అదంతా ఫేక్.. ఎవరూ నమ్మొద్దు: జానీ మాస్టర్
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 9 Dec 2024 11:53 AM GMTప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. జానీ తనను లైగికంగా వేధించాడంటూ లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఆయనపై కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో 36 రోజులు పాటు చంచల్ గూడ జైలులో ఉన్న డ్యాన్స్ మాస్టర్.. కొన్ని రోజుల క్రితం బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇప్పటికే ఈ కేసు వల్ల ఆయనకు నేషనల్ ఫిలిం అవార్డ్ రద్దు చేయబడింది. అయితే ఇప్పుడు జానీకి మరో ఊహించని షాక్ తగిలిందని, ఆయన్ను డాన్సర్స్ అసోసియేషన్ నుంచి పూర్తిగా తొలగించారని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై తాజాగా జానీ స్పందిస్తూ.. అదంతా ఫేక్ అని, ఎవరూ నమ్మొద్దని వివరణ ఇచ్చారు.
''నిర్ధారణవ్వని ఆరోపణలని కారణంగా చూపిస్తూ నన్ను శాశ్వతంగా యూనియన్ నుండి తొలగించినట్టు మీడియాలో పుకార్లు పుట్టిస్తున్నారు. అవేవీ నమ్మకండి. నా పదవీ కాలం ఇంకా ఉన్నా కూడా అనధికారికంగా, అనైతికంగా ఎలక్షన్లు నిర్వహించి వారికి వారే నిర్ణయాలు, హోదాలు తీసుకునే హక్కు ఎవరికీ లేదు. దీనికి కారణమైన వారిపై చట్టపరంగా వెళ్తున్నాను. టాలెంట్ ఉన్నవారికి పనివ్వకుండా, దొరక్కుండా ఎవ్వరూ ఆపలేరు. నా కొరియోగ్రఫీలో 'గేమ్ ఛేంజర్' నుండి ఓ మంచి పాట రాబోతుంది, మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది'' అని జానీ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఈ మేరకు ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసారు.
''నన్ను డ్యాన్సర్స్ అసోసియేషన్ నుంచి శాశ్వితంగా తొలగించారని ఉదయం నుంచీ ఓ న్యూస్ వస్తోంది. అదంతా అదంతా ఫేక్.. నమ్మొద్దు. నన్ను ఎవరూ ఏ యూనియన్ నుంచి తీసేయలేదు. నా కార్ట్ తీసేయలేదు. నేను డ్యాన్సర్స్ యూనియన్ లో మెంబెర్ గా ఉన్నాను. నిన్న జరిగిన ఎలక్షన్స్ పై లీగల్ గా నేను ఫైట్ చేస్తున్నాను. ఆ వివరాలు త్వరలో చెప్తాను. కొన్ని ఛానల్స్ మాత్రం నిజా నిజాలు తెలుసుకోకుండా అవతలి వారిని బాధ పెట్టేలా వార్తలు ఇస్తున్నారు. నన్ను శాశ్వితంగా తీసేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నన్నే కాదు, ఎవరినీ శాశ్వితంగా తీసేయలేరు. పనిని టాలెంట్ ను ఆపే హక్కు ఎవరికీ లేదు. ఎవరైనా ఎక్కడైనా పని చేసుకోవచ్చు. ముక్కురాజు మాస్టర్ పెట్టిన యూనియన్ కి ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఆ యూనియన్ ద్వారానే నాకు ఇంత మంచి గుర్తింపు, పేరు వచ్చాయి. నాకు పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అనే ట్యాగ్ కూడా వచ్చింది. అలాంటి యూనియన్ ని ఎప్పుడూ నేను గౌరవిస్తాను. అక్కడ జరిగిన ఎన్నికలపై నేను లీగల్ గా ఫైట్ చేస్తాను'' అని జానీ చెప్పుకొచ్చారు.
జానీ మాస్టర్ చెప్పిన దాని బట్టి, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా డ్యాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించినట్లు అర్థమవుతోంది. ఈ ఎన్నికల్లో జోసెఫ్ ప్రకాష్ మాస్టర్ అధ్యక్షుడిగా గెలుపొందినట్లుగా వార్తలు వస్తున్నాయి. కొత్త ప్యానెల్ ఏర్పడిన తర్వాత జానీని డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుండి శాశ్వితంగా తొలగించారనే ప్రచారం మొదలైనట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న జానీ.. తన పదవీకాలం పూర్తి కాకుండానే ఎలక్షన్స్ పెట్టడాన్ని లీగల్ గా సవాలు చెయ్యాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియజేస్తానని చెబుతున్నారు.