SS రాజమౌళి RRR పై జేమ్స్ కామెరాన్ ప్రశంసలు
అనంతరం కామెరాన్ కు దర్శకధీరుడు రాజమౌళి సహా చిత్రబృందం కృతజ్ఞతలు తెలియజేసింది.
By: Tupaki Desk | 7 Feb 2024 7:14 AM GMTఆస్కార్, గోల్డెన్ గ్లోబ్స్ వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలను గెలుచుకుంది రాజమౌళి ఆర్.ఆర్.ఆర్. ప్రపంచవ్యాప్తంగా గొప్ప ప్రజాదరణ పొందిన భారతీయ చిత్రమిది. ఈ సినిమాపై పలువురు హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. గత సంవత్సరం గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్‌లో హాలీవుడ్ లెజెండరీ ద్శకుడు అవతార్ ఫేం జేమ్స్ కామెరూన్ .. SS రాజమౌళి ఇరువురికి గొప్ప గౌరవం దక్కింది. వారి సినిమాలు ప్రతిష్ఠాత్మక అవార్డులను కొల్లగొట్టాయి. ఆ సమయంలో కామెరూన్ ఆర్.ఆర్.ఆర్ పై ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు మరోసారి అలాంటి సందర్భమిది. గత రాత్రి జరిగిన 51వ సాటర్న్ అవార్డ్స్ వేడుకలో అవతార్ సృష్టికర్త కామెరాన్ SS రాజమౌళి RRR పై ప్రశంసల జల్లు కురిపించారు.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR గురించి యాంకర్ ప్రశ్నించగా దిగ్గజ దర్శకుడు కామెరాన్ ఇలా వ్యాఖ్యానించాడు, ``ఆర్.ఆర్.ఆర్ ని కళ్లు చెదిరేలా తీసారు. నేను ఆ సమయంలో రాజమౌళితో ఎంతో నిజాయితీగా మాట్లాడాను. ఈ చిత్రం అద్భుతమైనదని నేను అనుకున్నాను.. భారతీయ సినిమా ప్రపంచ వేదికపైకి రావడం చాలా గొప్పగా ఉంది`` అని అన్నారు.
అనంతరం కామెరాన్ కు దర్శకధీరుడు రాజమౌళి సహా చిత్రబృందం కృతజ్ఞతలు తెలియజేసింది.
RRR బృందం తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ``జేమ్స్ కామెరూన్.. మీ విలువైన మాటలు ఎల్లప్పుడూ మరింత మెరుగ్గా ఉత్తమంగా ఉండటానికి మాకు స్ఫూర్తినిస్తాయి. భారతీయ సినిమా అన్ని హద్దులను ఛేదించి పూర్తి స్థాయికి ఎదుగుతుందని మేం గట్టిగా నమ్ముతున్నాము`` అని అన్నారు.
SS రాజమౌళి అభిమానులు సహా భారతీయ సినిమా ఔత్సాహికులు దార్శనికుడైన జేమ్స్ కామెరూన్ నుండి ఒక భారతీయ చిత్రానికి ఇటువంటి ప్రశంసలు దక్కడం గర్వించదగిన సందర్భం. ఇదే ఉత్సాహంలో రాజమౌళి తదుపరి మహేష్ చిత్రాన్ని హాలీవుడ్ లోను అత్యంత భారీగా రిలీజ్ కి ప్లాన్ చేస్తారనడంలో ఎలాంటి సందేహాలు లేవు. మహేష్ చిత్రానికి ఎంపిక చేసుకున్న కథ యూనివర్శల్ అప్పీల్ తో ఉంటుందని ఇప్పటికే కథనాలొచ్చాయి. ఇది ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలోని కథతో రూపొందనుందని సమాచారం.