'సింబా' సినిమా ఎలా ఉందంటే?
సంపత్ నంది టీమ్ వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై రూపొందిన ఈ సినిమా శుక్రవారం (ఆగస్టు 9) థియేటర్లలోకి వచ్చింది.
By: Tupaki Desk | 9 Aug 2024 10:30 AM GMTసీనియర్ నటుడు జగపతి బాబు, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ''సింబా''. 'ది ఫారెస్ట్ మ్యాన్' అనే ట్యాగ్ లైన్ తో మురళీ మనోహర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఈ మూవీకి స్టోరీ అందించడమే కాదు, నిర్మాతగానూ వ్యవహరించారు. సంపత్ నంది టీమ్ వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై రూపొందిన ఈ సినిమా శుక్రవారం (ఆగస్టు 9) థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం.
కథేంటంటే.. అనుముల అక్షిక (అనసూయ) ఒక స్కూల్ టీచర్. చీమకు కూడా హాని చేయని ఆమె, యాక్సిడెంట్ లో కాళ్ళు పోగొట్టుకున్న తన భర్తను ఫ్యామిలీని చూసుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో హైదరాబాద్ నగరంలో వరుస హత్యలు చేసుకుంటాయి. ఈ కేసుని విచారించిన పోలీసాఫీసర్ అనురాగ్(వశిష్ఠ సింహ).. ఈ మర్డర్స్ వెనుక అక్షికతో పాటుగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఫాజిల్ (శ్రీనాథ్ మాగంటి) ఉన్నట్టు కనుక్కొని వారిద్దరినీ అరెస్టు చేస్తారు. అయితే పోలీసుల విచారణలో ఆ హత్యలతో తమకు సంబంధం లేదని చెప్తారు. ఆ తర్వాత వీరికి మరో వ్యక్తి తోడై ఇంకో హత్య చేస్తాడు. అసలు వారికే తెలియకుండా ఈ హత్యలు ఎలా చేస్తున్నారు? బిజినెస్ మ్యాన్ పార్థ (కబీర్‌సింగ్) కు చెందిన వ్యక్తులనే ఎందుకు చంపుతున్నారు? ఈ ముగ్గురికీ పురుషోత్తం రెడ్డి(జగపతిబాబు)కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఈ మర్డర్స్ కు ఆయనకు ఏమైనా సంబంధం ఉందా? అనేది తెలియాలంటే 'సింబా' సినిమా చూడాల్సిందే.
సమాజానికి అత్యవసరమైన పర్యావరణ పరిరక్షణ గురించి తెలియజెప్పే ఎమోషనల్ రివేంజ్ డ్రామా ఇది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ తో పాటుగా బయోలాజికల్ మెమరీ, సెల్యులార్ మెమరీ వంటి సైంటిఫిక్ అంశాలతో ఆసక్తికరంగా ఈ కథను నడిపించే ప్రయత్నం చేశారు. ఇందులో ప్రకృతిని రక్షించుకుంటే అది మనల్ని రక్షిస్తుంది అనే సందేశాన్ని ఇచ్చారు. దీనికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాకపోతే స్క్రీన్ ప్లే మరింత గ్రిప్పింగ్ గా, ఇంట్రెస్టింగ్ నడిపితే బాగుండేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
పర్యావరణ ప్రేమికుడిగా జగపతి బాబు ఆకట్టుకున్నారు. అనసూయ ఓవైపు టీచర్ గా కనిపిస్తూనే, మరోవైపు యాక్షన్ సీన్స్ తో ఆశ్చర్యపరిచింది. వసిష్ఠ సింహ, శ్రీనాథ్ మాగంటి, అనీష్ కురువిల్లా తమ పాత్రల్లో మెప్పించారు. గౌతమి, కస్తూరి తదితరులు పరిధి మేరకు నటించారు. కృష్ణ సౌరభ్ బ్యాగ్రౌండ్ స్కోర్, కృష్ణ ప్రసాద్ విజువల్స్ ఆకట్టుకుంటాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఓవరాల్ గా పర్యావరణం, మొక్కల పెంపకం మీద సందేశం ఇచ్చే ఈ సినిమా చూడొచ్చనే టాక్ వచ్చింది. మరి ఇది జనాలకు ఏ మేరకు రీచ్ అవుతుందో చూడాలి.