Begin typing your search above and press return to search.

'జనక అయితే గనక' మూవీ రివ్యూ

మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యువ నటుడు.. సుహాస్. ఇప్పుడు అతడి నుంచి.. 'జనక అయితే గనక' అనే వెరైటీ సినిమా వచ్చింది.

By:  Tupaki Desk   |   12 Oct 2024 5:46 AM GMT
జనక అయితే గనక మూవీ రివ్యూ
X

'జనక అయితే గనక' మూవీ రివ్యూ

నటీనటులు: సుహాస్-సంగీర్తన విపిన్-గోపరాజు రమణ-వెన్నెల కిషోర్-రాజేంద్ర ప్రసాద్-మురళీ శర్మ-ప్రభాస్ శీను తదితరులు

సంగీతం: విజయ్ బుల్గానిన్

ఛాయాగ్రహణం: సాయిశ్రీరామ్

నిర్మాతలు: హర్షిత్ రెడ్డి-హర్షిత రెడ్డి

రచన-దర్శకత్వం: సందీప్ రెడ్డి బండ్ల

మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యువ నటుడు.. సుహాస్. ఇప్పుడు అతడి నుంచి.. 'జనక అయితే గనక' అనే వెరైటీ సినిమా వచ్చింది. అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్లో సందీప్ రెడ్డి బండ్ల అనే కొత్త దర్శకుడు రూపొందించిన చిత్రమిది. దసరా కానుకగా వచ్చిన ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

ప్రసాద్ (సుహాస్) ఓ మధ్య తరగతి కుర్రాడు. తనకు భార్య (సంగీర్తన విపిన్) అంటే ప్రాణం. కానీ తనకు పిల్లలు కనడం ఇష్టముండదు. పిల్లలకు అన్నీ 'ది బెస్ట్' ఇవ్వాలన్న ఉద్దేశం ఉన్న ప్రసాద్.. తన బొటాబొటి జీతంతో పిల్లలకు అన్నీ సమకూర్చడం కష్టమని పిల్లల్ని కనే ఆలోచననే అటకెక్కించేస్తాడు. అర్థం చేసుకునే భార్యతో ప్రేమగా ఉంటూ జీవితాన్ని నడిపిస్తుంటాడు. ఐతే తన ఉద్యోగ జీవితంలో ప్రశాంతత ఉండదు. రోజు రోజుకూ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలోనే తన భార్య గర్భవతి అని తెలుస్తుంది. తాను కట్టుదిట్టంగానే ఉన్నా భార్య ఎలా ప్రెగ్నెంట్ అయిందో అర్థం కాదు. ఈ స్థితిలో అతను ఓ సంచలన నిర్ణయం తీసుకుంటాడు.. ఆ నిర్ణయం ఏంటి.. దాని వల్ల అతడి జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

ఒకప్పుడు సినిమాల్లో ఒక డైలాగ్ రూపంలో చెప్పడానికి కూడా సందేహించే విషయాల మీద ఇప్పుడు ఏ మొహమాటం లేకుండా ఫుల్ లెంగ్త్ సినిమాలే తీసేస్తున్నారు దర్శకులు. ముఖ్యంగా శృంగార సంబంధిత అంశాలపై ఫీచర్ ఫిలిమ్స్ తీసి రెగ్యులర్ సినీ ఆడియన్స్‌ కు అందించడం.. ప్రేక్షకులు కూడా బిడియం పక్కన పెట్టి విశాల దృక్పథంతో ఆ సినిమాలు చూసి ఆదరించడంలో భారతీయ సినిమాలో వచ్చిన విప్లవాత్మక మార్పు. దీనికి నాంది పలికిన సినిమా.. విక్కీ డోనర్. ఈ హిందీ చిత్రం స్ఫూర్తితో భారతీయ భాషల్లో ఈ తరహా రెవల్యూషనరీ సినిమాలు అనేకం వచ్చాయి. అందులో కొన్ని ఆకట్టుకున్నాయి. తెలుగులో ఆ కోవకు చెందిన సినిమానే.. ఏక్ మిని కథ. ఒక కుర్రాడి పురుషాంగం చిన్నదిగా ఉండడం మీద సునిశితమైన హాస్యంతో మెప్పించింది ఆ చిత్ర బృందం. ఇప్పుడు 'జనక అయితే గనక'లో కూడా ఇలాంటి మొహమాట పెట్టే బోల్డ్ అంశాన్ని నరేట్ చేసే ప్రయత్నం చేశాడు యువ దర్శకుడు సందీప్ రెడ్డి బండ్ల. అతను ఎంచుకున్న అంశం బాగుంది కానీ.. కథా విస్తరణ సరిగ్గా జరగకపోవడం.. షార్ప్ గా చెప్పాల్సిన కథను విపరీతంగా సాగదీయడం వల్ల ఈ సినిమా ఆశించిన అనుభూతిని ఇవ్వలేకపోయింది. చెప్పిన పాయింట్ కొత్తది కావడం.. అక్కడక్కడా కామెడీ పండడం వల్ల 'జనక అయితే గనక' ఓ మోస్తరుగా అనిపిస్తుంది కానీ.. ప్రేక్షకులను పూర్తి స్థాయిలో ఎంటర్టైన్ చేయడంలో మాత్రం తడబడింది.

