1984లోనే AI ముప్పు పై హెచ్చరించినా ఎవరూ వినలేదు!
'ది టెర్మినేటర్' ని ఉటంకిస్తూ కామెరూన్ ఈ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు
By: Tupaki Desk | 22 July 2023 4:21 AM GMTఅవతార్ - అవతార్ 2- టైటానిక్ లాంటి సంచలన చిత్రాల సృష్టికర్తగా లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ కి ప్రపంచవ్యాప్తంగా గొప్ప గుర్తింపు ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ సినిమాలన్నిటి కంటే ముందే ఆయన 'ది టెర్మినేటర్' లాంటి కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కించి అసాధారణ విజయాన్ని సొంతం చేసుకున్నారు.
ఇప్పుడు ప్రజలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని ఆయన ఆరోజుల్లోనే 'ది టెర్మినేటర్' మూవీలో చూపించారు. స్కైనెట్ అనే సూపర్ కంప్యూటర్ సృష్టించిన సైబర్ నెటిక్ అనే హంతకుడి చుట్టూ తిరిగే కథాంశమిది. ఈ సినిమా కాన్సెప్ట్ ఏఐతో ముడిపడినది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నిర్మితమయ్యే రోబోలతో మానవాళికి కలిగే తీవ్రమైన ప్రమాదాల గురించి స్పష్ఠంగా 'ది టెర్మినేటర్' సినిమాలో చూపారు కామెరూన్. ఆర్నాల్డ్ స్క్వాజ్ నెగ్గర్ ఈ చిత్రంలో రోబోట్ పాత్రలో అద్భుతంగా నటించారు.
ఇప్పుడు ఏఐ ముప్పుపై తీవ్రమైన చర్చ సాగుతున్న క్రమంలో జేమ్స్ కామెరూన్ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్ సంచనంగా మారింది. కృత్రిమ మేధస్సు పై చర్చిస్తున్న నిపుణులతో తాను ఏకీభవిస్తున్నానని .. అయితే 1984లో దాని గురించి తాను చాలా ముందుగానే హెచ్చరించానని 'ది టెర్మినేటర్' ని ఉటంకిస్తూ కామెరూన్ ఈ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
నేను ఏఐ విషయంలో చాలా ఆందోళన చెందుతున్నాను. 1984లోనే నేను మిమ్మల్ని హెచ్చరించాను.. కానీ మీరు వినలేదు.. అని ఆయన అన్నారు. కామెరాన్ 1984లో దర్శకత్వం (రచయిత కూడా) వహించిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ 'ది టెర్మినేటర్' గురించి మీడియాతో మాట్లాడుతూ పైవిధంగా వ్యాఖ్యానించారు.
''AI ఆయుధీకరణ అతిపెద్ద ప్రమాదం అని నేను భావిస్తున్నాను.. మానవ జాతి AIతో అణు ఆయుధ పోటీకి సమానమైన స్థితికి రావచ్చు. ఇదేగనుక జరిగితే ప్రమాదం మరింత తీవ్రమవుతుంది'' అని కామెరూన్ వ్యాఖ్యానించారు. AI అభివృద్ధి వెనుక ఉద్దేశాలను మూల్యాంకనం చేయడం చాలా కీలకమని ఆయన హైలైట్ చేశారు.
AI లాభాపేక్ష కోసం అభివృద్ధి చేసినట్టయితే దానిని 'బోధనా దురాశ' అని వ్యాఖ్యానించారు. మతిస్థిమితం లేని బోధన ఇది! అని .. రక్షణ కోసం మానవజాతి విశ్లేషించాల్సిన అవసరం ఉందని అతడు నొక్కి చెప్పాడు. 1984లోనే తన సినిమాతో AI ఆయుధీకరణ ముప్పు గురించి సమాజాన్ని హెచ్చరించినట్లు కామెరూన్ స్పష్టంగా ఈ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. AI ఆయుధీకరణ అతిపెద్ద ప్రమాదం అని హెచ్చరించారు.
అయితే సాంకేతికత సినీరంగంలో రచయితలపై ప్రభావం చూపుతుందా? అన్నదానిపైనా ఆయన ముచ్చటించారు. రచయితలను ఎప్పుడైనా సాంకేతికత భర్తీ చేయడంపై తనకు సందేహం ఉందని.. కథ ఎలా రాసామనే దానికంటే దాని నాణ్యతే నిజంగా ముఖ్యమైనదని ఎత్తి చూపాడు. భవిష్యత్తులో అన్ని పరిశ్రమలపై AI ప్రభావాన్ని గుర్తించినప్పటికీ తన స్క్రిప్ట్ లను AI రాయడం తనకు నచ్చదని కూడా అన్నారు. ఉత్తమ స్క్రీన్ ప్లే కోసం ఆస్కార్ ను గెలుచుకోవాలనుకుంటే తాను దాదాపు 20 ఏళ్లపాటు వేచి ఉంటానని AIని సీరియస్ గా తీసుకోనని స్పష్టం చేశాడు.