Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : జవాన్

By:  Tupaki Desk   |   7 Sep 2023 11:32 AM GMT
మూవీ రివ్యూ : జవాన్
X

‘జవాన్’ మూవీ రివ్యూ

నటీనటులు: షారుఖ్ ఖాన్-నయనతార-విజయ్ సేతుపతి-దీపికా పదుకొనే-ప్రియమణి-సాన్యా మల్హోత్రా-సంజయ్ దత్ తదితరులు

సంగీతం: అనిరుధ్ రవిచందర్

ఛాయాగ్రహణం: జీకే విష్ణు

నిర్మాత: గౌరీ ఖాన్

రచన-దర్శకత్వం: అట్లీ

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్.. ఒక సౌత్ దర్శకుడితో జట్టు కట్టడం.. అందులోనూ అది అట్లీ లాంటి మాస్ డైరెక్టర్ కావడం ‘జవాన్’ మీద ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించింది. ఈ సినిమా ట్రైలర్ కమర్షియల్ సినిమా ప్రియుల్లో అంచనాలు పెంచింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘జవాన్’ విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

ముంబయి సిటీలో మెట్రో రైలును కొందరు అమ్మాయిలు.. వాళ్ల గ్యాంగ్ లీడర్ కలిసి హైజాక్ చేస్తారు. ఆ ట్రైన్లోనే ఒక టీనేజీ అమ్మాయి తండ్రి అయిన కాళి గైక్వాడ్ (విజయ్ సేతుపతి) నుంచి వేల కోట్ల రూపాయలు డిమాండ్ చేసి తీసుకున్న కిడ్నాప్ గ్యాంగ్.. ఆ డబ్బుల్ని దేశవ్యాప్తంగా అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్న రైతుల అకౌంట్లలోకి జమ చేస్తుంది. దొరల్ని కొట్టి పేదలకు పంచే ఆ రాబిన్ హుడ్ మరెవరో కాదు.. తన జైల్లో ఉన్న ఖైదీలనే తన మిషన్ కోసం ఉపయోగించుకునే జైలర్ ఆజాద్ (షారుఖ్ ఖాన్) అని తెలుస్తుంది. ఈ రాబిన్ హుడ్ ను పట్టకునే ప్రయత్నంలో ఉన్న నర్మద (నయనతార)కు తన భర్తే తన టార్గెట్ అనే విషయం తెలుస్తుంది. ఇంతలో వీళ్లిద్దరినీ కాళి గైక్వాడ్ బంధించి వారి ప్రాణాలు తీయబోతున్న దశలో విక్రమ్ రాథోడ్ ఎంట్రీ ఇచ్చి వాళ్లను కాపాడతాడు. ఇంతకీ ఎవరీ విక్రమ్ రాథోడ్.. అతడికి ఆజాద్ కు సంబంధం ఏంటి.. ఆజాద్ చేపట్టిన మిషన్ వెనుక ఉద్దేశమేంటి.. ఈ విషయాలన్నీ తెర మీదే చూసి తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ:

తమిళ దర్శకుడు అట్లీకి కెరీర్లో ఇప్పటిదాకా ఫెయిల్యూరే లేదు. అతను తీసిన నాలుగు సినిమాలూ బ్లాక్ బస్టర్లే. తన తొలి చిత్రం ‘రాజా రాణి’ చూస్తే.. మన దగ్గర ఎప్పుడో 90ల చివర్లో వచ్చిన ‘శ్రీమతి వెళ్లొస్తా’ అటు ఇటు మార్చి తీసినట్లు అనిపిస్తుంది. రెండో సినిమా ‘తెరి’ని పరిశీలిస్తే.. ‘బాషా’ సహా చాలా సినిమాలను మిక్సీలో వేసి కొట్టిన ఫీలింగ్ కలుగుతుంది. ఆపై వచ్చిన మెర్శల్.. బిగిల్ సైతం ఎన్నెన్నో సినిమాలను గుర్తు చేసేవే. పాత సినిమాల కథలకే కొంచెం ట్రీట్మెంట్ మార్చి.. కమర్షియల్ ప్యాకేజీలా అందించి మెప్పించడం అతడి ప్రత్యేకత. తన సినిమాలు కొత్తగా అనిపించవు. అదే సమయంలో బోర్ కొట్టించకుండా అలా అలా నడిచిపోతాయి. మాస్ అంశాలు.. ఎలివేషన్లకు లోటు లేకుండా చూసుకుంటూ తన హీరో అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకులనూ మెప్పించి మార్కులు కొట్టేస్తాడు అట్లీ. ఇప్పుడు అతను బాలీవుడ్లో అడుగు పెట్టినా పంథా మార్చలేదు. ‘జవాన్’ సినిమా చూస్తుంటే.. సౌత్ ఇండియాలో వచ్చిన ఒకటీ రెండు కాదు.. పదుల సినిమాలు గుర్తుకు వస్తాయి. మనకు బాగా అలవాటై.. అరిగిపోయిన కమర్షియల్ ఫార్ములాలో షారుఖ్ ఖాన్ ను చూడటమే ఇందులో కొత్తదనం. బోలెడన్ని ఎలివేషన్ సీన్లు.. యాక్షన్ ఘట్టాల మధ్య షారుఖ్ మార్కు ఎంటర్టైన్మెంట్ కూడా తోడవడంతో ‘జవాన్’ పైసా వసూల్ అనిపిస్తుంది. అంతకుమించి కొత్తగా ఇందులో ఆశించడానికేమీ లేదు.