'జనక అయితే గనక'లో ప్లాట్ పాయింట్ ను చిత్ర బృందం విడుదల ముందు వరకు బాగానే దాచి పెట్టింది. ట్రైలర్లో కూడా దాని గురించి బయట పెట్టలేదు. ఐతే ఆ పాయింట్ మరీ రహస్యంగా ఉంచాల్సిన పెద్దదేమీ కాదు. ఇందులో హీరో తన భార్యకు అవాంఛిత గర్భం రావడంతో అందుకు కారణం క్వాలిటీ లేని కండోమే అని భావించి దాని తయారీ సంస్థ మీద కోర్టుకెక్కుతాడు. తనకు నష్టపరిహారంగా కోటి రూపాయలు కట్టమంటాడు. దీని మీద నడిచే కోర్ట్ రూం డ్రామానే ఈ సినిమా. అసలు కథలో వెళ్లడానికి ముందు హీరో.. తనెంతో ప్రేమించే భార్య.. అతను నిత్యం గొడవపడే నాన్న.. ఇతర కుటుంబ సభ్యులు.. ప్రియమైన స్నేహితుడు.. తన ఉద్యోగ జీవితం గురించి ఇంట్రోలు ఇస్తూ కాసేపు కాలక్షేపం చేయించాడు దర్శకుడు. పిల్లల్ని కనడం మీద తన అయిష్టతకు ఉన్న కారణాలను కూడా చర్చించాడు. ఇవన్నీ కూడా సరదాగా.. ఆహ్లాదరకంగా నడవడంతో 'జనక అయితే గనక' మంచి ఫీలింగే ఇస్తుంది. ఇలా ప్రశాంతంగా కథ నడిచిపోతున్న సమయంలో హీరో భార్య గర్భం దాల్చడంతో కథలో కీలక మలుపు వస్తుంది. ఆ తర్వాత కండోమ్ కంపెనీ మీద హీరో పోరాటం నేపథ్యంలోనే పూర్తిగా నడుస్తుంది.

ఐతే కోర్టులో వాదనల మీద గంటంబావు కథనాన్ని నడిపించాలంటే చాలా కసరత్తు జరగాలి. కోర్టు ప్రొసీడింగ్స్ ను బిగితో.. ఆసక్తికరంగా నడిపించే కథన నైపుణ్యం ఉండాలి. కానీ దర్శకుడు సందీప్ రెడ్డి ఇక్కడే తడబడ్డాడు. కోర్టులో హీరో.. వైరి వర్గం మధ్య ఎత్తులు పైఎత్తులతో ఇంటెన్స్ గా నడిపించడానికి అవసరమైనట్లుగా కథనాన్ని అల్లుకోవడం కంటే.. కామెడీ మీద ఆధారపడ్డాడు. ఎంత కండోమ్ ఫెయిల్యూర్ మీద కేసు అయినంత మాత్రాన జడ్జి స్థానంలో కూర్చున్న వ్యక్తి హీరో బెడ్రూంలో రొమాన్స్ గురించి ప్రస్తావించగానే లొట్టలు వేస్తూ వినడం.. హీరో ఏదో ఊహించుకోమన్నాడని తన భార్యతో శృంగార జీవితం గురించి ఊహల్లోకి వెళ్లిపోవడం.. వాళ్ల బెడ్రూంలోకి హీరో వచ్చి నానా బీభత్సం చేయడం.. ఇలా సన్నివేశాలను నడిపించడం ఏంటో అర్థం కాదు. హీరో మంచి పాయింట్ చెప్పగానే జడ్జి ముఖానికి ఫైల్ అడ్డం పెట్టుకుని 'ఎస్' అంటూ సంబరపడిపోతాడు ఎంత కామెడీ సినిమా అయినా జడ్జి పాత్రను ఇలా డిజైన్ చేసి తెర మీద జరిగే కోర్ట్ రూం డ్రామాతో ఎంగేజ్ కమ్మని చెబితేం ఎలా అవుతాం? పైగా సింపుల్ గా తేలిపోయే ప్రతి విషయానికీ దీర్ఘమైన ఆలోచనలు.. గొప్ప పాయింట్ పట్టేసుకున్నట్లు బిల్డప్పులు.. వాటికి కోర్టులోని వారి నుంచి సూపరో సూపరంటూ రియాక్షన్లు.. ఇవి చాలవన్నట్లు సుదీర్ఘమైన ప్రసంగాలు.. ఇలా ఈ కోర్ట్ రూం డ్రామా విపరీతమైన నాటకీయత.. సాగతీతతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. అరగంటలో ముగించాల్సిన కోర్ట్ రూం ఎపిసోడ్ ను గంటకు పైగా లాగడం వల్ల అడుగడుగునా సాగతీత ఫీలింగ్ కలుగుతుంది. అక్కడక్కడా కొంత కామెడీ పండినా.. విజిల్ వర్తీ మూమెంట్స్ ఉన్నా.. ఓవరాల్ గా కోర్టులో జరిగే వ్యవహారం రసవత్తరంగా మాత్రం సాగదు. సింపుల్ గా చెప్పాలంటే షార్ట్ ఫిలిం కోసం కాన్సెప్ట్ రాసి ఫీచర్ ఫిలింగా మార్చిన ఫీలింగ్ తెప్పిస్తుంది 'జనక అయితే గనక'.

