ఆంజనేయుడే ప్రపంచంలో మొట్ట మొదటి సూపర్‌మేన్
By: Tupaki Desk | 4 March 2024 5:08 AM GMTబాక్సాఫీస్ వద్ద `హనుమాన్` భారీ విజయం సాధించిన తర్వాత, దర్శకుడు ప్రశాంత్ వర్మ సీక్వెల్ `జై హనుమాన్`పై దృష్టి సారించారు. ఈ సినిమాని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుంచి హనుమంతుడిపై ప్రజల్లో ఆసక్తి, భక్తి కూడా మరింత పెరిగాయి. నిజానికి ఇప్పుడు మనం ఇంగ్లీష్ సినిమాల్లో చూస్తున్న సూపర్ మేన్ లందరికీ గురువు హనుమంతుడు. వీళ్లందరి కంటే ముందే పురాణాలు ఉన్నాయి. వాటిలో హనుమంతుడి అసాధారణ ప్రజ్ఞ గురించి మనం తెలుసుకున్నాం. చాలా తెలుగు సినిమాల్లో చూశాం. పౌరాణిక చిత్రాల్లో మన దర్శకులు హనుమంతుడి పాత్రను ఎంతో గొప్పగా ప్రెజెంట్ చేసారు.
కానీ మారిన సాంకేకితతో ఇప్పుడున్న విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ తో సూపర్ హీరోగా హనుమంతుడిని చూపిస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన ఎవరూ చేయలేదు. ఇటు సౌత్ కానీ, అటు బాలీవుడ్ కానీ దీనిని ఏనాడూ పట్టించుకున్నది లేదు. ఇప్పటివరకూ ఎవరూ ఈ పాయింట్ ని ఉపయోగించుకోలేదు. ఒక్క ఆంజనేయుడి పాత్రతో అనంతంగా మ్యాజిక్ చేయగలిగే స్కోప్ దర్శకులకు ఉంది. కానీ సరిగా వినియోగించలేదు. ఇంతకుముందు జేమ్స్ కామెరూన్ అవతార్ కోసం ఆంజనేయుడి తోకను తెలివిగా వినియోగించుకున్నారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధించిందో కూడా తెలుసుకున్నాం.
సూపర్ మేన్, బ్యాట్ మేన్, యాంట్ మేన్, అవెంజర్స్ వీళ్లందరి కంటే పవర్ ఫుల్ మన ఆంజనేయుడు.. కానీ నేటి సాంకేతికతతో ఎవరూ ఆంజనేయుడిని ఆ రేంజులో చూపించలేదు. ఇది ప్రశాంత్ వర్మకు పెద్ద ప్లస్ కానుంది.. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యునివర్శ్ కి అన్ లిమిటెడ్ ఛాయిస్ ఉందని అంచనా వేయొచ్చు. హనుమాన్ చిత్రంతో ఆంజనేయుడిపై ప్రశాంత్ వర్మ రైట్స్ సంపాదించాడు. జై హనుమాన్ తో దానిని మరింత పరిపుష్టం చేయాల్సి ఉంది. నేటి అధునాతన సాంకేతికతతో సరికొత్త సూపర్ హీరోగా హనుమంతుడిని తెరపై ఆవిష్కరించేది మన తెలుగు దర్శకుడు అని చెప్పుకునేందుకు మనమంతా గర్వించాలి. ప్రపంచంలో మొట్ట మొదటి సూపర్‌మేన్ ఆంజనేయుడి ప్రతాపాన్ని సిల్వర్ స్క్రీన్ పై ఏ రేంజులో ఆవిష్కరిస్తారో వేచి చూడాలి.
త్వరలో `జై హనుమాన్` కీలక ప్రకటన:
జై హనుమాన్ ని ఇప్పటికే టీమ్ అధికారికంగా ప్రకటించింది. పౌరాణిక సూపర్ హీరో ఫ్రాంచైజీకి సీక్వెల్ గురించి ప్రశాంత్ వర్మ కొన్ని అప్‌డేట్‌లను అందించారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన `హనుమాన్` 50 రోజుల ఫంక్షన్‌లో ప్రశాంత్ వర్మ సీక్వెల్ గురించి తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశాడు. త్వరలో `జై హనుమాన్` గురించి మరో కీలక ప్రకటన చేయనున్నట్లు అభిమానులకు హామీ ఇచ్చాడు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఖరారు చేసి, సినిమా అధికారిక ముహూర్త కార్యక్రమంలో ప్రదర్శిస్తారు. అంతేకాదు `జై హనుమాన్`లో ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తారని వార్తలు వచ్చాయి. కాగా నటీనటుల వివరాలు తెలియరాలేదు.
హనుమాన్ ఫ్రాంచైజీకి హై స్టాండర్డ్ సెట్ చేయడంతో `జై హనుమాన్` అంచనాలకు మించి విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. ఈ ఫ్రాంఛైజీ విజయానికి దర్శకుడు ప్రశాంత్ వర్మ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అతడి దృష్టి ఆధునిక సూపర్ హీరో కోణాన్ని హిందూ పురాణాల ఔచిత్యాన్ని కథలో మిళితం చేయడంపై పూర్తిగా నిలిచి ఉంది. సృజనాత్మకతను హై ఎండ్ లో జోడించనున్నారు. సీక్వెల్‌తో ఏ స్థాయి లక్ష్యాన్ని నిర్ధేశించాడు.. ఎందాకా వెళ్లాలని నిర్ణయించుకుంటాడో చూడాలని అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు.
తేజ సజ్జ `హనుమాన్` చిత్రంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఇందులో హనుమంతుడి పాత్రను తీసుకొని, హనుమంతుని దైవిక శక్తిని పొంది, తన గ్రామానికి హాని కలిగించే చీకటి శక్తులతో పోరాడుతాడు. ఈ చిత్రంలో అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, సముద్రఖని, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటించారు. జై హనుమాన్ లో ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో కూడా నటించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.