Begin typing your search above and press return to search.

రాజ‌మౌళి త‌ర్వాత పారితోషికంలో టాప్ డైరెక్ట‌ర్

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి ఒక్కో సినిమాకు 100 కోట్ల ప్యాకేజీతో పాటు లాభాల్లో వాటాలు తీసుకుంటార‌న్న ప్ర‌చారం ఉంది

By:  Tupaki Desk   |   6 Sep 2023 4:17 AM GMT
రాజ‌మౌళి త‌ర్వాత పారితోషికంలో టాప్ డైరెక్ట‌ర్
X

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి ఒక్కో సినిమాకు 100 కోట్ల ప్యాకేజీతో పాటు లాభాల్లో వాటాలు తీసుకుంటార‌న్న ప్ర‌చారం ఉంది. బాహుబ‌లి ఫ్రాంఛైజీతో పాటు, ఆర్.ఆర్.ఆర్ చిత్రానికి అత‌డు భారీ పారితోషికాలు అందుకున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. నిజానికి స్టార్ హీరోల్లో అమీర్ ఖాన్, ర‌జ‌నీకాంత్, ప్ర‌భాస్ ఇప్ప‌టికే 100 కోట్లు అందుకుంటున్న వారి జాబితాలో ఉన్న‌ట్టు క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి. ద‌ర్శ‌కుల్లో వంద కోట్ల ప్యాకేజీ అనేది అరుదు. కానీ హీరోల‌కు ధీటుగా టాప్ డైరెక్ట‌ర్స్ పారితోషికాలు అందుకుంటున్నార‌న్న‌ది నిజం. ప‌లువురు ద‌ర్శ‌కులు సుమారు 20- 30కోట్ల‌కు ద‌గ్గ‌రగా పారితోషికాలు అందుకుంటున్నారు.

రాజ్ కుమార్ హిరాణీ, అశుతోష్ గోవారిక‌ర్, సంజ‌య్ లీలా భ‌న్సాలీ, రోహిత్ శెట్టి లాంటి టాప్ డైరెక్ట‌ర్లు భారీ పారితోషికాలు అందుకుంటున్నార‌న్న క‌థ‌నాలు ఉన్నాయి. కానీ రాజ‌మౌళి త‌ర్వాత భారీ పారితోషికం అందుకుంటున్న మ‌రో ద‌ర్శ‌కుడు ఎవ‌రు? అన్న‌ది ఆరా తీస్తే, ఇప్పుడు సౌతిండియాలోనే మ‌రో పేరు వినిపిస్తోంది. త్వ‌ర‌లో షారూఖ్ న‌టించిన 'జ‌వాన్' విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న వేళ త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీ పేరు దేశ‌వ్యాప్తంగా మార్మోగుతోంది. అత‌డికి షారూఖ్ ఖాన్ రెడ్ చిల్లీస్ బ్యాన‌ర్ దాదాపు 30కోట్ల పారితోషికం ముట్టజెబుతోంద‌ని స‌మాచారం. తాజా క‌థ‌నాల ప్రకారం అట్లీ తాను దర్శకత్వం వహించే ప్రతి చిత్రానికి సుమారుగా రూ. 52 కోట్లు వసూలు చేస్తాడు. అయితే జవాన్ కోసం తన స్టాండర్డ్ ఫీజును తగ్గించాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. జ‌వాన్ కోసం కేవ‌లం 30 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నాడ‌ని తెలుస్తోంది. ద‌ళ‌ప‌తి విజ‌య్ కి హ్యాట్రిక్ విజ‌యాల‌ను అందించిన అట్లీకి కోలీవుడ్ లో భారీ డిమాండ్ ఉంది. ఇప్పుడు అత‌డి పేరు హిందీ ప‌రిశ్ర‌మ‌లోను మార్మోగుతోంది.

తిరుమ‌లేశుని చెంత‌కు జ‌వాన్

జవాన్ విడుద‌ల సంద‌ర్భంగా.. షారుక్ ఖాన్ దేశవ్యాప్తంగా ప‌లుచోట్ల‌ పవిత్ర స్థలాలను సందర్శిస్తున్నాడు. ఆయన ఇటీవల తిరుమ‌ల‌లో కనిపించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దేవాదిదేవుని సంద‌ర్శించుకున్నారు. అంతకుముందు వైష్ణో దేవి ఆలయాన్ని కూడా షారూఖ్‌ సందర్శించారు. ఆన్‌లైన్‌లో కనిపించిన వీడియోలో షారూఖ్ మాస్క్ ధరించి తనను ఎవ‌రూ గుర్తించ‌కుండా దాచడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించింది. కానీ ఖాన్ ని అభిమానులు గుర్తు ప‌ట్టేస్తున్నారు. మ‌రోవైపు అట్లీ సైతం త‌మిళ‌నాడులోని ప‌లు దేవాల‌యాల‌ను సంద‌ర్భిస్తున్నారు. జ‌వాన్ విజ‌యం కోసం ప్రార్థిస్తున్నార‌ని స‌మాచారం.

SRK ఈ సంవత్సరం ప్రారంభంలో 'పఠాన్'తో ఘ‌న‌విజ‌యం అందుకున్నాడు. జ‌వాన్ తో బ్యాక్ టు బ్యాక్ హిట్టు కొట్టాల‌ని క‌సిగా ప‌ని చేసాడు. ఈ చిత్రంలో నయనతార, విజయ్ సేతుపతి కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రత్యేక అతిధి పాత్రల్లో దీపికా పదుకొనే, సంజయ్ దత్త ద‌ళ‌పతి విజయ్ క‌నిపిస్తారు. సన్యా మల్హోత్రా, ప్రియమణి, రిధి డోగ్రా వంటి నటీనటులు ఈ చిత్రంలో సహాయక పాత్రల్లో కనిపించనున్నారు.

ప్రపంచవ్యాప్తంగా హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ఈ గురువారం (7 సెప్టెంబర్ 2023) థియేటర్లలోకి రానుంది.

గత శుక్రవారం అడ్వాన్స్ బుకింగ్‌లు ప్రారంభం కాగా ఇంటా బ‌య‌టా ఈ చిత్రం ఓపెనింగుల‌ రికార్డులు బ్రేక్ చేయ‌నుంద‌ని క‌థ‌నాలొచ్చాయి. అభిమానులు ఇప్పటికే ఆన్ లైన్ లో టిక్కెట్లను బుక్ చేసుకున్నారు. SRK అభిమాన సంఘాలు జవాన్ మొదటి రోజు మొదటి షో కోసం మొత్తం థియేటర్ హాళ్లను బుక్ చేసుకున్నాయి. ఇందులో ఐకానిక్ గెయిటీ గెలాక్సీ కూడా ఉంది. ఈ థియేటర్‌లో ఉదయం 6 గంటలకు షో నిర్వహించడం ఇదే తొలిసారి.