నటీనటులు:

సుహాస్ కథల ఎంపికలో సినిమా సినిమాకు వైవిధ్యం చూపిస్తున్నాడు. సుహాస్ సినిమా అంటే వెరైటీగా ఉంటుంది అనే నమ్మకాన్ని కలిగిస్తున్నాడు. మరోసారి అతను కొత్త కథను ట్రై చేశాడు. ఇలాంటి పాత్రను చేయడానికి అందరూ ఒప్పుకోరు. ఈ బోల్డ్ అటెంప్ట్ చేసినందుకు అతను అభినందనీయుడు. ఇక ప్రసాద్ పాత్రలో ఎక్కడా అతి చేయకుండా కొలిచినట్లు నటించాడు. వినోదాన్ని పండించడంలోనే కాక భావోద్వేగాల విషయంలోనూ తనకు మంచి మార్కులు పడతాయి. హీరోయిన్ సంగీర్తన విపిన్ చూడముచ్చటగా ఉంది. తన నటనా బాగుంది. గ్లామర్ హీరోయిన్ గా ఎదగగలదో లేదో కానీ.. ఇలాంటి పాత్రలకు మాత్రం ఆమె బాగానే సూటవుతుంది. గోపరాజు రమణ తనకు అలవాటైన తండ్రి పాత్రలో వినోదాన్ని పంచాడు. వెన్నెల కిషోర్ బాగానే నవ్వించాడు. రాజేంద్ర ప్రసాద్ తన శైలిలో కామెడీ చేశాడు కానీ.. జడ్జి పాత్రలో అలా నటించడం మాత్రం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. మురళీ శర్మ.. ప్రభాస్ శీను.. మిగతా నటీనటులు బాగానే చేశారు.

సాంకేతిక వర్గం:

'బేబి' ఫేమ్ విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం ఓ మోస్తరుగా అనిపిస్తుంది. నా ఫేవరెట్ నా పెళ్లామే పాట పర్వాలేదనిపిస్తుంది. మరో పాట సోసోగా అనిపిస్తుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ ఓకే. సాయిశ్రీరామ్ ఛాయాగ్రహణం సినిమాకు తగ్గట్లు సాగింది. నిర్మాణ విలువలు ఓ మోస్తరుగా అనిపిస్తాయి. కథ ప్రకారమే ప్రాపర్టీస్ చూపించడం వల్ల ప్రొడక్షన్ వాల్యూస్ గొప్పగా అనిపించకపోవచ్చు. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి బండ్ల.. దర్శకుడిగా తొలి చిత్రానికి భిన్నమైన.. బోల్డ్ టచ్ ఉన్న కథను ఎంచుకోవడం బాగుంది. కథ.. అందులోని ట్విస్ట్ ఓకే. కొన్ని సీన్లను బాగా డీల్ చేశాడు. కానీ రెండు గంటల నిడివికి తగ్గట్లుగా చిక్కనైన కథనాన్ని మాత్రం అల్లుకోలేకపోయాడు. సున్నితమైన కథను ఎంచుకుని ఓవర్ ద టాప్ స్టయిల్లో నరేట్ చేశాడు. సన్నివేశాలను క్రిస్ప్ గా తీర్చిదిద్దలేకపోయాడు.

చివరగా: జనక అయితే గనక.. వెరైటీనే కానీ సాగతీత

రేటింగ్ - 2.25/5