జానీ రిమాండ్ రిపోర్టులో సంచలన అంశాలు!
ఈ క్రమంలో పోలీసులు దఖలు పర్చిన రిమాండ్ రిపోర్టులో ఏమేం అంశాలు ఉన్నాయి? అన్నది చూస్తే..
By: Tupaki Desk | 21 Sep 2024 4:47 AM GMTతన వద్ద పని చేసే సహాయ కొరియోగ్రాఫర్ పై నాలుగేళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ అలియాస్ షేక్ జానీ బాషా (42) గోవాలో అరెస్టు కావటం.. తాజాగా కోర్టు ఎదుట హాజరుపర్చటం తెలిసిందే. మైనర్ బాలికపై అత్యాచారంతోపాటు.. లైంగిక దాడికి సంబంధించిన తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న జానీకి కోర్టు రిమాండ్ విధించటం తెలిసిందే. పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో బోలెడన్ని సంచలన అంశాల్ని పేర్కొన్నారు. గోవాలో అరెస్టు చేసి హైదరాబాద్ కు తీసుకురావటమే కాదు.. వైద్య పరీక్షల అనంతరం చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ క్రమంలో పోలీసులు దఖలు పర్చిన రిమాండ్ రిపోర్టులో ఏమేం అంశాలు ఉన్నాయి? అన్నది చూస్తే..
- ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన షేక్ జానీ బాషా (42) డ్యాన్స్ లో శిక్షణ పొందాడు. 2000లో హైదరాబాద్ చేరాడు. క్రిష్ణానగర్ లో ఉంటూ తెలుగు ఫిలిం టీవీ డ్యాన్సర్స్.. డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ లో సభ్యత్వం తీసుకున్నాడు. ఏడేళ్లు సహాయకుడిగా పని చేశాడు. 2009లో డ్యాన్స్ డైరెక్టర్ గా అవకాశం వచ్చింది.
- అనంతరం తెలుగు.. తమిళ.. హిందీ సినిమాలు.. టీవీ షోలలో పాల్గొంటూ గుర్తింపు పొందారు. 2017లో ఉత్తరాదికి చెందిన బాలిక ఒక టీవీ షోలో పాల్గొనేందుకువచ్చింది. ఆ షోకు జానీ జడ్జిగా వ్యవహరించేవాడు. ఆమె పోటీ మధ్యలోనే వెళ్లిపోయింది.
- తన సహాయకుడి ద్వారా ఆమెకు ఫోన్ చేసి తన వద్ద పని చేస్తే కెరీర్ లో ఉన్నతంగా ఎదిగే అవకాశాలు ఇస్తామంటూ మాటిచ్చారు. దీంతో 2019లో అతడి వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేరింది. 2020డిసెంబరులో ఇద్దరు సహాయకులతో పాటు ఆమెను ముంబయికి తీసుకెళ్లాడు.
- అక్కడ హోటల్ గదికి వెళ్లే ముందు వారి ఆధార్.. ఇతర పత్రాలు తీసుకున్నారు. అదే రోజు అర్థరాత్రి ఆమెకు ఫోన్ చేసి పత్రాలు తిరిగి ఇచ్చేందుకు ఆమె గదికి వస్తున్నట్లు చెప్పాడు. దాన్ని సాకుగా చేసుకొని గదిలోకి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయటకు పొక్కితే అవకాశాలు దక్కవని.. సహాయకురాలిగా తీసేస్తానని బెదిరించాడు.
- ఆమె మౌనాన్ని అవకాశంగా మార్చుకొని వేర్వేరు ప్రాంతాల్లో సినిమా షూటింగ్ లకు తీసుకెళ్లి హోటల్ గదుల్లో.. వ్యానిటీ వాహనాల్లో రేప్ చేసేవాడు. వేధింపులకు భరించలేక బాధితురాలు కొంతకాలం ఇంటికే పరిమితమైంది. ఆర్థిక ఇబ్బందులతో మళ్లీ షూటింగ్ లలో పాల్గొంది.
- మతం మార్చుకొని పెళ్లి చేసుకోమంటూ జానీ.. అతడి భార్య సుమలత అలియాస్ అయేషా ఆమెను ఒత్తిడి చేయటం మొదలు పెట్టారు. దీంతో బాధితురాలి కుటుంబం మరోచోటుకు షిప్టు అయ్యారు.
- అలా మారిన ఇంటి అడ్రస్ తెలుసుకొని మరీ ఇంటికి వెళ్లి పెళ్లి విషయమై దాడికి పాల్పడేవాడు. ఆమెకు అవకాశాలు రాకుండా చేశాడు. దీంతో బాధితురాలు టీఎఫ్ టీడీడీఏకు కంప్లైంట్ చేసింది. దీంతో సొంతంగాకొరియోగ్రఫీ అవకాశాలు కల్పించారు. నాలుగేళ్లుగా వేధింపులు భరించిన ఆమె.. తన సహాయకుడి సూచనతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- బాధితురాలిని అత్యాచారానికి పాల్పడిన సమయంలో ఆమె మైనరు కావటంతో పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. తాజాగా కోర్టు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.