జానీ మాస్టర్ అరెస్ట్..!
నెల్లూరులో ఉన్నాడని జోరుగా ప్రచారం జరగడంతో అక్కడి పోలీసులను సంప్రదించారు.
By: Tupaki Desk | 19 Sep 2024 7:06 AM GMTస్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాపై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతోంది. ఇటీవల అతడిపై పోక్సో నమోదు చేసిన నార్సింగ్ పోలీసులు.. తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. నెల్లూరులో ఉన్నాడని జోరుగా ప్రచారం జరగడంతో అక్కడి పోలీసులను సంప్రదించారు. కానీ ఆ తర్వాత అక్కడ లేడని తెలుసుకున్నారు.
అయితే పరారీలో ఉన్న జానీ మాస్టర్ ను తాజాగా బెంగళూరులో ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. సిటీలో ఉన్న అతడిని గురువారం ఉదయం అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. సైబరాబాద్ ఎస్ వోటీ పోలీసులు అతడిని ప్రస్తుతం హైదరాబాద్ తీసుకొస్తున్నారు. ఆ తర్వాత నేరుగా ఉప్పర్ పల్లి కోర్టులో హజరుపరచనట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి జ్యుడిషీయల్ కస్టడీకి తరలించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అసలు ఏం జరిగిందంటే
ఓ మహిళా కొరియోగ్రాఫర్.. తనపై పలుమార్లు జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడంటూ రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. జీరో ఎఫ్ ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. నార్సింగ్ స్టేషన్ కు కేసు తరలించారు. అక్కడి పోలీసులు.. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. మైనర్ గా ఉన్న టైమ్ లో కూడా అత్యాచారం చేశాడని బాధితురాలు పేర్కొనడంతో.. పోలీసులు పోక్సో కేసు కూడా నమోదు చేశారు. ఇప్పుడు అరెస్ట్ చేశారు.
అయితే బాధితురాలు ఫిర్యాదులో కీలక విషయాలు వెల్లడించింది. 2017లో జానీ మాస్టర్ తనకు పరిచయమయ్యాడని తెలిపింది 2019లో అతడి టీమ్ లో అసెస్టింట్ కొరియోగ్రాఫర్ గా చేరానని చెప్పింది. ఓ సారి ముంబైలో మూవీ షూటింగ్ కోసం వెళ్లగా.. హోటల్‌లో తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది. ఆ విషయాన్ని ఎవరికైనా చెబితే ఇక సినీ ఇండస్ట్రీలో ఎప్పటికీ వర్క్ చేయని విధంగా చేస్తానని బెదిరించినట్లు తెలిపింది.
ఆ తర్వాత హైదరాబాద్ సహ పలు ప్రాంతాల్లో పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడని ఆరోపణలు చేసింది. వ్యానిటీ వ్యాన్ లో అసభ్యంగా ప్రవర్తించేవాడని పేర్కొంది. ఒకసారి తనపై దాడి కూడా చేశాడని ఆరోపించింది. మతం మారి, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకురాగా, అతడి టీమ్ నుంచి బయటకొచ్చేశానని తెలిపింది. ఆ తర్వాత అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారని చెప్పింది. రీసెంట్ గా కొన్ని రోజుల క్రితం తన ఇంటి ముందు ఏదో పార్సిల్ ఎవరో వేలాడ దీశారని పేర్కొంది. మరి ఈ వ్యవహారంలో చివరకు ఏం జరుగుతుందో చూడాలి.