Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : జపాన్

By:  Tupaki Desk   |   10 Nov 2023 9:53 AM GMT
మూవీ రివ్యూ : జపాన్
X

'జపాన్' మూవీ రివ్యూ

నటీనటులు: కార్తి-అను ఇమ్మాన్యుయెల్-సునీల్-కె.ఎస్.రవికుమార్-విజయ్ మిల్టన్ తదితరులు

సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్

ఛాయాగ్రహణం: రవివర్మన్

మాటలు: రాకేందుమౌళి

నిర్మాతలు: ఎస్.ఆర్.ప్రభు-ఎస్.ఆర్.ప్రకాష్ బాబు

రచన-దర్శకత్వం: రాజు మురుగన్

తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న తమిళ హీరోల్లో ఒకడు కార్తి. గత ఏడాది 'సర్దార్' సినిమాతో ఆకట్టుకున్న అతను.. ఇప్పుడు 'జపాన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ట్రైలర్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం.. సినిమాగా ఏమేర మెప్పించిందో చూద్దాం పదండి.

కథ:

జపాన్ ముని (కార్తి) ఒక దొంగ. చిన్నప్పట్నుంచి అనాథగా పెరిగిన అతను.. పెరిగి పెద్దవాడయ్యేసరికి పెద్ద దొంగగా మారతాడు. ఇండియా మొత్తం భారీ దొంగతనాలు చేస్తూ వివిధ రాష్ట్రాల పోలీసులను ముప్పు తిప్పలు పెడుతుంటాడు. దొంగతనం చేసిన ప్రతి చోటా తన మార్కు చూపించే అతను.. తన మీద తనే ఒక సినిమా కూడా తీసుకుని ఒక థియేటర్లో ఆడిస్తుంటాడు. పోలీసులను గుప్పిట్లో పెట్టుకుని కేసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న జపాన్ మీద ఒక మంత్రికి సంబంధించిన నగల దుకాణంలో ఏకంగా రూ.200 కోట్ల బంగారాన్ని దోచుకున్నట్లు ఆరోపణలు వస్తాయి. వివిధ రాష్ట్రాల పోలీసులు అతడి వెంట పడతారు. కానీ ఆ దొంగతనం చేసింది జపాన్ కాదని.. ఎవరో తెలివిగా అతణ్ని ఈ కేసులో ఇరికించారని తర్వాత తేలుతుంది. ఇంతకీ అసలు దొంగ ఎవరు.. అతణ్ని జపాన్ ఎలా పట్టుకుని తన కథ ముగించాడన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

ఒక సినిమాతో ఇంకో సినిమాకు సంబంధం లేకుండా వైవిధ్యమైన కథలు ఎంచుకుంటాడని.. ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాడని కార్తికి తమిళంలోనే కాక తెలుగులోనూ మంచి పేరుంది. తొలి సినిమా 'పరుత్తి వీరన్'నుంచే తన ప్రత్యేకతను చాటుకుంటున్న కార్తి.. ఇప్పుడు 25వ సినిమా మైలురాయి ముంగిట నిలిచాడు. ఆ కథ.. సినిమా చాలా ప్రత్యేకంగా ఉండే ఉంటుందనుకుంటాం. కానీ సినిమాలో ఏం స్పెషాలిటీ ఉందో చూద్దామని కూర్చుంటే.. అరగంట.. గంట.. గంటన్నర.. ఇలా సమయం గడుస్తూ పోతుంది. కానీ రెండున్నర గంటల తర్వాత కూడా ఆ నిరీక్షణ అలాగే కొనసాగుతుందే తప్ప ఇందులో ఏ ప్రత్యేకతా కనిపించదు. ఎన్నో ఏళ్ల నుంచి చూస్తు్న ఒక పాత.. రొటీన్ కథను ఎంచుకుని ఊరికే హడావుడి చేయడం తప్ప.. ఇందులో ఏ వైవిధ్యం కనిపించదు. కొన్ని కామెడీ పంచులు తప్పిస్తే సినిమాలో చెప్పుకోవడానికి ఏ విశేషం లేదు.

తెర మీద హీరోను దొంగగా చూపించారంటే.. అతను తప్పనిసరి పరిస్థితుల్లోనే దొంగ అయి ఉంటాడని.. దానికో ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని అంచనా వేయడం కష్టం కాదు. ఐతే ఇదేదో కొత్త విషయం.. విశేషం అన్నట్లు చివర్లో ఎమోషనల్ గా ఆ బ్యాక్ స్టోరీ చెప్పి ఎమోషన్ పండించడానికి ప్రయత్నం చేశాడు దర్శకుడు. కానీ అక్కడ సెంటిమెంటు పెద్దగా పండలేదు. ఇక కామెడీ విషయానికి వస్తే 'జపాన్' పాత్రను ఆరంభించిన తీరు కొంచెం ఆసక్తికరంగానే అనిపిస్తుంది. పోలీసులకు దొరక్కుండా భారీ దొంగతనాలు చేయడం.. ఇదంతా రొటీన్ వ్యవహారమే అయినా.. దొంగిలించిన డబ్బుతో హీరో తన మీద తనే సినిమా తీసుకుని ఒక థియేటర్ రెంట్ తీసుకుని అందులో ఆడించుకోవడం లాంటి సీన్లు ఫన్నీగా అనిపిస్తాయి. కానీ ఇలాంటి కొన్ని సీన్లు కొంచెం నవ్వించాయి కదా అని.. మిగతా సినిమానంతా భరించలేం కదా. అందుకు కొత్తగా అనిపించే కథ.. ఆసక్తి రేకెత్తించే కథనం ఉండాలి. కానీ అక్కడే 'జపాన్' తీవ్ర నిరాశకు గురి చేస్తుంది.

