2000 కోట్ల డ్రగ్స్ కేసు.. తెరపైకి యువ హీరో పేరు
తమిళ సినీ నిర్మాత, డీఎంకే మాజీ కార్యకర్త జాఫర్ సాదిక్ డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో అరెస్టయిన తర్వాత పరిణామమిది.
By: Tupaki Desk | 10 March 2024 4:40 AM GMTతీగ లాగితే డొంకంతా కదులుతోంది. 2,000 కోట్ల మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ డొంకలో తమిళనాడు మంత్రి కం యువహీరో ప్రమేయం గురించిన సమాచారం అందింది. తమిళ సినీ నిర్మాత, డీఎంకే మాజీ కార్యకర్త జాఫర్ సాదిక్ డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో అరెస్టయిన తర్వాత పరిణామమిది.
శనివారం నాడు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అరెస్టు చేసిన తమిళ సినీ నిర్మాత జాఫర్ సాదిక్, డిఎంకె మంత్రి కం యువహీరో ఉదయనిధి స్టాలిన్‌కు రూ. 7 లక్షలు ఇచ్చినట్లు దర్యాప్తు సంస్థకు తెలియజేసారని ప్రముఖ జాతీయ మీడియా వార్తా కథనం ప్రచురించింది. 2,000 కోట్ల మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో సాదిక్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు.
గత ఏడాది వరదల సమయంలో సాయం చేసేందుకు ఉదయనిధి స్టాలిన్‌కు రూ. 5 లక్షలు ఇచ్చానని, మిగిలిన రూ. 2 లక్షలు పార్టీకి నిధులుగా ఇచ్చానని సాధిక్ అధికారులకు తెలిపాడు. ఈ కేసుకు సంబంధించి తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడిని విచారణకు పిలిచే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
జాఫర్ సాదిక్ ఉదయనిధి స్టాలిన్‌కు ఇచ్చిన డబ్బు అతడు మాదకద్రవ్యాల అక్రమ రవాణాతో ఆర్జించగా వచ్చిన డబ్బు అని ఎన్‌సిబి నమ్ముతోంది. దీనిపై ప్రస్తుతం అధికారులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు లేఖ రాస్తున్నట్లు ఎన్‌సిబి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఆపరేషన్స్) జ్ఞానేశ్వర్ సింగ్ జాతీయ మీడియాకు తెలిపారు. NCB ఇతర ఏజెన్సీలతో కూడా టచ్‌లో ఉందని సింగ్ తెలిపారు.
డిఎంకెతో ఫిల్మ్ ప్రొడ్యూసర్ స్టింట్ గురించి ఇప్పుడు చర్చ సాగుతోంది. జాఫర్ సాదిక్ పేరు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నెట్‌వర్క్‌తో ఉన్న లింక్‌లను ఎన్‌సిబి ప్రస్తావించినందున ఇటీవల డిఎంకె నుండి బహిష్కరణకు గురయ్యాడని జాతీయ మీడియా కథనం తెలిపింది. డీఎంకే ఎన్‌ఆర్‌ఐ విభాగానికి చెన్నై వెస్ట్ డిప్యూటీ ఆర్గనైజర్‌గా ఉన్నానని సాధిక్ ఎన్‌సీబీకి చెప్పాడని జ్ఞానేశ్వర్ సింగ్ పేర్కొన్నట్లు నివేదిక పేర్కొంది.
కేసు పూర్వాపరాలు?
ఫిబ్రవరిలో ఈ కేసులో ఢిల్లీలో ఎన్‌సిబి దాడులు నిర్వహించి, కస్టడీలోకి తీసుకునే ముందు చెన్నై నుండి తిరువనంతపురం, ముంబై, పూణె, అహ్మదాబాద్, జైపూర్‌లకు ప్రయాణించిన తరువాత చిత్ర నిర్మాత సాధిక్ అజ్ఞాతంలోకి వెళ్లారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా కార్యకలాపాల ద్వారా భారీ మొత్తంలో డబ్బు సంపాదించానని, సినిమా, నిర్మాణం, హాస్పిటాలిటీ మొదలైన పరిశ్రమల్లో చట్టబద్ధమైన వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టినట్లు సాధిక్ వెల్లడించినట్లు NCB పేర్కొంది.
ఏజెన్సీ వివరాల ప్రకారం.. అక్రమ మాదకద్రవ్యాల వ్యాపారం నుండి పొందిన డబ్బుతో జాఫర్ సాదిక్ నిర్మించిన 'మంగై' అనే తమిళ చిత్రానికి పూర్తిగా నిధులు వచ్చాయని కూడా తెలిసింది. మునుముందు రోజుల్లో ఎన్‌సిబి కొంతమంది బాలీవుడ్ ఫిల్మ్ ఫైనాన్షియర్‌లను విచారణ కోసం పిలిపించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కేసుకు సంబంధించి గతంలో ఢిల్లీలో ముగ్గురు వ్యక్తులను ఎన్‌సీబీ, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అరెస్ట్ చేశాయి. వారి వద్ద నుంచి 50 కిలోల సూడోపెడ్రిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
సాదిక్ డ్రగ్స్ సిండికేట్‌ను నిర్వహిస్తున్నాడని, గత మూడేళ్లుగా 45 సరుకులను వివిధ దేశాలకు పంపాడని, ఇందులో దాదాపు 3,500 కిలోల సూడోపెడ్రిన్ ఉన్నట్లు ఎన్‌సిబి తెలిపింది. అతడు వివిధ మార్గాల్లో 2000 కోట్ల ఆదాయం ఆర్జించాడని ఎన్సీబీ చెబుతోంది.