Begin typing your search above and press return to search.

లిరిసిస్ట్ జావేద్‌తో వివాదం.. ఎట్ట‌కేల‌కు దిగొచ్చిన కంగ‌న‌

ఈగో చాలా స‌మ‌స్య‌ల‌కు మూల కార‌కం. ఇప్పుడు ఆ ఈగోని వ‌దిలి త‌న‌పై ఉన్న ఓ కోర్టు కేసును ప‌రిష్క‌రించుకుంది క్వీన్ కంగ‌న‌.

By:  Tupaki Desk   |   28 Feb 2025 6:42 PM IST
లిరిసిస్ట్ జావేద్‌తో వివాదం.. ఎట్ట‌కేల‌కు దిగొచ్చిన కంగ‌న‌
X

ఈగో చాలా స‌మ‌స్య‌ల‌కు మూల కార‌కం. ఇప్పుడు ఆ ఈగోని వ‌దిలి త‌న‌పై ఉన్న ఓ కోర్టు కేసును ప‌రిష్క‌రించుకుంది క్వీన్ కంగ‌న‌. ఇది నిజంగా మిరాకిల్ అని అభిమానులు భావిస్తున్నారు. వివ‌రంలోకి వెళితే.... క్వీన్ కంగనా రనౌత్ కొన్నేళ్లుగా పాపుల‌ర్ లిరిసిస్ట్ జావేద్ అక్తర్ తో వివాదంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. చాలా కాలంగా ఇది కోర్టులో న‌లుగుతోంది. ఎట్ట‌కేల‌కు ఈ పరువు నష్టం కేసును పరస్పరం పరిష్కరించుకున్నామ‌ని కంగ‌న స్వ‌యంగా వెల్ల‌డించారు.

కంగ‌న పై జావేద్ కేసు వేసి ఏళ్లు అవుతోంది. తాజాగా ఇరువురి న‌డుమా కోర్టు జోక్యంతో రాజీ కుదిరాక అత‌డితో క‌లిసి హ్యాపీగా ఉన్న ఓ ఫోటోని షేర్ చేస్తూ తన భవిష్యత్ చిత్రం కోసం జావేద్ పనిచేసే అవకాశం ఉందని అభిమానులకు అప్‌డేట్ చేసింది. ఈ ఫోటో కోర్టు ప్రాంగణంలోనిది. ఇందులో కంగనా- జావేద్ చాలా జోవియ‌ల్ గా నవ్వుతూ కనిపించారు. ``ఈరోజు కోర్టు కేసును ప‌రిష్క‌రించుకున్నాం. మధ్యవర్తిత్వంలో జావేద్ జీ చాలా దయగల వ్య‌క్తి. ఆయ‌న‌ నా తదుపరి దర్శకత్వానికి పాటలు రాయడానికి కూడా అంగీకరించారు!`` అని కంగనా క్యాప్షన్‌లో రాసింది.

స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో 2016లో బహిరంగ వివాదం త‌లెత్త‌గా, సలహా ఇవ్వడానికి జావేద్ అక్తర్ కంగనా రనౌత్‌ను తన ఇంటికి పిలిపించిన తర్వాత వారి మధ్య ఈగో స‌మ‌స్య త‌లెత్తింది. అది న్యాయ పోరాటానికి దారి తీసింది. తరువాత 2020లో కంగనా ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో హృతిక్ తో వివాదంపై మాట్లాడినందుకు జావేద్ తనను బెదిరించార‌ని కంగ‌న ఆరోపించింది. దీనికి అక్తర్ తనపై పరువు నష్టం దావా వేశారు.

నాలుగేళ్ల (2020లో)కు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత కంగనా ఒక వార్తా ఛానెల్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..జావేద్ అక్తర్ తన సహనటుడు హృతిక్ రోషన్‌కు క్షమాపణ చెప్పమని కోరినట్లు తెలిపింది. క్రిష్ 3లో న‌టించాక‌, 2016లో హృతిక్ తో త‌న సంబంధంపై బహిరంగ వివాదం చెలరేగిన తర్వాత `కంగ‌న‌ను క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తూ` హృతిక్ కంగనాపై దావా వేశారు. అయితే రాజీ బేరం కుదిర్చేందుకు హృతిక్ కి సారీ చెప్ప‌మ‌ని అడిగేందుకు జావేద్ కంగ‌న‌ను త‌న ఇంటికి పిలిపించారు. కానీ ఆ స‌మ‌యంలో కంగ‌న జావేద్ పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసారు.

ఒకసారి జావేద్ అక్తర్ నన్ను అత‌డి ఇంటికి పిలిచి రాకేష్ రోషన్ (హృతిక్ తండ్రి), అతడి కుటుంబం చాలా పెద్ద వ్యక్తులని నాకు చెప్పారు. నువ్వు వాళ్ళకి క్షమాపణ చెప్పకపోతే ఇక ఎక్క‌డికీ వెళ్ళడానికి ఉండదు. వాళ్ళు నిన్ను జైలులో పెడతారు. చివరికి విధ్వంసం ఒక్కటే మార్గం... నువ్వు ఆత్మహత్య చేసుకుంటావు అంటూ నాపై అరిచాడు. నేను అతని ఇంట్లో ఒణికిపోయాను అని కంగ‌న తీవ్రంగా ఆరోపించారు. ఎట్ట‌కేల‌కు కంగ‌న‌- జావేద్ మ‌ధ్య స‌మ‌స్య ప‌రిష్కార‌మైంది. చ‌ట్ట‌ప‌ర‌మైన స‌మ‌స్య‌ను రాజీ మార్గంలో ప‌రిష్క‌రించుకున్నారు.