బాగా డబ్బున్నోళ్ల దగ్గర కొట్టేసి అభాగ్యులకు పంచే రాబిన్ హుడ్ కథలు ఈనాటివి కావు. ‘జెంటిల్ మేన్’తో బాగా పాపులర్ అయిన ఈ ఫార్ములాను మన సౌత్ ఇండియన్ రైటర్లు.. డైరెక్టర్లు పీల్చి పిప్పి చేసేశారు. ‘జవాన్’లో మళ్లీ మళ్లీ అదే కథను చూస్తాం. కథ అనే కాదు.. ఇందులో ఎన్నో ఎపిసోడ్లు.. సన్నివేశాలు ఏమాత్రం కొత్తదనం లేకుండా మనం చాలాసార్లు చూసిన ఫీలింగే కలిగిస్తాయి. ఒక సీన్ చూస్తుండగా.. ఇలాంటి సీనే మనం ఎక్కడో చూశామే అనుకుంటుండగా.. మరేదో సినిమాలో సన్నివేశాన్ని గుర్తు చేసే ఇంకో సీన్ వచ్చి పడిపోతుంది. దీంతో ఈ పోలికలు పక్కన పెట్టి హీరో అండ్ కో చేసే విన్యాసాలను ఎంజాయ్ చేయడానికి పూనుకోవాలి. చావు అంచుల్లో ఉన్న హీరో ఒక నదిలో కొట్టుకురావడం.. ఊరి జనం అతణ్ని కాపాడి పునర్జన్మ ఇవ్వడం.. ఆ ఊరికి కష్టం వస్తే హీరో లేచి వాళ్లను రక్షించడం.. ఇలా ఒక ఫార్ములాటిక్ ఇంట్రో సీన్ తో హీరోను పరిచయం చేసినపుడే.. ‘జవాన్’ సగటు కమర్షియల్ సినిమాల ఫార్మాట్లో సాగబోతోందని అర్థమైపోతుంది. ఆ తర్వాత రాబిన్ హుడ్ కాన్సెప్ట్ చూస్తాం. కాన్సెప్టులన్నీ పాతవే అయినా.. హీరో ఎలివేషన్ సీన్లు.. యాక్షన్ ఘట్టాలను రేసీగా.. గూస్ బంప్స్ ఇచ్చేలా తీయడంలో అట్లీకి ఉన్న నైపుణ్యం.. బ్రేకుల్లేకుండా సాగిపోయే స్క్రీన్ ప్లే ప్రేక్షకులకు కుదురుగా ఉంచుతాయి.

మొదట్నుంచి విలన్ల మీద ఆధిపత్యం చలాయిస్తున్న హీరో.. విలన్ చేతికి చిక్కి ఇబ్బందుల్లో పడితే అదే పోలికలతో ఉండే ఇంకో హీరో రంగంలోకి దిగి ట్విస్ట్ ఇవ్వగానే ఇంటర్వెల్ కార్డ్ పడటం సహా ఇందులో అన్నీ సౌత్ ఇండియన్ కమర్షియల్ ఫార్ములాకు అనుగుణంగానే సాగుతాయి. కొత్తదనం కోసం చూడకుండా సగటు మాస్ సినిమాలో ఏం అంశాలు ఉంటాయో అంచనా వేసుకుని.. ముందుకు సాగిపోతే ‘జవాన్’ను ఎంజాయ్ చేయగలం. ప్రథమార్ధంలో కథలో కొన్ని మలుపులు ఉంటాయి కానీ.. ద్వితీయార్ధం అయితే మరీ రొటీన్ అనిపిస్తుంది. కానీ ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధంలో యాక్షన్ డోస్ ఇంకా పెంచాడు అట్లీ. చూపు తిప్పుకోనివ్వకుండా చేసే కొన్ని యాక్షన్ ఎపిసోడ్లు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి. ఓల్డ్ షారుఖ్ క్యారెక్టర్.. ఈ పాత్రలో షారుఖ్ హావభావాలు కూడా ఆకట్టుకుంటాయి. మధ్యలో సంజయ్ దత్ క్యామియో కూడా కొంచెం హుషారు పుట్టిస్తుంది. పతాక సన్నివేశాలను.. షారుఖ్-విజయ్ సేతుపతి కలిసి నిలబెట్టారు. కథ పరంగా అయితే ఇందులో విశేషం ఏమీ లేదు. ముందే అన్నట్లు సగటు సౌత్ ఇండియన్ కమర్షియల్ ప్యాకేజీ కథలో షారుఖ్ ఖాన్ కనిపించడమే దీని ప్రత్యేకత.

