Begin typing your search above and press return to search.

తెర కోసం ఏడ్చినా త‌ట్టుకోలేను.. ఖుషీపై జాన్వీ ప్రేమ‌!

న‌ట‌న వేరు.. రియాలిటీ వేరు. ఏదైనా త‌ట్టుకోలేని బాధ క‌లిగితే ఏడ్వ‌టం స‌హ‌జం. ఇక‌ న‌టిగా స‌న్నివేశం కోసం ఏడ్వాల్సి రావొచ్చు.

By:  Tupaki Desk   |   6 Feb 2025 2:30 AM GMT
తెర కోసం ఏడ్చినా త‌ట్టుకోలేను.. ఖుషీపై జాన్వీ ప్రేమ‌!
X

న‌ట‌న వేరు.. రియాలిటీ వేరు. ఏదైనా త‌ట్టుకోలేని బాధ క‌లిగితే ఏడ్వ‌టం స‌హ‌జం. ఇక‌ న‌టిగా స‌న్నివేశం కోసం ఏడ్వాల్సి రావొచ్చు. కానీ త‌న గారాల చెల్లెలు ఖుషి క‌పూర్ తెర కోసం ఏడ్చినా తాను త‌ట్టుకోలేన‌ని అంది జాన్వీక‌పూర్. అంతేకాదు త‌న సోద‌రి ఖుషీక‌పూర్ కి జాన్వీ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ఖుషి న‌టించిన మొదటి పెద్ద‌తెర‌ చిత్రం ల‌వ్ యాపా ఈ ఫిబ్ర‌వ‌రి 7న విడుద‌ల‌వుతుండ‌గా, త‌న సోద‌రి కోసం జాన్వీ క‌పూర్ కూడా ప్ర‌చార సాయం చేస్తోంది. డెబ్యూ న‌టి సినిమాకి ఆశించిన బ‌జ్ లేక‌పోవ‌డంతో జాన్వీ ప్ర‌చారం ప‌రంగా మ‌రింత హీట్ పెంచ‌డం ద్వారా యూత్ ని ఆక‌ర్షించాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది.

ఓవైపు రామ్ చ‌ర‌ణ్‌- బుచ్చిబాబు ఆర్.సి 16 సినిమా కోసం షూటింగ్ కి వెళుతున్నా కానీ, మ‌రోవైపు త‌న చెల్లెలు ఖుషిక‌పూర్ డెబ్యూ సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం జాన్వీ స‌మ‌యాన్ని కేటాయిస్తోంది. జాన్వీ తాజా పోస్ట్ లో ఖుషీ గురించి ఇలా వ్యాఖ్యానించింది. ``ఎంత కష్టమైనా కానీ నీకు నచ్చిన దాన్ని చాలా నిజాయితీగా, శ్రద్ధగా చేస్తున్నందుకు నిన్ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. వినోదం, హాస్యంతో పాటు ఎమోషనల్ సన్నీవేశాలతో కూడిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం రేపటి నుంచి అన్ని థియేటర్స్‌లో సందడి చేస్తుంది. నేను ఈ సినిమా చూసి కచ్చితంగా భావోద్వేగానికి గురవుతాను. ఎందుకంటే ఎమోషనల్ సీన్స్ లో నా ఖుషీ ఏడవడం పెద్ద తెర‌పై చూసినప్పుడు నేను తగ్గుకోలేను. ఖుషీ దయచేసి నీ సినిమా రిలీజ్ అయినప్పుడు నువ్వు నా ఫొటో ఉన్న టీ షర్ట్ ధరించాల్సిందే`` అని స్వీట్ గా హెచ్చ‌రించింది. జాన్వీ `ల‌వ్ యాపా` అని ప్రింట్ చేసిన టీష‌ర్టును ధ‌రించి దాని ఫోటోల‌ను షేర్ చేసింది.

అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ కి ఇది రెండో చిత్రం. `మ‌హారాజా` త‌ర్వాత `ల‌వ్‌యాపా` జునైద్ కి డిఫ‌రెంట్ సినిమా. కానీ డెబ్యూ స్టార్స్ సినిమా ఆశించిన బ‌జ్ సృష్టించ‌లేక‌పోయింది. ఓవైపు అమీర్ ఖాన్, మ‌రోవైపు ఖుషిక‌పూర్ కూడా ల‌వ్ యాపాను ప్ర‌మోట్ చేసేందుకు చాలా ప్ర‌యాస‌లు ప‌డుతున్నారు. ఈ చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు.