Begin typing your search above and press return to search.

త‌ప్పు చేసాన‌ని నిరూపిస్తే కొరియోగ్ర‌ఫీ వ‌దిలేస్తా! జానీ మాస్ట‌ర్

టీవీ డ్యాన్సర్స్‌ అండ్‌ డ్యాన్స్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జానీ మాస్టర్ పై సీనియ‌ర్ డాన్స‌ర్ స‌తీష్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   24 Jun 2024 12:32 PM GMT
త‌ప్పు చేసాన‌ని నిరూపిస్తే కొరియోగ్ర‌ఫీ వ‌దిలేస్తా! జానీ మాస్ట‌ర్
X

టీవీ డ్యాన్సర్స్‌ అండ్‌ డ్యాన్స్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జానీ మాస్టర్ పై సీనియ‌ర్ డాన్స‌ర్ స‌తీష్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అసోసియేష‌న్ పేరుతో జానీ మాస్ట‌ర్ అక్ర‌మాల‌కు, బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నాడ‌ని, స్థానికుల్ని తొక్కేసి ముంబై డాన్స‌ర్ల‌కు అవ‌కాశాలు క‌ల్పిస్తున్నాడ‌ని, అసోసియేష‌న్ స‌భ్యుల‌కు హెల్త్ కార్డులు, ఇళ్ల స్థ‌లాలు ఇప్పిస్తాన‌ని కాలం వెళ్ల‌దీస్తున్న‌ట్లు ఆరోపించారు.

అలాగే త‌న‌కు ఉద్యోగం లేకుండా చేస్తున్నాడ‌ని, అసోసియేష‌న్ లో ఎవరైనా మాట్లాడితే వ్య‌క్తిగ‌తంగా ఫోన్లు చేసి డ‌బ్బులిచ్చి మ్యానేజ్ చేస్తున్నాడ‌ని, ప్ర‌శ్నించిన వాళ్ల‌ని బెదిరిస్తున్నాడ‌ని ఆరోపించారు. దీనిపై చ‌ట్ట‌ప‌రంగా పోరాటం చేస్తున్న‌ట్లు..పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు కు వెళ్ల‌గా ఇద్ద‌ర్నీ స‌ముదాయించి పంపిచ‌డం తో కేసు న‌మోదు కాలేదు. ఈ క్ర‌మంలోనే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరును, మెగా ఫ్యామిలీని పేరును కూడా జానీ మాస్టార్ దుర్వినియోగం చేస్తున్నాడ‌ని ఆరోపించారు.

దీంతో జానీ మాస్ట‌ర్ పై ఇండ‌స్ట్రీలో పెద్ద ఎత్తున చ‌ర్చ మొద‌లైంది. అత‌డి ఇలాంటి వ్య‌క్తా? అంటూ బ‌హిరంగంగానే చ‌ర్చించు కున్నారు. తాజాగా ఈ వ్యాఖ్య‌ల్ని జానీ మాస్ట‌ర్ ఖండించారు. `డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ కొంత భూమిని కొన్నామని, దానికి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని, ఆ ఇబ్బందులను అధిగమించి, ఒక పరిష్కారం రావాలనే వుద్దేశంతో తనకి ప్రెసిడెంట్ పదవి ఇచ్చారన్నారు. అలాగే యూనియన్ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం రామ్ చరణ్, ఉపాసన లతో మాట్లాడామని, అది ఇప్పుడు ప్రాసెస్ లో ఉంది అని అన్నారు.

యూనియన్ లో మాట్లాడిన విషయాలను ఎప్పుడూ ఇంటర్నల్ గా ఉంచాలి. కానీ సతీష్‌ స్టేటస్ గా పెట్టడం జరిగింది. ఆలా చెయ్యకూడదు అది తీసెయ్యమని అతన్ని అడిగాము. దానికి అతను చాలా దుర్బాషలాడారు. అదే విషయం యూనియన్ లో చర్చిస్తే సతీష్ తన తప్పుని ఒప్పుకోవటం కూడా జరిగిందన్నారు. యూనియన్ నిబంధనల ప్రకారం సతీష్ కి జరిమానా విధించటం జరిగింది. అంతకముందు సతీష్ కమిటీలో వున్నాడు. ఎవరు తప్పు చేసిన జరిమానా కట్టాలని వాదించారు. అలా వాదించిన సతీష్ ఇప్పుడు తానేంటో చూపిస్తా అని బెదిరించారు.

ఇప్పుడు నేను మీడియా ముందుకు రావ‌డానికి కార‌ణం ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి ఇబ్బంది కాకూడదు అని. ఎందుకంటే నేను అతని పార్టీకి సపోర్ట్ గా ఉన్నాను. కాబట్టి ఇప్పడు ఈ వివరణ ఇస్తున్నాను. నాపై సతీష్ చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, నేను నా పదవికి రాజీనామా చేస్తాను. అలాగే కొరియోగ్రాఫీ కూడా వదిలేస్తాను అన్నారు జానీ. స‌తీష్ అందరికీ రూల్స్ అంటూ చెపుతూ ఉంటారు. కానీ అతను మాత్రం ఆ రూల్స్ ఫాలో అవ్వ‌రు. సతీష్ నాపై వ్యక్తిగతంగా ఎన్నో ఆరోపణలు చేశారు. అలాగే నా పరువుకి భంగం‌ కలిగించారు. కానీ నేను క్షమించి వదిలేస్తాను. అతనిపై న్యాయపరంగా కూడా ఎటువంటి చర్యలు తీసుకునే ఉద్దేశం నాకు లేదు` అని అన్నారు జానీ మాస్టర్.