ఒకే రోజు 3 భాషల్లో 3 రిలీజులతో 'మెకానిక్ రాకీ' మ్యూజిక్ డైరెక్టర్!
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన 'మెకానిక్ రాకీ' చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం సమకూర్చిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 21 Nov 2024 5:48 PM GMTసౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లిస్టులో జేక్స్ బిజోయ్ కూడా ఉన్నారు. అద్భుతమైన పాటలతో పాటుగా అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు జేక్స్. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలకు సంగీతం సమకూరుస్తున్నారు. 'సరిపోదా శనివారం' సినిమాతో టాలీవుడ్ లోనూ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఆయన సంగీతం ఈ మూవీ విజయానికి ఎంతగా దోహదం చేసిందో చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇప్పుడు జేక్స్ వర్క్ చేసిన మూడు సినిమాలు ఒకే రోజున(నవంబర్ 22) రిలీజ్ అవుతుండటం ఆసక్తికరంగా మారింది.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన 'మెకానిక్ రాకీ' చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం సమకూర్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ మరికొన్ని గంటల్లో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. జేక్స్ మ్యూజిక్ కంపోజ్ చేసిన నిరంగల్ 'మూండ్రు' అనే తమిళ సినిమా.. 'హలో మమ్మీ' అనే మలయాళ చిత్రం కూడా శుక్రవారమే థియేటర్లలోకి రాబోతున్నాయి. ఒకే రోజు 3 భాషల్లో 3 రిలీజులు ఉండటంతో జేక్స్ థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతున్నారు. ''ఇది ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన రోజు. నేను మ్యూజిక్ అందించిన మూడు సినిమాలు ఈరోజు మూడు విభిన్న భాషల్లో బిగ్ స్క్రీన్స్ లో విడుదల అవుతున్నందుకు చాలా థ్రిల్‌గా ఉంది'' అని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.
కేరళకు చెందిన జేక్స్ బిజోయ్.. యూఎస్ లోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుండి మ్యూజిక్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసారు. కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందారు. 2014లో ఏంజెల్స్' అనే మలయాళ మూవీతో మ్యూజిక్ డైరెక్టర్ గా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. 'అయ్యప్పనుమ్ కోషియుమ్' 'ఫోరెన్సిక్' లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు వర్క్ చేసారు. 'తక్క తక్క' సినిమాతో తొలిసారిగా తన సంగీతాన్ని తమిళ ప్రేక్షకులకు వినిపించారు. 2018లో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'టాక్సీవాలా' మూవీతో జేక్స్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. ఇందులోని 'మాటే వినదుగా' పాట అప్పట్లో ట్రెండ్ క్రియేట్ చేసింది.
తెలుగులో ఇప్పటి వరకూ 'చావు కబురు చల్లగా' 'పక్కా కమర్షియల్' 'ఒకే ఒక జీవితం' 'సరిపోదా శనివారం' వంటి చిత్రాలకు జేక్స్ బిజోయ్ సంగీతం సమకూర్చారు. ఆయన మ్యూజిక్ కంపోజ్ చేసిన 'మెకానిక్ రాకీ' ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన 'గుల్లెడు గుల్లేడు', 'ఓ పిల్లో', 'ఐ హేట్ యూ మై డాడీ' పాటలు సంగీత ప్రియులను ఆకట్టుకున్నాయి. ట్రైలర్ 1.0, ట్రైలర్ 2.0 లలో బ్యాగ్రౌండ్ స్కోర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తర్వాత జేక్స్ కి తెలుగులో మరిన్ని ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది.
మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా 'మెకానిక్ రాకీ' తెరకెక్కింది. దీనికి డెబ్యూ డైరెక్టర్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించారు. ఇందులో విశ్వక్ సేన్ సరసన మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి ఈ మూవీని నిర్మించారు. ప్రమోషనల్ కంటెంట్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో వేచి చూడాలి.