Begin typing your search above and press return to search.

బెయిల్‌ తర్వాత జానీ మాస్టర్‌ థాంక్స్ పోస్ట్‌..!

అసిస్టెంట్‌ పై అత్యాచారం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్‌ గత నెల రోజులుగా జైల్లో ఉన్న విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   25 Oct 2024 7:34 AM GMT
బెయిల్‌ తర్వాత జానీ మాస్టర్‌ థాంక్స్ పోస్ట్‌..!
X

అసిస్టెంట్‌ పై అత్యాచారం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్‌ గత నెల రోజులుగా జైల్లో ఉన్న విషయం తెల్సిందే. బాధితురాలు మైనర్‌గా ఉన్నప్పటి నుంచే అత్యాచారానికి పాల్పడటంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేయడం జరిగింది. నాటకీయ పరిణామాల నేపథ్యంలో జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. పలు దఫాలుగా పోలీసులు ఎంక్వయిరీ చేయడం జరిగింది. పలు కారణాలు చూపించి జానీ మాస్టర్ బెయిల్‌ దక్కించుకున్నాడు. బెయిల్‌ పై నేడు బయటకు రాబోతున్న జానీ మాస్టర్‌ సోషల్‌ మీడియా ద్వారా ఆసక్తికర పోస్ట్‌ ను షేర్‌ చేయడం జరిగింది.

జానీ మాస్టర్‌ బయటకు రాకముందే ఆయన సోషల్‌ మీడియా అకౌంట్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఆ వీడియోలో తాను చేసిన పాటను యూట్యూబ్‌ ట్రెండ్‌ లో ఉంచినందుకు గాను జనాలకు కృతజ్ఞతలు తెలియజేశాడు. హిందీ మూవీ 'భూల్‌ భులయ్యా 3' టైటిల్‌ ట్రాక్ కి జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీ అందించారు. హరే రామ్‌ హరే రామ్‌ పాట గత కొన్ని రోజులుగా యూట్యూబ్‌ లో తెగ చక్కర్లు కొడుతూ ట్రెండ్‌ అవుతోంది. జానీ మాస్టర్ ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ, తాను ఆ పాట కోసం వర్క్ చేసిన విజువల్స్ ను జోడించి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వీడియోను షేర్ చేయడంతో పాటు, ట్రెండింగ్‌లో నిలిపినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్ అంటూ పోస్ట్‌ చేశాడు.

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకు వెళ్లిన కారణంగా జానీ మాస్టర్ తో చేయించాల్సిన 'పుష్ప 2' సినిమా ఐటం సాంగ్‌ను మరో కొరియోగ్రాఫర్ తో చేయించాలని నిర్ణయించుకున్నట్లుగా ఇటీవల మీడియా సమావేశంలో నిర్మాతలు ప్రకటించారు. త్వరలోనే ఐటం సాంగ్‌ చిత్రీకరణ ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. జానీ మాస్టర్‌ కి బెయిల్‌ వచ్చిన కారణంగా ఆయన బయటకు వస్తాడు కనుక పుష్ప 2 ఐటం సాంగ్‌ కి ఆయనతో కొరియోగ్రఫీ చేయించాలని కొందరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ నిర్మాతలు ఇప్పటికే జానీ మాస్టర్ స్థానంలో మరో మాస్టర్‌ ను తీసుకు వచ్చినట్లుగా అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే.

జానీ మాస్టర్ కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే కాకుండా తమిళం, హిందీ ఇంకా ఇతర భాషల సినిమాలకు సైతం కొరియోగ్రఫీ అందించారు. తమిళ సినిమాలో ఒక పాటకు కొరియోగ్రఫీ అందించినందుకు గాను ఏకంగా జాతీయ అవార్డుకి జానీ మాస్టర్‌ ఎంపిక అయ్యాడు. కానీ అత్యాచార కేసు ఎదుర్కోవడంతో పాటు, జైలులో ఉన్న కారణంగా జానీ మాస్టర్‌ కి ఇచ్చిన జాతీయ అవార్డును వెనక్కి తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బెయిల్‌ వచ్చిన జానీ మాస్టర్ తిరిగి కెరీర్‌ లో బిజీ అవ్వడానికి కొన్నాళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. ముందు ముందు తిరిగి ఆయన టాలీవుడ్‌ మోస్ట్‌ క్రేజీ అండ్‌ బిజీ కొరియోగ్రాఫర్‌గా మారుతాడా అనేది చూడాలి.