Begin typing your search above and press return to search.

'పుష్ప 2' ఫ్లెక్సీలలో వైఎస్ జగన్.. బన్నీకి వైసీపీ సపోర్ట్!

అయితే ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాల్లో ఈ సినిమాకి సపోర్ట్ గా వైసీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండటం గమనార్హం.

By:  Tupaki Desk   |   4 Dec 2024 1:30 PM GMT
పుష్ప 2 ఫ్లెక్సీలలో వైఎస్ జగన్.. బన్నీకి వైసీపీ సపోర్ట్!
X

ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్పరాజ్ మ్యానియానే కనిపిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ''పుష్ప 2: ది రూల్'' మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇవాళ రాత్రి నుంచే ప్రీమియర్ షోలు పడబోతున్నాయి. దీంతో అభిమానులు థియేటర్ల వద్ద హంగామా చేస్తున్నారు. భారీ ఎత్తున కటౌట్లు, ఫ్లెక్సీలతో సందడి చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాల్లో ఈ సినిమాకి సపోర్ట్ గా వైసీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండటం గమనార్హం.

'పుష్ప 2' సినిమా కోసం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే ఇక్కడ అల్లు అర్జున్, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటోలతో భారీ ఫ్లెక్సీలు వెలిశాయి. ''మా కోసం నీవు వచ్చావు.. మీ కోసం మేము వస్తాం.. మీ అభిమానం కోసం దేనికైనా తగ్గేదేలే'' అంటూ బన్నీకి మద్దతుగా ఈ ఫ్లెక్సీలు కట్టారు. అలానే కర్నూలులో వైసీపీ యువ నాయకుడు బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి, వైఎస్ జగన్, అల్లు అర్జున్ ఫొటోలతో పెద్ద బ్యానర్ ఏర్పాటు చేసారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇటీవల హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద 'పుష్ప 2' సినిమాకి నంద్యాల వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర రెడ్డి టీమ్ పేరు మీదుగా ఓ బ్యానర్ కట్టారు. అయితే సినిమాలలోకి రాజకీయాలు తీసుకురావద్దంటూ కొన్ని గంటల్లోనే ఆ బ్యానర్ ను తొలగించారు. కానీ ఏపీలో మాత్రం చాలా ప్రాంతాల్లో అల్లు అర్జున్ మూవీకి వైఎస్సార్సీపీ నేతలు మద్దతు తెలపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ మధ్య వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు సైతం 'పుష్ప 2: ది రూల్' చిత్రానికి సపోర్టుగా మాట్లాడిన సంగతి తెలిసిందే.

ఓవైపు 'పుష్ప' సీక్వెల్ కు వైసీపీ శ్రేణులు మద్దతుగా నిలుస్తుంటే, మరోవైపు జనసేన నేతలు మాత్రం ఈ చిత్రాన్ని అడ్డుకుంటామని వార్నింగులు ఇస్తున్నారు. రిలీజ్ కు ముందే అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పి, చిరంజీవి కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకోకపోతే 'పుష్ప-2' చిత్రాన్ని అడ్డుకుంటామని గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో 'పుష్ప 2' వాల్ పోస్టర్లను చించివేశారు.

ఇలాంటివి చూస్తుంటే, అల్లు అర్జున్ Vs పవన్ కళ్యాణ్ ఫ్యాన్ వార్స్ కాస్తా పొలిటికల్ టర్న్ తీసుకునే అవకాశం ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈ మూవీ టీంకి విషెస్ అందజేస్తూ ట్వీట్ చేయడంతో.. 'పుష్ప 2'కి మెగా ఫ్యాన్స్ సపోర్ట్ ఉంటుందనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా ఏవీ 'పుష్ప 2' చిత్రాన్ని అడ్డుకోలేవని ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ అంటున్నారు. పార్టీలకు అతీతంగా ఈ సినిమా చూడటానికి ఆసక్తి కనబరుస్తున్నారనేది అడ్వాన్స్ బుకింగ్స్ సేల్స్ ని బట్టే తెలుస్తోందని కామెంట్స్ చేస్తున్నారు.