'జపాన్'లో కథ మొత్తం కేవలం ఒక దొంగతనం చుట్టూ తిరుగుతుంది. ఎవరో ఆ దొంగతనం చేసి హీరో మీద వేస్తే.. అతను అదెవరో కనుక్కుని వాళ్ల పని పట్టడమే ఈ స్టోరీ. ఇలాంటి చిన్న పాయింట్ల మీద ఉత్కంఠభరిత థ్రిల్లర్ సినిమా తీయొచ్చు కానీ.. కామెడీ సినిమాను నడిపించడం కష్టం. హీరో కాకుండా చెప్పుకోవడానికి సినిమాలో ఒక్క సరైన పాత్ర లేదు. విలన్లను జోకర్ల లాగా మార్చేయడంతో ఏ దశలోనూ సినిమాను సీరియస్ గా తీసుకోలేని పరిస్థితి. హీరోె చుట్టూ ఉన్న వాళ్లే ద్రోహం చేయడం లాంటి పాయింట్లు ఎప్పుడో పాతబడిపోయాయి. ఇక హీరోతో సమాంతరంగా ఒక అమాయకుడి స్టోరీని నడపిస్తూ దాని ద్వారా ఎమోషన్ పండించడానికి చేసిన ప్రయత్నం కూడా తేలిపోయింది. అంతో ఇంతో కార్తి ఎంటర్టైన్ చేస్తున్నా.. ఎటు పోతుందో తెలియని కథ.. విసుగెత్తించే చేజింగ్ ఎపిసోడ్లు సినిమా గ్రాఫ్ ను అంతకంతకూ కిందికి తీసుకెళ్తాయి. ద్వితీయార్ధంలో పూర్తిగా దారి తప్పిన 'జపాన్'.. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. హీరోయిన్ పాత్ర.. ఆమె చుట్టూ నడిపిన అరగంట ఎపిసోడ్ సినిమాకు అతి పెద్ద మైనస్. సినిమాలో అసలా పాత్ర అవసరం ఏముందో అర్థం కాదు. అసలే బోరింగ్ సన్నివేశాలతో విసుగెత్తిస్తుంటే.. సినిమాను ఎంతకీ ముగించకుండా సాగదీసి సాగదీసి ప్రేక్షకుల సహనానికి మరింత పరీక్ష పెట్టాడు దర్శకుడు. మొత్తంగా చూస్తే 'జపాన్' కార్తి కెరీర్లో ఒక మరిచిపోదగ్గ సినిమా అనడంలో సందేహం లేదు.

నటీనటులు:

ఏ పాత్ర ఇచ్చినా దానికి తనదైన స్టైల్ జోడించి పండించే నటుడు కార్తి. ప్రేక్షకులు తన పాత్రతో ప్రేమలో పడేలా చేయడంలో కార్తి దిట్ట. 'జపాన్'లోనూ అతను తనవంతుగా కష్టపడినా.. పాత్రలో బలం లేకపోవడం వల్ల అది అనుకున్నంతగా పండలేదు. డిఫరెంట్ మాడ్యులేషన్లో అతను డైలాగ్ చెప్పడం మొదట్లో బాగా అనిపించినా.. రాను రాను అది ఇరిటేటింగ్ గా తయారైంది. అంతకంతకూ బోరింగ్ గా మారిన సినిమాను కార్తి కూడా కాపాడలేకపోయాడు. అను ఇమ్మాన్యుయెల్ పాత్రలో ఏ విశేషం లేదు. తక్కువ నిడివిలో ముగిసిపోయే పాత్రలో ఆమె గ్లామర్ పరంగా కొంత ఆకట్టుకుంది. పెర్ఫామెన్స్ పరంగా ఆమె గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. సునీల్ గెటప్ పరంగా కొత్తగా కనిపించాడు కానీ.. తన పాత్ర-పెర్ఫామెన్స్ మామూలే. హీరో పక్కనే ఉండే నమ్మకస్థుడి పాత్రలో నటించిన ఆర్టిస్ట్ బాగా చేశాడు. కె.ఎస్.రవికుమార్.. మిగతా నటీనటుల గురించి చెప్పుకోవడానికేమీ లేదు.

సాంకేతిక వర్గం:

జి.వి.ప్రకాష్ కుమార్ పాటల్లో ఏ ప్రత్యేకతా లేదు. నేపథ్య సంగీతం మాత్రం ఆకట్టుకుంది. రవివర్మన్ ఛాయాగ్రహణం స్టైలిష్ గా సాగింది. విజువల్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. రాకేందుమౌళి మాటలు.. కేవలం తమిళ మాటలను అనువాదించడం కాకుండా కొంచెం నేటివిటీ టచ్ ఇచ్చాడు. ఇక కథకుడు.. దర్శకుడు రాజు మురుగన్ అసలీ సినిమాతో ఏం చెప్పదలుచుకున్నాడన్నది అర్థం కాదు. కొన్ని కామెడీ సీన్లు.. పంచుల వరకు ఓకే అనిపించాడు కానీ.. అతడి కథలో కొత్తదనం ఏమీ కనిపించదు. స్క్రీన్ ప్లే పరంగా కూడా ఏ మ్యాజిక్ చేయలేకపోయాడు.

చివరగా: జపాన్.. విషయం తక్కువ హడావుడెక్కువ

రేటింగ్ - 2.25/5

Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater