మలయాళీ పెళ్లి కుమార్తెగా తంగ!
కథలో భాగంగా ఇద్దరు ప్రేమ వివాహం చేసుకుంటారుట. అయితే ఈ వివాహం పూర్తిగా మలయాళం సంప్రదాయాల ప్రకారం జరుగుతోందిట.
By: Tupaki Desk | 26 Dec 2024 12:30 AM GMT'దేవర' సినిమాతో అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ సౌత్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలి సినిమాతోనే అమ్మడు భారీ విజయాన్ని అందుకుంది. తంగ పాత్రలో పెద్దగా కనెక్ట్ కాలేదు గానీ అతిలోక సుందరి బ్రాండ్ తో వెళ్లిపోయింది. దీంతో నటిగా తాను నిరూపించుకోవాల్సిన చిత్రం ఆర్సీ 16 అయింది. ఇందులో ఈ భామే హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తోన్న చిత్రంలో జాన్వీ నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో కనిపించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.
ఆ సంగతి పక్కనబెడితే తాజాగా ఈ బ్యూటీ మలయాళీ పెళ్లి కూతురు కాబోతుంది? అన్నది వెలుగులోకి వచ్చింది. అవును అచ్చంగా అక్కడ పెళ్లి కుమార్తెలు ఎలా ఉంటారో? ప్రేక్షకులకు పరిచయం చేయబోతుంది. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్ లో 'పరమ్ సుందరి' అనే చిత్రంలో నటిస్తోంది. ఇందులో సిద్దార్ధ్ మల్హోత్రాకి జోడీగా నటిస్తోంది. 'దస్వీ' ఫేం తుసార్ జలోటా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సిద్దార్ధ్ ఢిల్లీకి చెందిన వ్యాపార వేత్త పాత్ర పోషిస్తుండగా, జాన్వీ కపూర్ మలయాళీ అమ్మాయిగా నటిస్తుందిట.
కథలో భాగంగా ఇద్దరు ప్రేమ వివాహం చేసుకుంటారుట. అయితే ఈ వివాహం పూర్తిగా మలయాళం సంప్రదాయాల ప్రకారం జరుగుతోందిట. దీనిలో భాగంగా జాన్వీ కపూర్ ని ప్రేక్షకులు మలయాళీ పెళ్లి కుమార్తెగా చూసే అవకాశం దక్కబోతుంది. తమిళనాడు, తెలుగు రాష్ట్రాల పద్దతలకు కాస్త భిన్నంగా మలయాళం పద్దతులుంటాయి.
పెళ్లి కుమార్తెను అక్కడ ఎంతో ప్రత్యేకంగా అలంకరిస్తారు. ముఖ్యంగా పెళ్లికి ముందు జరిగే వేడుకలో పెళ్లి కుమార్తెను ప్రత్యేకంగా ఊరేగిస్తారు. ఇవన్నీ 'పరమ్ సుందరి' చిత్రంలో జాన్వీ కపూర్ ప్రేక్షకులకు చూపించ బోతుంది. ఈ సినిమాలో సిద్దార్ద్ మల్హోత్రా-జాన్వీ కపూర్ ప్రేమ వివాహం చేసుకున్న దంపతులుగా తెరపై కనిపించబోతున్నట్తు తెలుస్తోంది. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాల్సి ఉంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది.