Begin typing your search above and press return to search.

పాన్ మసాలా యాడ్ : స్టార్ హీరోలకు నోటీసులు?

ఇప్పటివరకు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్ ఈ ఆరోపణలపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు.

By:  Tupaki Desk   |   9 March 2025 10:59 AM IST
పాన్ మసాలా యాడ్ : స్టార్ హీరోలకు నోటీసులు?
X

జైపూర్‌లోని వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ బాలీవుడ్ ప్రముఖులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్‌లకు నోటీసులు జారీ చేసింది. వీరు ప్రచారం చేసిన పాన్ మసాలా యాడ్ మోసపూరితంగా ఉందనే ఆరోపణలతో ఈ చర్య తీసుకున్నారు. ఆరోగ్యానికి హానికరమైన గుట్కా ఉత్పత్తిని ప్రమోట్ చేయడమే కాకుండా, ప్రజలను తప్పుదారి పట్టించేలా ఈ ప్రకటన ఉందని న్యాయవాది యోగేంద్ర సింగ్ బడియాల్ కోర్టులో ఫిర్యాదు చేశారు.

- ప్రచార ప్రకటనపై ప్రధాన ఆరోపణలు

ఈ ప్రకటనలో "దానె దానె మే కెసర్ కా దమ్" అనే ట్యాగ్‌లైన్ ఉపయోగించారు. అయితే, న్యాయవాది బడియాల్ ఆరోపణల ప్రకారం, ఈ ఉత్పత్తిలో అసలు కేశర్ (సాఫ్రన్) కలిపి ఉండదని, ఇది ప్రజలను మోసం చేసేలా ఉందని అన్నారు. మార్కెట్‌లో కేశర్ ధర లక్షల్లో ఉండగా, రూ.5కే లభించే పాన్ మసాలాలో నిజమైన కేశర్ ఎలా ఉంటుందనే ప్రశ్నను కోర్టు ముందు ఉంచారు. తప్పుడు ప్రచారంతో ప్రజలు మోసపోతున్నారని, దీని వలన ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు.

-వాణిజ్య సంస్థపై కూడా చర్యలు

కేవలం నటులకే కాకుండా, ఈ యాడ్‌ను రూపొందించిన జేబీ ఇండస్ట్రీస్ అధినేత విమల్ కుమార్ అగర్వాల్‌కు కూడా నోటీసులు పంపించారు. కోర్టు, నోటీసులు అందుకున్న 30 రోజుల్లోగా స్పందించాలని ముద్దాయిలందరికీ ఆదేశాలు జారీ చేసింది. అలాగే, మార్చి 19న కోర్టుకు హాజరు కావాలని సూచించింది. హాజరుకాకుంటే, వారు లేకుండానే విచారణ కొనసాగుతుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.

-నోటీసులపై స్పందించని స్టార్ హీరోలు

ఇప్పటివరకు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్ ఈ ఆరోపణలపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అయితే, ప్రముఖ సెలెబ్రిటీల ప్రమోషన్ల వలన ప్రజలు తప్పుదారి పడుతున్నారని, తప్పుడు ప్రకటనల వల్ల వారు బాధ్యత వహించాలని న్యాయవాది బడియాల్ డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రకటనను తక్షణమే బ్యాన్ చేయాలని, తప్పుడు ప్రచారానికి సంబంధించి జరిమానా విధించాలని కోర్టును కోరారు.

ఈ కేసులో నటులు ఏ విధంగా స్పందిస్తారో, ఈ న్యాయపరమైన వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.