కాస్మోటిక్ సర్జరీ వికటించి నటి జాక్వెలిన్ మృతి
పాపులర్ హాలీవుడ్ నటి జాక్వెలిన్ క్యారీరీ ఆసుపత్రిలో కాస్మెటిక్ సర్జరీ కారణంగా మరణించింది. ఆమె మృతికి కారణం రక్తం గడ్డకట్టడం అని తేలింది.
By: Tupaki Desk | 7 Oct 2023 4:03 AM GMTబరువు తగ్గడం కోసం లైపో సక్సన్ ను.. ముఖం అందం పెంచుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీలను రెగ్యులర్ గా తారలు ఆశ్రయిస్తున్నారు. ఒక్కోసారి చికిత్స వికటించి ప్రాణాలు కోల్పోయిన తారలు ఉన్నారు. అందాల కథానాయిక ఆర్తి అగర్వాల్ ఇంతకుముందు లైపో చికిత్స వికటించడం వల్లనే మరణించిందని కథనాలొచ్చాయి. పలువురు తారలు ముఖాకృతి చికిత్సలు వికటించి వికృతంగా మారిన సందర్భాలున్నాయి. ఇప్పుడు కాస్మొటిక్ సర్జరీ కారణంగా ప్రముఖ నటి మరణించడం సంచలనమైంది. పాపులర్ హాలీవుడ్ నటి జాక్వెలిన్ క్యారీరీ ఆసుపత్రిలో కాస్మెటిక్ సర్జరీ కారణంగా మరణించింది. ఆమె మృతికి కారణం రక్తం గడ్డకట్టడం అని తేలింది. 48 సంవత్సరాల వయస్సులో ఈ మరణం అభిమానులకు బిగ్ షాక్.
అర్జెంటీనా మాజీ అందాల భామగా నటి జాక్వెలిన్ క్యారీరి సుపరిచితురాలు. లాటిన్ అమెరికన్ సినిమా స్టార్ గా తనకు పెద్ద పేరు ఉంది. మోడల్ కం నటి జాక్వెలిన్ కాలిఫోర్నియాలో మరణించిందని తెలియగానే అభిమానులు షాక్ కి గురయ్యారు. ఆమె మరణానికి కారణం సౌందర్య చికిత్స ప్రక్రియలో ఏర్పడిన రక్తం గడ్డకట్టడం అని వెల్లడైంది. ఇది అనేక వైద్యపరమైన సమస్యలకు దారితీసింది. చివరికి ఇది విషాదకరమైన మరణానికి దారితీసింది. అర్జెంటీనా మీడియా నివేదికల ప్రకారం జాక్వెలిన్ తుది శ్వాస విడిచినప్పుడు ఆమె పిల్లలు క్లో, జూలియన్ తన పక్కనే ఉన్నారు. డెయిలీ మెయిల్ అందించిన వివరాల ప్రకారం.. నటి కం అందాల రాణి జాక్వెలిన్ కెరీరి మరణ వార్తను శాన్ రాఫెల్ వెండిమియాకు చెందిన సోషల్ నెట్‌వర్క్‌ల ద్వారా ప్రకటించారు.
1996లో అర్జెంటీనాలో జరిగిన శాన్ రాఫెల్ ఎన్ వెండిమియా గ్రేప్ హార్వెస్ట్ ఫెస్టివల్‌లో జరిగిన అందాల పోటీలో జాక్వెలిన్ తన జిల్లాకు రాణిగా పట్టాభిషిక్తురాలైంది. ఫెస్టివల్ నిర్వాహకుల ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్ట్ సారాంశం ఇలా ఉంది. "ఈరోజు మేము మా ఫాలోవర్స్ కి విచారకరమైన వార్తను తెలియజేస్తున్నాం. 1996లో పుంటా డెల్ అగువా జిల్లా రాణి .. డిపార్ట్‌మెంటల్ వైస్రాయ్‌గా ఉన్న జాక్వెలిన్ క్యారిరి మరణించారు. రీనాస్ డి శాన్ రాఫెల్ నుండి మేము కోరుకుంటున్నది ఒక్కటే.. ఈ క్లిష్ట సమయంలో ఆమె కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మా సానుభూతిని తెలియజేయండి" అని రాసి ఉంది.
జాక్వెలిన్ గొప్ప ప్రతిభ ఉన్న మహిళ. కొద్ది రోజుల క్రితం వరకు రోమా థియేటర్‌లో ప్రదర్శితమైన మా డిపార్ట్‌మెంట్ నాటకాలలో ఒక నటిగా ఉన్నారు. జాక్వెలిన్ క్యారిరి బోటిక్ అనే హై-ఎండ్ ఫ్యాషన్ స్టోర్‌ను కూడా కలిగి ఉంది. దురదృష్టవశాత్తు మహమ్మారి సమయంలో దాని తలుపులు మూసివేయవలసి వచ్చింది.. అని ఈ నోట్ లో వెల్లడించారు. జాక్వెలిన్ చాలా సంవత్సరాలు శాన్ రాఫెల్ పోటీల క్వీన్స్ డ్రెస్సింగ్‌లో పాపులర్.. వయా బ్లాంకా అండ్ కార్రుసెల్ వెండిమియల్ పరేడ్‌ల సమయంలో ఆమె దుస్తులు మెరుస్తూ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఆమె యవ్వనంలో, ఆమె శాన్ రాఫెల్ ఎన్ వెండిమియా ఉత్సవానికి డిప్యూటీ క్వీన్ కూడా.. అని వెల్లడించారు.
కాస్మెటిక్ సర్జరీ వల్ల వచ్చే స్ట్రోక్ కారణంగా ఆమె కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లో మరణించింది.
కాస్మెటిక్ సర్జరీల వల్ల వచ్చే సమస్యలు సెలబ్రిటీల్లో సర్వసాధారణం. సాధారణంగా పెరుగుతున్న వయస్సులో వారి యవ్వన రూపాన్ని కోల్పోకుండా ఉంచడానికి లేదా వారి అందాన్ని పెంచడానికి సర్జరీలు చేస్తారు. కాస్మెటిక్ సర్జరీలు చాలా దేశాల్లో అకాల మరణాలకు దారితీశాయి. ఇది మోతాదును మించి ఉపయోగించే రసాయనాల కారణంగా గుండె కొట్టుకునే వేగం అకస్మాత్తుగా పడిపోతుంది లేదా ఊపిరాడకుండా పోతుంది. ఛాతీ నొప్పులు, గడ్డకట్టడం, రక్తస్రావం కూడా అవుతుంది.