష్టమైన చర్యలను అమలు చేయాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
ఇదే విషయమై జాకీ గత డిసెంబర్ లో తన ఆవేదనను వ్యక్తపరిచింది. సుకేష్ పై చట్టపరమైన చర్యలకు దిగుతున్నానని తెలిపింది. లేఖలు, సందేశాలు లేదా స్టేట్‌మెంట్‌ల ద్వారా సుకేష్ తనను సంప్రదించకుండా ఆంక్షలు విధించాలని కోరుతూ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. 200 కోట్ల దోపిడీ కుంభకోణం కేసులో జాక్విలిన్ ఫెర్నాండెజ్ ప్రమేయం సుకేష్‌తో మనీలాండరింగ్ మరియు దోపిడీ కేసుకు సంబంధించి ఆర్థిక నేరాల విభాగం (EOW) దర్యాప్తు చేస్తున్న ఎఫ్‌ఐఆర్‌లో సాక్షిగా జాక్విలిన్ పేరును చేర్చిన సంగతి తెలిసిందే.