Begin typing your search above and press return to search.

పొగరుతో 'టైటానిక్‌' మిస్ అయ్యేది!

జేమ్స్ కామెరూన్ ప్రస్తుతం అవతార్‌ 3 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే పనిలో ఉన్నాడు.

By:  Tupaki Desk   |   12 March 2025 7:00 PM IST
పొగరుతో టైటానిక్‌ మిస్ అయ్యేది!
X

హాలీవుడ్‌ మూవీ 'టైటానిక్‌' గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ సినిమా వచ్చి ముప్పై ఏళ్లు కావస్తున్నా ఇంకా మనం అంతా ఆ సినిమా గురించి మాట్లాడుకోవడం, ఆ సినిమాలోని లవ్‌ సీన్స్ గురించి చర్చించుకోవడం, ఆ సినిమాలోని పాత్రల గురించి మాట్లాడుకుంటూ ఉన్నామంటే ఆ సినిమా ఎంతటి గొప్ప విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మూడు పదుల సంవత్సరాలు దాటిన టైటానిక్‌ను ఇప్పుడు విడుదల చేసినా కచ్చితంగా వేల కోట్ల రూపాయల వసూళ్లు నమోదు అవుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతటి అద్భుత దృశ్య కావ్యంగా జేమ్స్ కామెరూన్‌ టైటానిక్ సినిమాను రూపొందించారు.

జేమ్స్ కామెరూన్ ప్రస్తుతం అవతార్‌ 3 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే పనిలో ఉన్నాడు. ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా అంతర్జాతీయ స్థాయి మీడియా సంస్థలతో తన సినీ అనుభవాలను, అవతార్ ముచ్చట్లను పంచుకుంటూ వస్తున్నాడు. అదే సమయంలో తన టైటానిక్ సినిమా గురించి కూడా పలు విషయాలను జేమ్స్ చెబుతూ వస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో టైటానిక్ హీరో డికాప్రియో గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమాకి డికాప్రియోను ఎంపిక చేసిన సమయంలో అతడి ప్రవర్తన నచ్చలేదు. స్క్రిప్ట్‌ పేపర్స్ చదవమంటే అతడికి కోపం వచ్చింది. అందుకు నిరాకరించడంతో బయటకు వెళ్లిపో అన్నానని కామెరూన్‌ చెప్పుకొచ్చాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే... టైటానిక్ సినిమా కోసం హీరో పాత్ర కోసం ఎంతో మందిని పరిశీలించాం. చివరకు అప్పటికే రెండు మూడు సినిమాల్లో నటించిన డికాప్రియోను సంప్రదించాం. ఆయన వస్తాను అన్న రోజు కంటే రెండు రోజులు ఆలస్యంగా వచ్చాడు. అయినా అతడి కోసం వెయిట్‌ చేశాము. అతడు వచ్చిన తర్వాత సీన్ పేపర్స్ ఇచ్చి చదువుకోమని చెబితే వీటిని నేను ఎందుకు చదవాలి అన్నట్లుగా చూశాడు. తాను ఎక్స్‌పీరియన్స్ నటుడిని అని స్క్రిప్ట్‌ పేపర్ చదవాల్సిన అవసరం లేదని అన్నాడు. దాంతో కామెరూన్‌కి కోసం వచ్చిందట. ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతలు, ఇక మీ దారిన మీరు వెళ్లవచ్చు అంటూ బయటకు వెళ్లే దారిని చూపించాడట.

డికాప్రియో సైతం అక్కడ నుంచి వెళ్లి పోవాలని అనుకున్నాడు. నాలుగు అడుగులు వేసిన తర్వాత ఈ స్క్రిప్ట్‌ పేపర్స్ చదివితేనే నాకు ఈ సినిమాలో అవకాశం ఉంటుందా అంటూ నిర్లక్ష్యంగా అడిగాడట. సరే అని అక్కడ కొద్ది సమయం నిలబడి ఆ స్క్రిప్ట్‌ పేపర్‌ను చదివాడు. ఆ తర్వాత షూటింగ్‌ మొదలైంది. సినిమా విడుదలైన రోజు ఓవర్‌ నైట్‌లో డికాప్రియో వరల్డ్‌ స్టార్‌గా గుర్తింపు దక్కించుకున్నాడు. డికాప్రియోతో పాటు ఈ సినిమాలో హీరోయిన్‌ రోజ్‌ పాత్రను పోషించిన కేట్‌ విన్‌స్లెట్‌ పోషించింది. ఆమె సైతం ఓవర్‌ నైట్‌లో స్టార్‌ హీరోయిన్‌గా మారింది. ఆ సమయంలో పొగరుతో డికాప్రియో అక్కడ నుంచి వెళ్లి పోయి ఉంటే ప్రపంచానికి అతడు ఎవరో అనేది ఇప్పటికి కూడా తెలిసేది కాదేమో.