షాక్: జానీ మాస్టర్‌కు జాతీయ అవార్డ్ రద్దు
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అత్యాచారం కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. అరెస్ట్, జైలు అనంతర పరిణామాలు తెలిసినవే.
By: Tupaki Desk | 6 Oct 2024 3:27 AM GMTకొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అత్యాచారం కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. అరెస్ట్, జైలు అనంతర పరిణామాలు తెలిసినవే. ఇంతలోనే ఇప్పుడు మరో ఎదురు దెబ్బ తగిలింది. జానీ మాస్టర్‌కి ప్రకటించిన జాతీయ అవార్డు రద్దయింది. పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో అవార్డును రద్దు చేస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది.
2022 సంవత్సరానికి గాను ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా జాతీయ చలనచిత్ర అవార్డుకు ఎంపికైన జానీ బాషా న్యూఢిల్లీలో జరిగిన అవార్డు కార్యక్రమానికి హాజరు కావడానికి మధ్యంతర బెయిల్ పొందారు. అక్టోబరు 8న జానీ మాస్టర్ ఈ అవార్డును అందుకోవాల్సి ఉంది. ఇంతలోనే ఈ ప్రకటన ఆశ్చర్యపరిచింది. అయితే అవార్డు రద్దుతో ఆయన బెయిల్ స్టేటస్‌పై సందిగ్ధత నెలకొంది.
మాలీవుడ్ ని ఓ ఊపు ఊపుతున్న `జస్టిస్ హేమ కమిటీ నివేదిక` అనంతరం టాలీవుడ్ లోను మీటూ సెకండ్ వేవ్ మొదలైంది. ఇక్కడ తొలిగా జానీ మాస్టర్ పై పెద్ద ఫిర్యాదు అందింది. అతడి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై జానీ మాస్టార్ పలుమార్లు అత్యాచారం చేసాడని ఫిర్యాదు చేయడం, అనంతరం పోలీసులు అరెస్టు చేసి విచారించడం తెలిసిందే. అయితే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా వేధించిందని జానీ మాస్టర్ ప్రత్యారోపణలు చేసారు.