Begin typing your search above and press return to search.

‘చుట్టమల్లే’ బీటీఎస్‌ వీడియో: జెల్లీ ఫిష్ లకు జంకిన జాన్వీ!

ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న జాన్వీ.. తాజాగా 'చుట్టమల్లే' పాటకు సంబంధించిన బీటీఎస్‌ వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

By:  Tupaki Desk   |   11 Oct 2024 10:09 AM GMT
‘చుట్టమల్లే’ బీటీఎస్‌ వీడియో: జెల్లీ ఫిష్ లకు జంకిన జాన్వీ!
X

'దేవర' సినిమాతో సక్సెస్ ఫుల్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టింది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. జూనియర్ ఎన్టీఆర్ కు జోడీగా, తంగం అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో విశేషంగా ఆకట్టుకుంది. స్క్రీన్ స్పేస్ తక్కువే ఉన్నప్పటికీ, ఆమె అందానికి ఆడియన్స్ ఫిదా అయ్యారు. తారక్ తో ఆమె పంచుకున్న కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న జాన్వీ.. తాజాగా 'చుట్టమల్లే' పాటకు సంబంధించిన బీటీఎస్‌ వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

దేవర పార్ట్-1లో 'చుట్టమల్లే' పాట ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రిలీజ్ కు ముందు ఇంటర్నెట్ లో ట్రెండ్ క్రియేట్ చేసిన ఈ రొమాంటిక్ మెలోడీ.. రిలీజ్ తర్వాత థియేటర్లను షేక్ చేసింది. సినిమాలో ఈ సాంగ్ వచ్చినప్పుడు థియేటర్లన్నీ ఆహ్ సౌండ్ తో మారుమ్రోగిపోయాయి. అయితే ఈ పాట షూటింగ్ ఎలా జరిగిందనే వివరాలు తెలియజేస్తూ, జాన్వీ కపూర్ తన ఇన్స్టాగ్రామ్ లో బీటీఎస్‌ (బిహైండ్‌ ది సీన్స్‌) వీడియోను పంచుకుంది. ఇవి నెట్టింట వైరల్ గా మారాయి.

'చుట్టమల్లే' పాటను థాయిలాండ్ లోని కోహ్ హాంగ్ ఐలాండ్ లోని అందమైన కో పాక్ బియా బీచ్ లోకేషన్ లో షూట్ చేసారు. అయితే అక్కడ జెల్లీ ఫిష్ లు ఎక్కువగా ఉంటాయని తెలియడంతో జాన్వీ కపూర్ కాస్త జంకినట్లు తెలుస్తోంది. 'జెల్లీ ఫిష్ లతో జాగ్రత్తగా ఉండండి' అనే హెచ్చరిక బోర్డును చూపిస్తూ.. ఇక్కడే తాను షూటింగ్ లో పాల్గొనడానికి వెళ్తున్నట్లు తెలిపింది. తాను ధరించిన సిల్క్ శారీ తనని కాపాడుతుందని ఆశిస్తున్నాని, బతుకుతాను అనే అనుకుంటున్నానని సరదాగా మాట్లాడింది. ఇదొక మెమొరబుల్ షాట్ అవుతుందని భావిస్తున్నానని చెప్పింది.

ముందురోజు ఒక పొడవైన పదునైన రాక్ మీదకు ఎక్కి షూట్ చేశామని, ఈరోజు జెల్లీ ఫిష్ లు ఉన్న ప్రదేశంలో చిత్రీకరించబోతున్నామని జాన్వీ వీడియోలో తెలిపింది. అయితే ఆమె కంటే ముందు సముద్రంలోకి వెళ్లి కెమెరా పొజిషన్ ను సెట్ చేస్తున్న అమ్మాయికి మాత్రం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందేనని అంటోంది. సముద్రంలో షూటింగ్ చేస్తుండగా తీసిన వీడియోలు పోస్ట్ చేసింది. జాన్వీ ధైర్యంగా వెళ్లి షూట్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటుగా వర్షంలో తడుస్తూ బోట్ లో ప్రయాణిస్తున్న మరో వీడియోని కూడా అమ్మడు పంచుకుంది.

ఇకపోతే 'చుట్టమల్లే' సాంగ్ లో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇద్దరి డాన్స్‌ మూవ్స్ తో పాటు విజువల్స్‌ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. దీనికి రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ బ్యూటిఫుల్ మెలోడీ ట్యూన్ ను కంపోజ్ చేయగా.. రామజోగయ్య శాస్త్రి మంచి సాహిత్యం రాశారు. సింగర్ శిల్పా రావు వాయిస్ ఈ పాటకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

'దేవర' పార్ట్-1లో జాన్వీ నిడివి తక్కువగా ఉందనే దానిపై దర్శకుడు కొరటాల శివ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. 'దేవర 2' లో తంగం పాత్ర ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పారు. ఆమె పాత్ర పవర్ ఫుల్ గా కూడా ఉంటుందని, జాన్వీని చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారని తెలిపారు.