బీజేపీ మీద ఫస్ట్ టైం...సెక్యులర్ వాయిస్ తో జగన్
వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి బీజేపీ మీద తొలిసారి మీడియా ముఖంగా కొంత పరుషంగానే మాట్లాడారు.
By: Tupaki Desk | 27 Sep 2024 4:30 PM GMTవైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి బీజేపీ మీద తొలిసారి మీడియా ముఖంగా కొంత పరుషంగానే మాట్లాడారు. బీజేపీ హిందూత్వానికి ప్రతినిధిగా చెప్పుకుంటోంది, చంద్రబాబు తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో అబద్ధాలు ఆడుతూంటే పవిత్ర పుణ్య క్షేత్రాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తూంటే ఆయనను మందలించకుండా బీజేపీ వత్తాసు పలుకుతోంది అని జగన్ ఫైర్ అయ్యారు.
బీజేపీ తమ వైపు బాబు ఉన్నాడు అని ఆయన తప్పు చేసినా ఏమీ అనకూడదని భావిస్తోందా అని ప్రశ్నించారు. బీజేపీ వైఖరి చూస్తే హిందూత్వం మీద ఈ తీరుగానా అనిపిస్తోందని అన్నారు. హిందుత్వం అంటే డెఫినిషన్ ఏంటో కూడా జగన్ చెప్పారు. అందరినీ కలుపుకునేది అని కూడా అన్నారు.
ఇక జగన్ నోట సెక్యులర్ అన్న పదం కూడా వచ్చింది. భారత దేశం సెక్యులర్ అని ఆయన అంటూ ప్రియాంబుల్ లో రాసినది మీడియాకు చదివి వినిపించారు. ఒక మాజీ సీఎం నే ఆలయానికి వెళ్ళకుండా అడ్డుకుంటూంటే ఇక ఈ దేశంలో సెక్యులరిజం ఉన్నట్లేనా అని ప్రశ్నించారు.
పేదలు దళితుల సంగతి ఏమిటి అని కూడా ఆయన అన్నారు. ఈ దేశంలో బడుగులు ఇతర వర్గాల వారి విషయంలో కట్టడి చేస్తారా అని ప్రశ్నించారు. దీనిని బట్టి జగన్ సెక్యులర్ బాట మీద తొలిసారి మాట్లాడినట్లు అయింది. ఏపీలో బీజేపీ హిందూ స్టాండ్ తో ఉంది. ఇపుడు టీడీపీ కూటమి నేతలు కూడా అదే స్టాండ్ తీసుకుంటున్నారు.
దాంతో సెక్యులర్ స్లాట్ లోకి జగన్ మళ్ళుతున్నట్లుగా రాజకీయ సన్నివేశం కనిపిస్తోంది అని అంటున్నారు. జగన్ ని హిందూత్వ కార్డుతో కటడి చేయాలని చూస్తున్నారు అని వైసీపీ అంటోంది. జగన్ కూడా ఇదే తీరున అభిప్రాయపడుతున్నారు. అందుకే ఆయన నోట సెక్యులర్ మాటతో పాటు పేదలు దళితులు వారి అణగారిన వారి సంగతేంటి అన్న ప్రశ్న వచ్చింది. వారిని కూడా కట్టడి చేస్తారా అంటూ బహుజన వాదం వినిపించారు.
అదే విధంగా బీజేపీ విషయంలో కూడా జగన్ ఒకింత విమర్శల వైఖరిందే ప్రదర్శించారు. బీజేపీ ఏపీలో తిరుమల లడ్డూ విషయంలో కల్తీ జరిగింది అన్న దాని మీద సీబీఐ విచారణ చేయాలని జగన్ కొద్ది రోజుల క్రితం ఆ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
అయితే దాని మీద ఇంతవరకూ స్పందన లేదు. అదే ప్రశ్న మీడియా నుంచి వచ్చినపుడు జగన్ బీజేపీ మీద కొంత ఫైర్ అయినట్లుగానే మాట్లాడారు. దానిని బట్టి చూస్తే కేంద్రం లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో సీబీఐ విచారణ వేస్తుంది అన్న నమ్మకాన్ని వైసీపీ అధినాయకత్వం కోల్పోయిందా అన్న చర్చ కూడా సాగుతోంది.
ఏది ఏమైనా ఇపుడు దేశంలో హిందూత్వ వర్సెస్ సెక్యులరిజం అన్న దాని మీద విభజన రేఖ గీసుకుని రాజకీయం సాగుతోంది. ఇపుడు ఏపీలో కూడా సెక్యులరిజం అని వైసీపీ అంటోంది. ఈ మాటను కాంగ్రెస్ కమ్యూనిస్టులు అంటున్నా ఒక పెద్ద ప్రాంతీయ పార్టీగా ఉన్న వైసీపీ దీని మీద సౌండ్ చేయడంతో ఏపీలో కూడా ఈ రెండు రాజకీయ వైఖరుల మీద ఆధారపడి ఫ్యూచర్ పాలిటిక్స్ నడుస్తాయా అన్న చర్చ అయితే ఉంది.
మరో వైపు చూస్తే ఏపీలో రాజకీయాన్ని ఒడిసిపట్టుకుని వైసీపీని ఎలిమినేట్ చేయడానికి టీడీపీ కూటమి చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా హిందూత్వను ముందుకు తెచ్చారని వైసీపీ అనుమానిస్తోంది. దాంతో హిందూత్వ విషయంలో తమ కమిట్మెంట్ ని చాటుకుంటూ వీలైనంత క్లెయిం చేసుకుంటూనే అదే సమయంలో సెక్యులరిజం అంటూ రెండవ పొలిటికల్ స్లాట్ వైపుగా వైసీపీ అడుగులు వేస్తోంది అని అంటున్నారు.
మరి అదే జరిగితే ఏపీలో ఇండియా కూటమితో చెలిమికి వైసీపీ చేతులు చాస్తుందా అన్న చర్చ కూడా ఉంది. ఎందుకంటే ఈ బిగ్ డిబేట్ దేశంలో చాలా ఏళ్ళుగా సాగుతోంది. మరి ఏపీలో కూడా ఇపుడు ఆ వైఖరితో వైసీపీ ఉంటే కనుక బీజేపీ పొలిటికల్ ఫిలాసఫీని బట్టి చూస్తే చేరాల్సిన శిబిరం ఇండియా కూటమి అనే అంటున్నారు. మరి మారుతున్న రాజకీయ సమీకరణలు ఏమి తేల్చుతాయో చూడాల్సిందే.