నటీనటులు:

షారుఖ్ ఖాన్ అభిమానులకు ‘పఠాన్’ తర్వాత మరో విందుగా ‘జవాన్’ను చెప్పొచ్చు. ‘పఠాన్’ను మించిన ఎలివేషన్లు.. యాక్షన్ ఘట్టాల్లో షారుఖ్ ను చూసి అభిమానులు ఎంజాయ్ చేయొచ్చు. గడ్డం గీసుకుని కనిపించే యంగ్ క్యారెక్టర్లో కనిపించే సీన్లు తప్పితే.. షారుఖ్ సినిమా అంతా బాగానే ఎంగేజ్ చేశాడు. తన పాత్రలో వేరియేషన్లు చూపించాడు. మెస్మరైజింగ్ గా అనిపించే షారుఖ్ స్క్రీన్ ప్రెజెన్స్.. తన మార్కు ఎంటర్టైనింగ్ డైలాగులు అభిమానులనే కాక సగటు ప్రేక్షకులను కూడా అలరిస్తాయి. షారుఖ్ పక్కన నయనతార ఓ మోస్తరుగా అనిపిస్తుంది. ఆమె పాత్ర.. నటన రొటీనే. తనకంటే.. తక్కువ నిడివిలో కనిపించిన దీపికా పదుకొనేనే ఎక్కువ ఇంపాక్ట్ వేసింది. విలన్ గా విజయ్ సేతుపతి పాత్ర అనుకున్నంత స్థాయిలో లేదు. అతను పతాక సన్నివేశాల్లో ఆకట్టుకున్నాడు. అంతకుముందు చాలా సీన్లలో ఇరిటేట్ చేశాడు. తన లుక్ కూడా సెట్ కాలేదు. సంజయ్ దత్ క్యామియో బాగుంది. ప్రియమణి.. సాన్యా మల్హోత్రాలవి అంతగా ప్రాధాన్యం లేని పాత్రలే. వారి పెర్ఫామెన్స్ ఓకే.

సాంకేతిక వర్గం:

సినిమా నిండా హీరో ఎలివేషన్లు.. యాక్షన్ ఘట్టాలు.. అనిరుధ్ రవిచందర్ కు ఇంతకంటే కావాల్సిందేముంది? వాటిని తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో బాగానే ఎలివేట్ చేశాడు. ట్రైలర్లో హైలైట్ అయిన ఇంగ్లిష్ హమ్మింగ్ సినిమాలో భలేగా అనిపిస్తుంది. సినిమా అంతటా బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు కూడా ఓకే. జీకే విష్ణు ఛాయాగ్రహణం బాగుంది. సినిమా చాలా రిచ్ గా తీశారు. ఆద్యంతం భారీతనం కనిపిస్తుంది. అట్లీ.. తనకు అలవాటైన పనినే ఈ సినిమాలోనూ చేశాడు. పాత సినిమాలను మిక్సీలో ఒక కథ తయారు చేసుకుని.. దానికి రేసీ స్క్రీన్ ప్లే సెట్ చేసుకుని.. హీరో ఇమేజ్ కు తగ్గ ఎలివేషన్లు.. యాక్షన్ ఘట్టాలతో సినిమాను లాగించేశాడు. అట్లీ గత సినిమాలు చూసిన వాళ్లు తన నుంచి ఏం ఆశిస్తారో అదే ఇచ్చాడతను. కొత్తగా తన నుంచి ఏదైనా కోరుకుంటే మాత్రం నిరాశ తప్పదు.

చివరగా: జవాన్.. సౌత్ సీసాలో కొత్త షారుఖ్

రేటింగ్ - 2.75/5